iDreamPost

ET Movie Review : ఈటి ఎవరికి తలవంచడు రివ్యూ

ET Movie Review : ఈటి ఎవరికి తలవంచడు రివ్యూ

తెలుగులోనూ ఒకప్పుడు మంచి మార్కెట్ ఉన్న సూర్య పరిస్థితి కొన్నేళ్లుగా ఏమంత మెరుగ్గా లేదు. గత రెండు సినిమాలు ఆకాశం నీ హద్దురా, జైభీమ్ లు ఓటిటిలో అద్భుతమైన స్పందన దక్కించుకున్నప్పటికీ తన థియేట్రికల్ బిజినెస్ తగ్గిపోయి చాలా కాలమయ్యింది. ఈ నేపథ్యంలో వచ్చిన మూవీ ఈటి ఎవరికి తలవంచడు. ఏదో మొక్కుబడిగా మన భాషలో ట్యాగ్ లైన్ ఇచ్చారు కానీ ఒరిజినల్ టైటిల్ ని అలాగే పెట్టడానికి తంటాలు పడ్డారు. ఇక్కడ ఫ్లాపులు ఉన్నా అక్కడ డాక్టర్ లాంటి సక్సెస్ లు ఉన్న ప్రియాంక అరుళ్ మోహన్ ఇందులో హీరోయిన్. కార్తీ చినబాబు విశాల్ కథకళి ఫేమ్ పాండిరాజ్ దర్శకత్వం వహించిన ఈ ఈటి సంగతేంటో చూద్దాం

కథ

ఉత్తరపురంలో ఉండే లాయర్ కృష్ణమోహన్(సూర్య)కుటుంబాన్ని ఊరంతా పెద్దగా గౌరవిస్తూ ఉంటుంది. పక్కనే ఉండే దక్షిణపురంతో మొదట్లో ఉండే స్నేహ సంబంధాలు తర్వాత బెడిసి కొడతాయి. దీంతో శత్రువులుగా మారి అప్పుడప్పుడు గొడవలు పడుతూ ఉంటారు. అయితే కృష్ణమోహన్ గ్రామానికి సంబందించిన అమ్మాయిలు ఓ వలయంలో చిక్కి ప్రమాదంలో పడతారు. మనోడు గుర్తించే లోపు ఓ యువతి ప్రాణం పోతుంది. పరిస్థితి తనదాకా వచ్చాక రంగంలోకి దిగి దీని వెనుక ఉన్న కామేష్(వినయ్ రాయ్)ముఠాను గుర్తిస్తాడు. కోర్టులో న్యాయం జరగదు. మరి కృష్ణమోహన్ చివరికి ఏం చేశాడు అనేది తెరమీద చూడాల్సిందే

నటీనటులు

కోలీవుడ్ బెస్ట్ పెర్ఫార్మర్స్ లో ఒకడైన సూర్య గురించి కొత్తగా చెప్పడానికి ఏమి లేదు. పాత్ర ఏదైనా తనను తాను మలుచుకుని కష్టపడే తీరు సుందరాంగుడు గజినితో మొదలుపెట్టి ఇప్పటిదాకా ఎన్నోసార్లు చూస్తూనే ఉన్నాం. కానీ ఈటి ఒక చిన్న మెసేజ్ టచ్ ఉన్న రెగ్యులర్ కమర్షియల్ డ్రామా కావడంతో ఇందులో ఛాలెంజ్ గా తీసుకోవడానికి ఏమి లేకపోయింది. అయినా సరే మంచి మాస్ కటవుట్ లో సూర్యని ఇలాంటి క్యారెక్టర్ లో చూడటం అభిమానులకు పండగే. స్క్రీన్ ప్రెజెన్స్ కూడా విజిల్స్ వేయించేలా ఉంది. సింగం సిరీస్ తర్వాత మళ్ళీ ఆ స్థాయిలో మాస్ కి ఎలివేషన్లు వచ్చేలా చేసింది ఇందులోనే. సో తనవరకు బెస్ట్ ఇచ్చాడు.

ప్రియాంక అరుళ్ మోహన్ లుక్స్ బాగున్నాయి. యాక్టింగ్ గురించి చెప్పడానికి ఏమి లేదు. అందం ఎక్కువ అభినయం తక్కువ రీతిలో సాగింది. ఓ బరువైన సీన్లో తనకన్నా గ్లిజరినే హైలైట్ అయ్యింది. మొదటిసారి సూర్య సినిమాలో భాగమైన సత్యరాజ్ ది అలవాటైన పాత్రే. ఎలాంటి ప్రత్యేకత లేదు. శివకార్తికేయన్ డాక్టర్ లో విలన్ గా మెప్పించిన వినయ్ రాయ్ జస్ట్ ఓకే అనిపించాడు. చాలా సార్లు ఒకే తరహా రిపీట్ ఎక్స్ ప్రెషన్లతో విసుగు తెప్పించాడు. సూరి కామెడీ అక్కడక్కడా పేలింది. శరణ్య కొన్ని సన్నివేశాల్లో ఓవర్ చేయడం తప్పుబట్టలేం. అసలు రాసుకోవడంలోనే అసలైన సమస్య ఉంది. మిగిలిన బ్యాచ్ అంతా ఆరవ మొహాలే

డైరెక్టర్ అండ్ టీమ్

దర్శకుడు పాండిరాజ్ ది ఒక ఫార్ములా ప్రకారం వెళ్లే శైలి. ఇప్పటిదాకా తీసినవన్నీ గ్రామీణ నేపథ్యంలో సాగేవే. సెంటిమెంట్ మోతాదుని ఎక్కువ దట్టించి ఎమోషనల్ ప్లే ద్వారా ప్రేక్షకులను ఆకట్టుకోవడం ఇతని స్టైల్. కొత్తదనానికి పెద్దగా ప్రాధాన్యం ఇవ్వడు. మనకు అంతగా వంటబట్టదు కానీ ఇతని అతి వ్యవహారం తమిళ ఆడియన్స్ కి కనెక్ట్ అయ్యేదే కాబట్టి ఇప్పటిదాకా అదే తరహాలో చేసుకుంటూ వెళ్ళాడు. ఈటి కూడా దీనికి మినహాయింపు కాదు. ఒక కొలత ప్రకారం రాసుకున్న వంట దినుసులన్నీ వేసి బిర్యానీ వండాలనే టార్గెట్ పెట్టుకుని దాని ప్రకారమే తీశాడు. కాకపోతే ఈసారి మసాలా మిక్స్ బాగా తేడా కొట్టేసింది.

రెండు ఊళ్ళ మధ్య పగల వ్యవహారంగా మొదలుపెట్టిన పాండిరాజ్ ఆ తర్వాత కాసేపటికే ఫ్యామిలీ డ్రామాకు షిఫ్ట్ అయ్యాడు. పోనీ అదైనా నవ్వించేలా లాగానో బాగుందనిపించుకునే లానో ఉంటే ఇబ్బంది లేదు. ముతక సన్నివేశాలతో విసుగు తెప్పిస్తాడు. ఇంటర్వల్ ట్విస్ట్ వచ్చే దాకా ఇదంతా చప్పగా సాగుతుంది. పోనీ హీరో హీరోయిన్ లవ్ ట్రాక్ అయినా ఎంజాయ్ చేసేలా ఉందా అంటే అదీ లేదు. జాతరలో కిడ్నాప్ ఎపిసోడ్ చిన్నగా నవ్విస్తుంది కానీ నిజానికది అపహాస్యం పాలయ్యింది. అంత గొప్పదైన హీరో కుటుంబం అమ్మాయి కిడ్నాప్ కి తెగబడటం సింక్ కాలేదు. పైగా దాన్నేదో కామెడీగా చూపించబోయి మిస్ ఫైర్ చేశారు.

క్యారెక్టరైజేషన్స్ లో కూడా బోలెడు లోపాలు ఉన్నాయి. విశ్రాంతికి ముందే కృష్ణమోహన్ కు సమస్య తెలిసినప్పుడు అప్పుడే కార్యాచరణలోకి దిగాలి. కానీ కట్టుకున్న భార్య బాధితురాలిగా మారే వరకు పెద్దగా ఏమి చేయడు. దానికి తోడు తమిళనాడులోని టీనేజ్ అమ్మాయిలంతా అబ్బాయిల ట్రాప్ లో పడి అసభ్యకరమైన వీడియోలలో భాగమవుతున్నారని సెకండ్ హాఫ్ మొత్తం ఆ పాయింట్ చుట్టూ పదే పదే తిప్పడం కొంత సేపు ఆలోచింపజేసినా ఆ తర్వాత చిరాకు తెప్పిస్తుంది. పాండిరాజ్ కన్ఫ్యూషన్ ప్రతి పది నిమిషాలకోసారి కనిపిస్తూనే ఉంటుంది. ఎక్కడిక్కడ సూర్య కాచుకుంటూ వచ్చాడు కానీ ఒక స్టేజి దాటాక తను నిస్సహాయుడిగా మిగిలిపోయాడు.

ఓవర్ డ్రామా తెలుగు ప్రేక్షకులకు సెట్ కావు. అన్నీ బాలన్స్ చేస్తేనే అంగీకరించే మెచ్యూర్డ్ బ్యాచ్ మనది. ఇలాంటి పైఫైమెరుగులుతో మభ్యపెట్టాలని చూస్తే వాతలు పెడతారు. సూర్య మాస్ హీరో కాబట్టి అతని మీద పాటలు ఉండి తీరాల్సిందేనన్న గ్రౌండ్ రూల్ తో వాటిని ఇరికించారు. అవి ఆడియో వీడియో రెండు రకాలుగా ఫోన్ లో అప్ డేట్స్ చూసుకోవడానికి తప్ప పెద్దగా ఉపయోగపడలేదు. క్లైమాక్స్ ని ఆలోచించిన తీరు బాగానే ఉంది కానీ దానికి కూడా పాత్రలందరితో అంతేసి క్లాసులు పీకించి ఎమోషనల్ గా శృతి మించిన డోస్ ఇవ్వడం సీరియస్ గా ఉండాల్సిన చోట నవ్వు తెప్పిస్తుంది. ఏదీ తెగేదాకా లాగకూడదు. ఈటిలో ఇలాంటి మచ్చుతునకలు ఎన్నో

సూర్యని తప్పుబట్టడానికి లేదు. నిజంగానే ఫేస్ బుక్, ఇన్స్ టాల మత్తులో పడి అమ్మాయిలు గుడ్డిగా ట్రాప్ లో పడిపోతున్నారు. ఆ సమస్యను పాండిరాజ్ తీసుకున్నాడు కాబట్టి హీరోగా తను ఒప్పుకుని ఉండొచ్చు. కానీ దాన్ని బ్యాక్ లేయర్ లో పెట్టి ఊరికి సంబంధించిన సమస్యలు, కృష్ణమోహన్ కామేష్ క్లాష్ ని మరింత గ్రిప్పింగ్ గా నడపటం లాంటి వాటి మీద దృష్టి పెట్టి ఉంటే కంప్లీట్ ప్యాకేజ్ అయ్యేది. శంకర్, మురుగదాస్ టైపు లో సోషల్ కాజ్ ఉన్న పాయింట్ ని తీసుకోగానే సరిపోదు. వాళ్ళలాగా ఆలోచించి స్క్రీన్ ప్లే, ట్విస్టులతో మెస్మరైజ్ చేసే టెక్నిక్ కావాలి. పాండిరాజ్ లో లేనిది అదే. ఈటిని దెబ్బ కొట్టింది కూడా ఇదే

ఇమ్మాన్ సంగీతంలో సౌండ్ ఎక్కువయ్యింది. పాటల డబ్బింగ్ కూడా అంతంతమాత్రంగా ఉండటంతో భరించడం కష్టమైపోయింది. బ్యాక్ గ్రౌండ్ లో కూడా ఇతని ముద్ర కనిపించలేదు. హీరో ఇంట్రో కోసం ఇచ్చిన బీజీఎమ్ తప్ప మిగిలిదంతా రొటీన్ గానే ఉంది. రత్నవేలు ఛాయాగ్రహణం మాత్రం టాప్ గ్రేడ్ లో ఉంది. ఆయన పనితనం ఎంత గొప్పగా ఉన్నా కథనంలో నీరసం దాన్ని కప్పేసింది. రూబెన్ ఎడిటింగ్ ల్యాగ్ కి కారణమా అంటే చెప్పలేం.సన్ పిక్చర్స్ ప్రొడక్షన్ పర్వాలేదు. పాపం మహారాష్ట్రకు వెళ్లే బడ్జెట్ లేక రెండు మూడు షాట్స్ ని సిజిలో మేనేజ్ చేసి దొరికిపోయారు. లొకేషన్లు గ్రాఫిక్స్ డిమాండ్ చేయని సబ్జెక్టు కావడం సేఫ్ అయ్యింది

ప్లస్ గా అనిపించేవి

సూర్య వన్ మ్యాన్ షో
మెయిన్ పాయింట్
ఇంటర్వెల్ ఫైట్

మైనస్ గా తోచేవి

బ్యాలన్స్ కానీ మాస్ ఎలిమెంట్స్
ఒకే పాయింట్ చుట్టూ నడిపించిన సెకండ్ హాఫ్
విలన్ పాత్ర
ఓవర్ డ్రామా

కంక్లూజన్

మంచి ఆకలి మీదున్నప్పుడు చల్లారిన అన్నంలోకి ఉప్పు తక్కువైన సాంబార్ వేసినా తినేస్తాం. అవసరం అలాంటిది. కానీ ఇప్పుడు జనాలకు ఓటిటిలు, పాన్ ఇండియా సినిమాలు, విజువల్ గ్రాండియర్లు లాంటి బోలెడు ఆప్షన్లు ఎంటర్ టైన్మెంట్ పరంగా దమ్ బిర్యానీ రేంజ్ లో వారానికోసారి కొత్తకొత్తగా పలకరిస్తున్నాయి. అలాంటప్పుడు ఆకలనే సమస్యే లేదు. ఇలాంటి అరకొర ఈటిలు
వాళ్ళని సంతృప్తి పరచడం కష్టం. కేవలం సూర్య అనే కారణం తప్ప ఇంకేదీ అక్కర్లేదు అనుకుంటే టికెట్ కొట్టొచ్చు కానీ అంతకుమించి అంటే మాత్రం అంతకంతా మించి ఉసూరుమనిపించడం ఖాయం. నిర్ణయం దాని బాధ్యతా రెండూ మీవే

ఒక్క మాటలో – ఈటి – రొటీన్ కు పోటీ

Also Read : Aadavallu Meeku Joharlu Review : ఆడవాళ్ళూ మీకు జోహార్లు రివ్యూ

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి