iDreamPost

నిత్యమీనన్ నటించిన ‘కుమారి శ్రీమతి’ వెబ్ సిరీస్ రివ్యూ!

నిత్యమీనన్ నటించిన ‘కుమారి శ్రీమతి’ వెబ్ సిరీస్ రివ్యూ!

ఇటీవల కాలంలో వెబ్ సిరీస్ లకు ఎలాంటి క్రేజ్ ఉందో తెలిసిందే. స్టార్స్ నుండి యంగ్ స్టర్స్ వరకు ఈ వెబ్ సిరీస్ లలో నటించేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. పైగా సినిమాలంటే జనాలు థియేటర్లకు రావాలి.. కానీ, ఓటిటి వెబ్ సిరీస్ లకు అదంతా అవసరం లేదుగా. తాజాగా క్రేజీ హీరోయిన్ నిత్యామీనన్ డైరెక్ట్ తెలుగు వెబ్ సిరీస్ చేసింది. ‘కుమారి శ్రీమతి’ పేరుతో తెరకెక్కిన ఈ వెబ్ సిరీస్.. ట్రైలర్ తో మంచి బజ్ క్రియేట్ చేసుకుంది. ఇందులో నిత్యాతో పాటు కార్తీక దీపం ఫేమ్ నిరుపమ్, తిరువీర్, సీనియర్ నటి గౌతమి నటించారు. గోమతేష్ ఉపాధ్యాయ రూపొందించిన ఈ సిరీస్ కి అవసరాల శ్రీనివాస్ స్క్రీన్ ప్లే అందించారు. మరి అమెజాన్ ప్రైమ్(Amazon Prime) వేదికగా స్ట్రీమింగ్ మొదలైన కుమారి శ్రీమతి కథ ఎలా ఉందో.. రివ్యూలో చూద్దాం!

కథ:

ఈ కథ.. రామరాజు లంకలో ఇటుకలపూడి శ్రీమతి(నిత్యామీనన్), బాబాయ్ కేశవరావు(ప్రేమ్ సాగర్) మధ్య సాగుతుంది. వీరి మధ్య తరతరాల ఆస్తికి సంబంధించి ఓ రకమైన వైరం సాగుతుంటుంది. బాల్యంలో తాతకు ఇచ్చిన మాట కోసం శ్రీమతి.. ఆస్తి మొత్తం తనదే అని కోర్టు మెట్లెక్కిన బాబాయ్. కట్ చేస్తే.. భారీ మొత్తం పుచ్చుకొని వేరే వాళ్లకు అమ్మాలని కేశవరావు ప్లాన్ వేస్తాడు. కానీ.. ఆస్తి విషయంలో కేశవరావుకు కోర్టు షాకిస్తుంది. అయితే.. 6 నెలల గడువులో అసలు చెల్లించి ఆస్తి సొంతం చేసుకోవచ్చు అని కోర్టు కుమారికి ఛాన్స్ ఇస్తుంది. ఈ క్రమంలో శ్రీరామ్(నిరుపమ్) సలహా మేరకు వ్యాపారం పెట్టాలని ట్రై చేస్తుంది. మరి ఆస్తి కోసం శ్రీమతి ఏం చేసింది? బాబాయ్ కేశవరావుకి కోర్టు ఇచ్చిన షాక్ ఏంటి? కోర్టు ఇచ్చిన గడువులో శ్రీమతి ఆస్తి దక్కించుకుందా లేదా? తెలియాలంటే సిరీస్ చూడాల్సిందే.

విశ్లేషణ:

ఇండస్ట్రీలో ఆస్తి పంపకాలు, ఆస్తి కోసం పోరాటాలు కాన్సెప్ట్ లతో చాలా సినిమాలు వచ్చాయి. ఆస్తి గొడవలు అంటే.. కాస్తో కూస్తో ఆకట్టుకునే విధంగా ఉంటాయి. ఎందుకంటే.. రెండు వర్గాల మధ్య ఆస్తి గొడవలు జరుగుతున్నప్పుడు చివరికి ఎవరి. చేతికి వెళ్తుంది? దానికోసం ఎలా పోరాడారు? ఏమేం కుట్రలు పన్నారు? చట్టపరమైన పోరాటం ఎలా సాగింది? అనేవి ఇంటరెస్టింగ్ ఎలిమెంట్స్. అయితే.. ఇలాంటి ఆస్తి గొడవల విషయంలో ఎక్కువగా సీరియస్ నెస్ కనిపిస్తుంది. పైగా సినిమాలలో లెన్త్ లిమిట్ ఉంటుంది. కాబట్టి.. ఎంటర్టైన్మెంట్ జోడించి, సీరియస్ గా డిస్కషన్ చేయడం అనేది కాస్త తక్కువే. కానీ.. వెబ్ సిరీస్ అనేది ఎపిసోడ్స్ ఉంటాయి. కాబట్టి.. ఏదైనా ఎక్కువ సేపు డిస్కస్ చేయొచ్చు.

ఈ కుమారి శ్రీమతి సిరీస్ లో దర్శకుడికి ఆ అవకాశం దక్కింది. రెగ్యులర్ గా మనకు తెలిసిన ఆస్తి గొడవ నేపథ్యంతో కథ మొదలైనప్పటికీ.. ఎంటర్టైన్మెంట్ జోడించి మెప్పించే ఛాన్స్ తీసుకున్నారు. మొత్తం ఏడు ఎపిసోడ్స్ ఉన్న ఈ సిరీస్ లో.. క్యారెక్టర్స్ అన్ని సీరియస్ గా డిస్కషన్ చేస్తుంటాయి. కానీ.. చూసే ఆడియన్స్ కి మంచి ఎంటర్టైన్మెంట్ దొరుకుతుంది. ముఖ్యంగా లీడ్ క్యారెక్టర్ శ్రీమతి పాత్రలో నిత్య ఒదిగిపోయింది. ముందునుండి తెలుగు చక్కగా మాట్లాడుతుంది కాబట్టి.. డైలాగ్స్, హావభావాలలో ఎలాంటి ఇబ్బంది లేదు. డైలాగ్స్ కాస్త పాతవే అనిపించినా.. ఆకట్టుకుంటాయి. కుమారి క్యారెక్టర్ చుట్టూ ఫన్ కూడా బాగా క్రియేట్ చేశారు.

ఇక ఇందులో శ్రీమతి పాత్రని చాలా ఇన్స్పైరింగ్ గా రాసుకున్నారు. ఓ ఒంటరి అమ్మాయి.. స్వయంగా తన సొంత కాళ్ళపై ఎలా నిలబడి అయినవాళ్లను, సమాజాన్ని ఎలా ఫేస్ చేసింది? అనేది కథలో అంతర్లీనంగా సాగే అంశం. బిజినెస్ పెట్టాలని.. ఏకంగా బార్ అండ్ రెస్టారెంట్ ప్రారంభించి సమస్యలు కొని తెచ్చుకుంటుంది. ఆ తర్వాత అందరికి సర్దిచెప్పి బార్ నడిపించే సీక్వెన్స్ ఆకట్టుకుంటుంది. హీరో తిరువీర్ క్యామియో బాగుంది. నిత్యకి ఇలాంటి క్యారెక్టర్ కొత్త కాదు.. సో ఎప్పటిలాగే అదరగొట్టేసింది. తల్లి పాత్రలో నటి గౌతమి మెప్పించారు. కార్తీక దీపం ఫేమ్ నిరుపమ్, సీనియర్ నటి తాళ్లూరి రామేశ్వరి, ప్రణీత పట్నాయక్, ప్రేమ్ సాగర్ కథకు అనుగుణంగా పాత్రలు పండించారు.

ఇక ఫ్యామిలీ సిరీస్ కాబట్టి.. పైగా ఓ స్త్రీ ఒంటరి పోరాటం కాబట్టి.. సిరీస్ లో రొమాన్స్ ని ఎక్స్ పెక్ట్ చేస్తే కష్టమే. కథ మొత్తం శ్రీమతి పాత్ర చుట్టూ సాగుతుంది కాబట్టి.. వేరే పాత్రలు పెద్దగా ఇంపాక్ట్ క్రియేట్ చేయలేదని ఫీల్ కలుగుతుంది. అయితే.. కథ సారాంశం ముందే తెలుస్తుంది గనక అక్కడక్కడా నేరేషన్ స్లో అయిన ఫీల్ వస్తుంది. బట్.. క్లైమాక్స్ కి వచ్చేసరికి స్క్రీన్ ప్లే వేగం పుంజుకుంటుంది. కానీ, క్లైమాక్స్ మరింత బాగా రాసుకుంటే బాగుండని అనిపిస్తుంది. టెక్నికల్ గా.. సాంగ్స్, బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ చక్కగా కుదిరాయి. మోహన్ కృష్ణ కెమెరా వర్క్ బాగుంది. నిర్మాణ విలువలు బాగున్నాయి. శ్రీనివాస్ అవసరాల స్క్రీన్ ప్లే, డైలాగ్స్ మెప్పిస్తాయి. డైరెక్టర్ గోమతేష్ సిరీస్ ని చక్కగా హ్యాండిల్ చేశారు. కావాల్సిన నటన రాబట్టుకున్నారు.

ప్లస్ లు:

  • నిత్యామీనన్
  • స్క్రీన్ ప్లే, డైలాగ్స్
  • సంగీతం
  • సినిమాటోగ్రఫీ
  • నిర్మాణ విలువలు

మైనస్ లు:

  • కొత్తదనం లోపించిన కథ
  • అక్కడక్కడా స్లో నేరేషన్

చివరిమాట: కుటుంబం మొత్తం చూడదగ్గ సిరీస్!

రేటింగ్: 3/5

(గమనిక: ఈ రివ్యూ కేవలం సమీక్షకుడి వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే)

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి