iDreamPost
iDreamPost
తెలుగు సినిమా స్థాయిని అమాంతం పెంచేలా ఒకే నెలలో రాబోతున్న రెండు ఫ్యాన్ ఇండియా సినిమాల్లో ఒకటి రాధే శ్యామ్ ఇవాళ ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదలయ్యింది. అంచనాలు ఆకాశాన్ని తాకడంతో బెనిఫిట్ షోల నుంచే సందడి ఓ రేంజ్ లో ఉంది. బాహుబలి, సాహోల తర్వాత ప్రభాస్ చేసిన చిత్రం కావడంతో అభిమానుల ఎగ్జైట్మెంట్ మాములుగా లేదు. ఊహాతీతమైన కథల ద్వారా ఓ కొత్త జానర్ ని ఆవిష్కరిస్తున్న ఇలాంటి ప్రయత్నాలు టాలీవుడ్ లో అరుదు. యువి క్రియేషన్స్ తో పాటు కృష్ణంరాజుగారి గోపికృష్ణ మూవీస్ సంయుక్తంగా నిర్మించిన రాధే శ్యామ్ ఏ మేరకు ప్రేక్షకులను మెప్పించేలా సాగిందో రివ్యూలో చూద్దాం
కథ
ఇది ఇటలీ నేపథ్యంలో సాగే 1976 నాటి కథ. విక్రమాదిత్య(ప్రభాస్)సుప్రసిద్ధ హస్తసాముద్రికుడు. చెయ్యి చూసి గతం భవిష్యత్తు చెప్పగల దిట్ట. ఇతని కోసం ప్రముఖులు క్యూ కడుతుంటారు. ప్రేమ పెళ్లి మీద ఆసక్తి చూపించని ఆదిత్య ఓ సందర్భంలో డాక్టర్ ప్రేరణ(పూజా హెగ్డే)ని చూసి మనసు పారేసుకుంటాడు. ముందు కాదన్నా ప్రేరణ తర్వాత ఒప్పుకుంటుంది. కానీ విధి ఆడిన వింత నాటకంలో ఇద్దరూ విడిపోయే పరిస్థితులు వస్తాయి. అందరి జాతకాలు చూసి చెప్పే విక్రమాదిత్య తనది ప్రేరణది ముందే చూసుకోలేకపోయాడా, తలరాత ఆడిన యుద్ధంలో చివరికి గెలిచాడా లేక తలవంచాడా అనేది తెరమీద చూసి తెలుసుకోవాల్సిందే.
నటీనటులు
ఆరడుగుల మోస్ట్ వాంటెడ్ నేషనల్ కటవుట్ గా మారిపోయిన ప్రభాస్ ఇందులో విక్రమాదిత్య పాత్రకు పర్ఫెక్ట్ ఛాయస్. ఆ క్యారెక్టర్ డిమాండ్ చేసిన హుందాతనం, ధీటైన విగ్రహం చక్కగా కుదిరాయి. ప్రేమికుడిగానూ లుక్స్ పరంగా మెప్పించాడు. యాక్టింగ్ గురించి కొత్తగా చెప్పడానికి ఏముంది. తన పరిధిలో దర్శకుడు అడిగినంత కష్టపడ్డాడు. డబ్బింగ్ అక్కడక్కడా మరీ ఎక్కువ గంభీరంగా అనిపించి ఇబ్బంది పడినా సాహో నుంచే ఇది మొదలయ్యింది కాబట్టి మనమూ అలవాటు పడాలి. ఇంత స్టేచర్ ఉన్న యాక్టర్ అయితేనే న్యాయం చేయగలుగుతాడు కాబట్టే వందల కోట్ల పెట్టుబడికి సిద్ధపడ్డారు నిర్మాతలు
ప్రేరణగా పూజా హెగ్డే క్యూట్ లుక్స్ తో పాటు మంచి అభినయంతో ప్రభాస్ తో సమానంగా పంచుకునే స్క్రీన్ స్పేస్ ని ఆడియన్స్ ఎంజాయ్ చేసేలా పెర్ఫార్మన్స్ ఇచ్చింది. అలనాటి హీరోయిన్ భాగ్యశ్రీని చూడటం బాగుంది. కృష్ణంరాజుగారివి పరిమిత సీన్లే అయినప్పటికీ వయసు దృష్ట్యా ఇబ్బంది పడ్డారు. జయరాం, ప్రియదర్శి, మురళీశర్మ, జగపతిబాబు, సచిన్ కెడ్కర్, రిద్ది కపూర్ వాళ్ళ పాత్రల స్వభావాల కోణంలో కొత్తదనం లేదు కానీ గెటప్స్ , వాటి ఆహార్యం డిఫరెంట్ గా ఉండటం వల్ల కొత్త అనుభూతి కలుగుతుంది. ప్రత్యేకంగా విలన్ అంటూ ఎవరూ లేకపోవడం కొంత మైనస్ అయినప్పటికీ ఇది ఫార్ములా ప్రహసనం కాదనే సంగతి మర్చిపోకూడదు
డైరెక్టర్ అండ్ టీమ్
విజువల్ గ్రాండియర్ అనే పదానికి నిర్వచనం రాధే శ్యామ్. అసలు ఈ తరహా ఆలోచనలు చేయడమే సాహసం. అలాంటిది వందల కోట్ల బడ్జెట్ పెట్టి తెరమీద వాటిని ఆవిష్కరించే ప్రయత్నం చేసినందుకు యువి మేకర్స్ ని ఖచ్చితంగా అభినందించే తీరాలి. ఫలితం ఎలా ఉండబోతోందనేది పక్కనపెడితే రాబోయే రోజుల్లో టాలీవుడ్ స్టాండర్డ్ ని హిందీ నిర్మాతలు సైతం అంత సులభంగా అందుకోలేరనే రేంజ్ లో తీయడం అబ్బురపరుస్తుంది. గ్రాఫిక్స్, అప్పటి వాతావరణాన్ని అచ్చుగుద్దినట్టు ప్రతిబింబించే ఆర్ట్ వర్క్, సెట్స్ ఒకటా రెండా అన్ని విభాగాలు శాయశక్తులా ఎంత ఇవ్వాలో అంతా కష్టపడ్డాయి.
నిజానికి ఈ సబ్జెక్టులో చాలా రిస్క్ ఉంది. పూర్తి ఫాంటసీ అనలేం. చరిత్రలో ఉన్న పాత్రలను తీసుకుని కల్పిత కథను అల్లి విధికి శాస్త్రానికి ప్రేమకు మధ్య జరిగే త్రికోణ యుద్ధాన్ని డిఫరెంట్ గా ప్రెజెక్టు చేయాలన్న ఆలోచనతో ఇది రాసుకున్నారు. బేసిక్ ఐడియా చంద్రశేఖర్ ఏలేటిది కాబట్టి ఆ వైవిధ్యత లైన్ లోనే కనిపిస్తుంది. కానీ చిక్కంతా ఎగ్జిక్యూషన్ లో వచ్చింది. సబ్జెక్టు ఎలాంటిదైనా ట్రీట్మెంట్ చాలా కీలకం. భావోద్వేగాలు పూర్తిస్థాయిలో పండకుండా ఆడియన్స్ ని మెప్పించడం చాలా కష్టం. అంత బాహుబలిలోనూ ఎమోషన్స్ విషయంలో రాజమౌళి శ్రద్ధ తీసుకున్నారు కాబట్టే అది ప్రపంచవ్యాప్తంగా బ్లాక్ బస్టర్ అయ్యింది.
రాధే శ్యామ్ లో హంగులు ఎన్ని ఉన్నప్పటికీ అసలైన కథావిస్తరణ సరిగా పండలేదు. ఈ కారణంగానే ఫస్ట్ హాఫ్ లో వచ్చే కామెడీ మిస్ ఫైర్ అయ్యింది. నవ్వించకపోగా ఇదంతా అవసరమా అనిపిస్తుంది. విక్రమాదిత్య పాత్రకు సంబంధించి ఎలివేషన్లు సరిగానే పడ్డాయి కానీ డ్రామాను డిమాండ్ చేసే సంఘటనలు, ఉత్కంఠను కలిగించే సబ్ ప్లాట్స్ ని ఎక్కువ సెట్ చేసుకుని ఉంటే ఇంకో లెవెల్ లో ఉండేది. ప్రభాస్ లాంటి హీరోతో డీల్ చేస్తున్నప్పుడు మాస్ ని పక్కనపెట్టలేం. కలెక్షన్లకు వాళ్లే మహారాజపోషకులు. ఇలాంటి వాటిలో మసాలా పాటలు ఉండాలనో లేదా నేలవిడిచి సాము చేసే ఫైట్లు పెట్టాలనో డిమాండ్ చేయడం లేదు. అవసరం లేదు కూడా.
కానీ పాత్రల మధ్య సంబంధాలు, జరుగుతున్న వైపరిత్యాల తాలూకు ప్రభావాలు అసలు ఉద్దేశాన్ని క్రమం తప్పకుండా ఎలివేట్ చేస్తూ ఉండాలి. ఒకదశ వరకు అది సవ్యంగానే జరిగింది కానీ విక్రమాదిత్య ప్రేరణల ప్రేమకథను బలంగా రిజిస్టర్ చేయాలని దర్శకుడు రాధాకృష్ణ పడిన తాపత్రయం ల్యాగ్ కు కారణం అయ్యింది. హై అనిపించే మూమెంట్స్ కానీ గూస్ బంప్స్ ఇచ్చే ఇన్ సిడెంట్స్ కానీ పెద్దగా చోటు చేసుకోవు. విపరీతమైన పబ్లిసిటీకి నోచుకున్న షిప్ ఎపిసోడ్ సైతం అంతగా ఎగ్జైట్మెంట్ ని కలిగించలేకపోవడానికి కారణం ఇదే. ఆలా అని సినిమా అంతా అలా ఉందని కాదు. ఒక ఫ్లో ప్రకారం కథనం సాగనందుకే ఈ చిక్కంతా
రాధే శ్యామ్ లు కొంత భాగం దూరమవుతారని ముందే మనల్ని ప్రిపేర్ చేసినప్పుడు తిరిగి వాళ్ళు కలుసుకునే దాకా పరుగులు పెట్టే స్క్రీన్ ప్లే అవసరం. లవ్ స్టోరీలో ఫీల్ ఉంది నిజమే. కానీ మూడు వందల కోట్ల అంచనాలతో సీట్లో కూర్చున్న ప్రేక్షకుడు అదే స్థాయిలో మినిమమ్ గూస్ బంప్స్ ఆశిస్తాడు. అంతే తప్ప ఉట్టి ఫీలింగ్స్ కాదుగా. ఆ మాత్రం నితిన్ నాని సినిమాల్లోనే బోలెడు దొరుకుతాయి. అలాంటప్పుడు ప్రభాస్ మూవీ స్పెషాలిటీ ఏముంది. గీతాంజలిలో హీరోయిన్ జబ్బు, టైటానిక్ లో షిప్పు అడ్వెంచర్ ఇలా అన్నిరకాల మిక్చర్ చేశారు కానీ వావ్ అనిపించే విషయాలు సరైన మోతాదులో పడి ఉంటే దీనికి గొప్ప స్థానం దక్కేది.
హంగులు మాత్రమే ఉన్న కంటెంట్ అంత ఈజీగా పాస్ అవ్వదు. సాహో అక్కడ ఆడింది కదా ఇలాంటివి నార్త్ ఆడియన్స్ చూస్తారు కదానే ధీమా అన్నిసార్లు పనిచేయదు. ఆ మాటకొస్తే వాళ్ళు కూడా పుష్ప లాంటి ఊర మాస్ మసాలాలే కోరుతున్నారు. అలాంటప్పుడు రాధే శ్యామ్ ఆ దారిలో వెళ్లకపోయినా ఎక్కడా పట్టుతప్పకుండా ఎంగేజ్ చేసే స్క్రీన్ ప్లేతో పరుగులు పెట్టాల్సింది. సెకండ్ హాఫ్ లో దర్శకుడు రాధాకృష్ణ లేనిపోని కన్ఫ్యూషన్ కి తావివ్వడం కూడా మైనస్సే. శిల్పాన్ని ఖరీదైన రాయిని తీసుకొచ్చి ఎంత గొప్పగా చెక్కినా అసలైన కళ్ళను సరిగా తీర్చిదిద్దకపోతే దానికి అందం రాదు. రాధే శ్యామ్ గురించి ఇంతకన్నా ఉపమానం అవసరం లేదు
సంగీత దర్శకుడు జస్టిన్ ప్రభాకరన్ థీమ్ కు తగ్గట్టు చక్కని పాటలే ఇచ్చినా ఒకటి రెండు మాత్రమే మళ్ళీ వినేలా ఉన్నాయి కానీ విజువల్ గా మాత్రం అన్నీ బాగున్నాయి. తమన్ కు బ్యాక్ గ్రౌండ్ స్కోర్ బాధ్యతలు ఏ ఉద్దేశంతో ఇచ్చారో వాటిని పూర్తిగా నెరవేర్చాడు. మనోజ్ పరమహంస ఛాయాగ్రహణం గురించి చెప్పాలంటే టాప్ నాచ్ అనే మాట చిన్నది. లేనిది ఊహించుకుని తన కెమెరా కళ్ళతో ఫ్రేమ్స్ ని ఆవిష్కరించిన తీరు అద్భుతం. కోటగిరి వెంకటేశ్వరరావు ఎడిటింగ్ వీలైనంత ల్యాగ్ ని తగ్గించింది. అయినా సాగతీత అనిపిస్తే తప్పు ఆయనది కాదు. యువి అండ్ గోపి కృష్ణసంస్థ లు నిర్మాణం విషయంలో రాజీ ప్రస్తావన తేకుండా తమ డార్లింగ్ కోసం డబ్బుని మంచినీళ్లలా ఖర్చుపెట్టారు.
ప్లస్ గా అనిపించేవి
ప్రభాస్ & పూజా హెగ్డే
యునీక్ ప్లాట్
విజువల్స్
కెమెరా అండ్ మ్యూజిక్
మైనస్ గా తోచేవి
అంతగా పండని ఎమోషన్స్
స్లో నెరేషన్
ప్రేమకథ సాగతీత
షిప్పు ఎపిసోడ్
కంక్లూజన్
రాధే శ్యామ్ ముమ్మాటికీ గొప్ప ప్రయత్నమే. అందులో ఎలాంటి సందేహం అక్కర్లేదు. తెలుగు సినిమాలో ఇలాంటివి సాధ్యమా అనిపించే రీతిలో కొన్ని అంశాలు ఉన్నాయి.అయితే విజువల్ ఎఫెక్ట్స్ గ్రాండ్ గా ఉన్నంత మాత్రాన ప్రేక్షకులు బ్రహ్మరథం పడతారన్న గ్యారెంటీ లేదు. అయ్యో ఇంత ఖర్చు పెట్టారు కదానే సానుభూతితో జనం థియేటర్లకు రారు. వాళ్లకు కావాల్సింది సంపూర్ణంగా ఉందన్నప్పుడే కుటుంబాలతో సహా క్యూ కడతారు. రాధే శ్యామ్ లో ఇది పూర్తిగా బ్యాలన్స్ కాకపోవడంతో బాక్సాఫీస్ ప్రభావితం చేస్తుందా లేక ప్రభాస్ ఇమేజ్ తో ఈజీగా గట్టెక్కస్తుందా అనేది కాలమే సమాధానం చెప్పాలి. అసలే రెండు వారాల్లో ఆర్ఆర్ఆర్ ఉంది మరి.
ఒక్కమాటలో – ఇలా ‘కాదే’ శ్యామ్
Also Read : ET Movie Review : ఈటి ఎవరికి తలవంచడు రివ్యూ