iDreamPost

Sammathame Movie Review సమ్మతమే రివ్యూ

Sammathame Movie Review సమ్మతమే రివ్యూ

రాజావారు రాణిగారుతో మంచి డెబ్యూ అందుకుని రెండో చిత్రం ఎస్ఆర్ కళ్యాణమండపంతో ఊహించని సూపర్ హిట్ అందుకున్న కిరణ్ అబ్బవరం కొత్త మూవీ సమ్మతమే ఇవాళ థియేటర్లలో అడుగు పెట్టింది. బాక్సాఫీస్ వద్ద ఏకంగా ఎనిమిది సినిమాలు రావడం ఈ మధ్యకాలంలో జరగలేదు. వాటిలో అంతో ఇంతో అంచనాలు సాఫ్ట్ కార్నర్ ఉన్నది దీనికే. ప్రమోషన్లు కూడా గట్టిగానే చేశారు. సెబాస్టియన్ భారీ ఫ్లాప్ కావడంతో కిరణ్ ఆశలు దీని మీదే ఉన్నాయి. రాబోయే రోజుల్లో అన్ని పెద్ద బ్యానర్ల ప్రాజెక్స్ ఉండటంతో ఇప్పుడివి సక్సెస్ కావడం చాలా కీలకం. మరి ఈ సమ్మతమే ప్రేక్షకుల అంగీకారాన్ని అందుకుందో లేదో చూద్దాం

కథ

తల్లి(సితార)చనిపోయాక ఇంటికి ఆడపిల్ల వస్తేనే కళ ఉంటుందన్న తండ్రి మాటను నమ్మిన కృష్ణ(కిరణ్ అబ్బవరం)చిన్నప్పటి నుంచే పెళ్లి కోసం ఎదురు చూస్తుంటాడు. అనుకున్నట్టే హైదరాబాద్ లో ఉద్యోగం తెచ్చుకుని ఇల్లు కట్టే స్థితికి చేరుతుంటాడు. అప్పుడు మొదట పెళ్లి చూపులకు వెళ్లిన అమ్మాయే శాన్వి(చాందిని చౌదరి). చాలా సాంప్రదాయ ఆలోచనలున్న కృష్ణ అప్పటికే శాన్వికి బ్రేకప్ ఉందని తెలుసుకుని పెళ్లి వద్దనుకుంటాడు. కానీ తనను మర్చిపోలేక స్నేహం మొదలుపెడతాడు. మార్చుకుంటాననే నమ్మకంతో తిరిగి ప్రయాణం మొదలుపెడతాడు. తిరిగి ఈ జంట సమ్మతమేనని కలుసుకుందా లేదా అనేదే అసలు స్టోరీ

నటీనటులు

అచ్చం పక్కింటి కుర్రాడిలా కనిపించే కిరణ్ అబ్బవరం ఇందులో అదే ఈజ్ తో చేశాడు. ఎమోషన్లు ఎక్కువ డిమాండ్ చేసే క్యారెక్టర్ కాకపోవడంతో ఈసారి ఎంటర్ టైన్ చేయడానికి కొంత స్కోప్ దక్కింది. కానీ ఎందుకో తన ఎనర్జీని వాడుకోవడంతో దర్శకుడు తడబడటంతో ఎక్కువ శాతం డల్ గా అనిపిస్తాడు. ఫస్ట్ హాఫ్ కామెడీ సీన్స్ లో తన తోటి నటీనటులతో నవ్వించే ప్రయత్నం చేశాడు. అయినా అక్కడ హాస్యం రాలేదంటే తనను తప్పుబట్టడానికి లేదు. రైటింగ్ లోపమది. ఎస్ఆర్ కళ్యాణమండపంతో కిరణ్ కో ఇమేజ్, చేసే కంటెంట్ మీద కాసిన్ని అంచనాలు ఏర్పడ్డాయి. వాటిని దృష్టిలో పెట్టుకునే ఇకపై సబ్జెక్ట్ సెలక్షన్ చేసుకోవాల్సిన అవసరం ఉంది

చాందిని చౌదరిని ఎక్కువగా వెబ్ సిరీస్ లు, ఓటిటిలో చూడటం వల్ల కాబోలు తను ఎంత బాగా నటించినా బిగ్ స్క్రీన్ మీద రెండున్నర గంటల పాటు చూసే హీరోయిన్ మెటీరియల్ కాదనిపిస్తోంది. నటన పరంగా వంక పెట్టడానికి లేదు కానీ సగటు తెలుగు ప్రేక్షకుడి కోణంలో ఆలోచిస్తే ఇలాంటి ప్రేమకథలు పండాలంటే ఇంతే టాలెంట్ ఉన్న కొత్తమ్మాయిలు అయితే ఫలితం ఇంకా బాగా ఉండేది. గోపరాజు రమణ క్రమంగా రొటీన్ అవ్వడం మొదలయ్యారు. సప్తగిరి-తమిళ కమెడియన్ గుండు రాజేందర్ కామెడీ మరీ బి గ్రేడ్ కన్నా తక్కువగా ఉంది. అన్నపూర్ణమ్మను వృధా చేశారు. కిరణ్ పక్కన హాస్యనటుడిని వాడుకోవడం రాలేదు

డైరెక్టర్ అండ్ టీమ్

ఏ కాలంలో అయినా ప్రేమకథల ప్రయాణం గమ్యం ఒకేలా ఉంటాయి. అది బాలచందరైనా త్రివిక్రమైనా వాళ్ళు వెళ్లే మార్గం ఒకటే. కాకపోతే వాహనాలు ఎంచుకోవడంలో తమ తెలివిని ప్రతిభను వాడి సక్సెస్ లు అందుకుంటారు. గోపినాధ్ రెడ్డి తీసుకున్నది చాలా చిన్న లైన్. అరగంటలో ఈజీగా చెప్పేయొచ్చు. కానీ దీన్ని సినిమాగా చూపించాలన్న తాపత్రయం ఎందుకు కలిగిందో కానీ ఆ ఒక్క కారణమే అవసరం లేని చాలా ల్యాగ్ కు కారణం అయ్యింది. ఏ పాత్రకూ సరైన ఎస్టాబ్లిష్ మెంట్ ఉండదు. గొప్పగా ప్రొజెక్ట్ చేద్దామని ప్రయత్నించిన కృష్ణ క్యారెక్టర్ సైతం క్లైమాక్స్ వరకు అవసరం లేని కన్ఫ్యూజన్ తో కొట్టుమిట్టాడుతూ ఉంటాడు.

హీరో హీరోయిన్ పరిచయం, వాళ్ళ మధ్య చిన్న గ్యాప్, చివరికి వచ్చే సరికి సెల్ఫ్ గానో లేక ఇంకో పాత్ర ద్వారానో జ్ఞానోదయం కలిగించుకోవడం ఎన్నోసినిమాల్లో చాలాసార్లు చూశాం. అయినా వాటిలో చాలా మటుకు హిట్ అయ్యాయంటే కారణం ప్రేక్షకులను చివరిదాకా కూర్చోబెట్టగలిగిన వినోదం, లెన్త్ ఎంతున్నా బోర్ కొట్టించని వైవిధ్యం. సమ్మెతమే టేకాఫ్ స్లోగా ఉన్నప్పటికీ కృష్ణ శాన్వి మధ్య ఫ్రెష్ సన్నివేశాలు వస్తాయని ఆశిస్తాం. అది కొంత వరకు వర్కౌట్ అయ్యింది కూడా. ఎప్పుడైనా అసలైన కాన్ఫ్లిక్ట్ మొదలయ్యిందో అక్కడి నుంచి గోపినాధ్ కూడా అయోమయానికి గురై సాగతీత సన్నివేశాలన్నీ పేర్చుకుంటూ పోయి విసుగు తెప్పిస్తాడు.

కృష్ణ అసలెందుకు శాన్వి కోసం అంతగా పరితపించిపోతాడో కన్విన్సింగ్ గా ఉండదు. మందు తాగుతూ అబ్బాయిలతో చనువుగా ఉండే ఆ అమ్మాయి తన స్వభావానికి విరుద్ధంగా ఉండే కృష్ణని పదే పదే ఎందుకు భరిస్తుందో అంతు చిక్కదు. ఏదో వాళ్లద్దరూ ప్రతి అయిదు నిమిషాలకోసారి కలుసుకోవాలన్నట్టు సీన్లు వస్తూ పోతూ ఉంటాయి దేనికీ ప్రాపర్ కనెక్షన్ ఉండదు. ఖుషి టైపులో ఏదో చెప్పాలనుకున్నారు కానీ అది కాస్తా ప్రెజెంటేషన్ సరిగా లేకపోవడం వల్ల యుట్యూబ్ కంటెంట్ గా తోస్తుంది. దానికి తోడు లీడ్ పెయిర్ మీదే ఫోకస్ పెట్టి మిగిలిన పాత్రలను అశ్రద్ధ చేయడంతో ఉన్న కాస్తో కూస్తో మంచి క్యాస్టింగ్ కూడా వృథా అయ్యింది.

ఒకపక్క ఓటిటిలో క్వాలిటీ కంటెంట్ పెరుగుతూ ఉంటే సాగతీత సరుకుతో జనాన్ని థియేటర్లకు రప్పించలేమని ఈ మధ్యకాలంలో చాలా సార్లు ఋజువయ్యింది. రచయిత ఎవరైనా చుట్టూ ఉన్న నలుగురు స్నేహితులతో షేర్ చేసుకున్న స్టోరీ పాయింట్ వాళ్ళు బ్రహ్మాండంగా ఉందనగానే తెరకెక్కించేందుకు తొందరపడకూడదు. ప్రాక్టికల్ గా ఆలోచించి రేపు హాళ్లలో చూడబోయే లక్షలాది ఆడియన్స్ ని మెప్పించేంత మ్యాటర్ ఉందా లేదా అనేది స్క్రిప్ట్ స్టేజిలోనే చెక్ చేసుకోవాలి. స్క్రీన్ వైపు చూస్తున్న వాళ్ళను జేబులో నుంచి ఫోన్ బయటికి తీయకుండా చేయడమే ఇప్పటి దర్శకులు ఎదురుకుంటున్న పెద్ద సవాల్. ఇది గుర్తుంచుకుంటేనే గెలవగలరు.

ఇది బొమ్మరిల్లు జమానా కాదు. అయినా దాన్ని ఇప్పటికీ బెస్ట్ ఎంటర్ టైనర్ గా ఎందుకు ఫీలవుతామంటే డైలాగ్స్ తో మొదలుపెట్టి టేకింగ్ దాకా, మ్యూజిక్ తో స్టార్ట్ చేసి ఆర్టిస్టుల పెర్ఫార్మన్స్ దాకా అన్ని సమిష్టిగా కొత్తదనం కోసం తపించాయి కాబట్టి. సమ్మతమేలో కృష్ణ శాన్విల సంఘర్షణ కూడా ఆ స్థాయిలో సగం ఉన్నా చాలు ఇప్పటి ఆడియన్స్ నెత్తినబెట్టుకుంటారు. కానీ గోపినాథ్ రెడ్డి ఆ అవకాశాన్ని వృధా చేసుకున్నారు. యూత్ లో ఒక వర్గం కొంత మేరకు కనెక్ట్ అవొచ్చేమో కానీ అది హౌస్ ఫుల్స్ చేసేంత రేంజ్ లో ఉంటుందని మాత్రం చెప్పలేం. ఎమోషన్లంటే విపరీతమైన సాగతీత, చాంతాడంత డైలాగులు కాదని గుర్తుంచుకుంటే బెటర్.

శేఖర్ చంద్ర పాటల్లో ఒకటి రెండు బాగున్నాయి అంతే. మిగిలినవి సోసోనే. ఇలాంటి లవ్ స్టోరీస్ కి బెస్ట్ ఆల్బమ్ పడాలి. కనీసం వాటి కోసమైనా థియేటర్ కు వెళ్ళాలనే ఉత్సాహం కలిగించాలి. కానీ సమ్మతమేలో అవి కుదరలేదు. నేపధ్య సంగీత ఒక స్టేజి దాటాక సీన్ల లాగే అదీ రిపీట్ మోడ్ లోకి వెళ్లిపోయింది. సతీష్ రెడ్డి ఛాయాగ్రహణం పర్లేదు. డీసెంట్ గా సాగింది. విప్లవ్ ఎడిటింగ్ మొహమాటపడింది. సంభాషణలు అక్కడక్కడా ఓ పర్లేదు అనిపించాయి తప్ప గొప్పగా లేవు. నిర్మాణ విలువలు బడ్జెట్ కు తగ్గట్టు చాలా క్యాలికులేటెడ్ గా సాగాయి. పెద్దగా రిస్క్ తీసుకోకుండా ఖర్చు పెట్టడంతో తెలివిగా బయట పడే ఛాన్స్ ఎక్కువగా ఉంది

ప్లస్ గా అనిపించేవి

కిరణ్ అబ్బవరం
రెండు పాటలు
ఛాయాగ్రహణం

మైనస్ గా తోచేవి

క్యారెక్టరైజేషన్స్
రొటీన్ స్టోరీ
మెయిన్ కాంఫ్లిక్ట్
సాగతీత

కంక్లూజన్

ప్రేమకథ కదా కాస్త పేరున్న హీరో హీరోయిన్ చేస్తే యూత్ ఎగబడి థియేటర్లో చూసేస్తారన్న గ్యారెంటీ లేని రోజులివి. ఎంత లవ్ స్టోరీ అయినా సరే చెబుతున్న విధానం బలంగా ఎంటర్ టైనింగ్ గా ఉంటేనే వాళ్ళైనా టికెట్లు కొని చూస్తారు. లేదంటే ఇంకో రెండు మూడు వారాలు ఆగితే ఓటిటిలో వస్తుంది కదాని లైట్ తీసుకుంటున్నారు. అలాంటప్పుడు యంగ్ రైటర్స్ డైరెక్టర్స్ తమ కలాలకు మరింత పదును పెట్టాలి. కథను దాన్ని రాసుకున్న వాళ్ళు ప్రేమిస్తే సరిపోదు. సీట్లో కూర్చున్న ప్రేక్షకులు ప్రేమిస్తేనే హిట్టో సూపర్ హిట్టో దక్కుతుంది. లేదంటే ఇలా మాములు సమ్మతాలతో జనాల సమ్మతం మళ్ళీ మళ్ళీ పొందటం కష్టం.

ఒక్క మాటలో – కష్టమే

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి