iDreamPost

Aadavallu Meeku Joharlu Review : ఆడవాళ్ళూ మీకు జోహార్లు రివ్యూ

Aadavallu Meeku Joharlu Review : ఆడవాళ్ళూ మీకు జోహార్లు రివ్యూ

హిట్టు కొట్టి ఎంత కాలమయ్యిందోనని శర్వానంద్ అభిమానులు తెగ ఫీలవుతున్న టైంలో ఫ్యామిలీ ఆడియన్స్ ని టార్గెట్ చేసుకుని కాస్తంత పాజిటివ్ బజ్ తో ఇవాళ విడుదలైన సినిమా ఆడవాళ్ళూ మీకు జోహార్లు. అప్పుడెప్పుడో కృషంరాజు గారు వాడేసిన టైటిల్ ని మళ్ళీ ఇన్నేళ్ల తర్వాత శర్వా కోసం తీసుకోవడం విశేషం. నేను శైలజ లాంటి ఫ్రెష్ ఎంటర్ టైనర్ తో మెప్పించి ఆ తర్వాత చెప్పుకోదగ్గ సినిమాలే చేసిన దర్శకుడు తిరుమల కిషోర్ మళ్ళీ తన జానర్ కి తిరిగి వచ్చి చేసిన ప్రయత్నమిది. తెరనిండా ఆడాళ్ళతో కలర్ ఫుల్ గా కనిపిస్తున్న ఈ మూవీ ఎలా ఉందో, అంతా అయ్యాక జోహార్లు అనిపించుకుందో లేదో రివ్యూలో చూద్దాం పదండి

కథ

కళ్యాణ మండపం నడిపించే చిరంజీవి(శర్వానంద్)ది ఉమ్మడి కుటుంబం. ఫ్యామిలీ మొత్తం మీద ఇప్పటి తరంలో  తనకొక్కడే మగ సంతానం కావడంతో ఇంట్లో ఆడాళ్ళంతా అపురూపంగా పెంచుకుంటారు. ఈ అతి జాగ్రత్త వల్లే చిరుకి వయసు ముప్పై దాటుతున్నా పెళ్లి కుదరక అవస్థలు పడుతూ ఉంటాడు. ఇలాంటి టైంలో పరిచయమవుతుంది ఆద్య(రష్మిక మందన్న). స్నేహం మెల్లగా ప్రేమగా మారుతున్న టైంలో ఆద్య తల్లి వకుళ(ఖుష్బూ)గురించి తెలుసుకున్న చిరు అసలు ఆవిడకు పెళ్లి మీద నమ్మకమే లేదని విని షాక్ తింటాడు. ఆమెను మెప్పించే బాధ్యతను తీసుకుని లేడీ బ్యాచ్ ని అక్కడికి చేరుస్తాడు. ఆ తర్వాత స్క్రీన్ మీదే చూడండి

నటీనటులు

శర్వానంద్ కి ఇలాంటి సహజమైన పాత్రలు బాగా సూటవుతాయి. ఇది గుర్తించుకోకుండా ఏవేవో ప్రయోగాలు చేసి దెబ్బ తినడంతో తిరిగి పాత స్కూల్ కు వచ్చేశాడు. ఒకప్పటి రన్ రాజా రన్ ఛార్మ్ ని, ఎనర్జీని ఇప్పుడు ఎక్స్ పెక్ట్ చేయడం అత్యాశే కానీ ఉన్నంతలో ఈ పాత్రకు తగ్గట్టు శర్వా మంచి పెర్ఫార్మన్స్ ఇచ్చాడు. బెస్ట్ అనే ఉపమానం వాడలేం కానీ సబ్జెక్టు కోరినట్టు మాత్రం ఫిట్ అయ్యాడు. రష్మిక మందన్నది తను మాత్రమే చేయగలిగే క్యారెక్టర్ కాదు కానీ గీత గోవిందం తరహాలో గుడ్ ఛాయస్ అనిపించుకుంది. ఎక్కువ సీరియస్ టోన్ లో కనిపించే తనను ఇందులో మంచి ఆకర్షణీయమైన లుక్స్ లో ప్రెజెంట్ చేయడం విశేషం.

మొత్తం లేడీ గ్యాంగ్ లో ముందు నుంచి మనకు బాగా పరిచయమున్న సీనియర్ ఆర్టిస్టులుగా రాధికా, ఊర్వశిలు మాత్రమే బాగా రిజిస్టర్ అవుతారు. సెకండ్ హాఫ్ లో ఎంట్రీ ఇచ్చే ఖుష్బూ గాంభీర్యం ఎక్కువ వాచకం తక్కువ టైపు లో మేనేజ్ చేశారు. రవిశంకర్ లాంటి నిండైన విగ్రహం అనవసరమైన ఫ్యాక్షన్ బిల్డప్ ట్రాక్ కి వృథా అయ్యింది. ఝాన్సీ, కమెడియన్ సత్యలు సోసోనే. ప్రదీప్ రావత్ ని నేను శైలజ సెంటిమెంట్ కాబోలు ఓ పిచ్చి డ్రైవర్ పాత్రలో చూపించి మమ అనిపించారు. బెనర్జీ, గోపరాజు రమణ, బ్రహ్మానందం, వెన్నెల కిషోర్ లాంటి క్యారెక్టర్ ఆర్టిస్టులు ఏదో మొక్కుబడిగా ఒకటి రెండు సీన్లకు పరిమితమయ్యారు అంతే.

డైరెక్టర్ అండ్ టీమ్ 

ఫ్యామిలీ ఎంటర్ టైనర్ అంటే ఒక అందమైన జంట, తెరనిండా జూనియర్ సీనియర్ ఆర్టిస్టులు ఉండటం కాదు. వాళ్ళను సరైన రీతిలో ఉపయోగించుకునే బలమైన కంటెంట్ ఉండాలి. అసలే ఇది పోస్ట్ కరోనా కాలం. అలవాట్లు అభిరుచులు మారిపోయాయి. ప్రాధాన్యతలు మార్పుకు లోనయ్యాయి. ఉత్తి పోస్టర్లు చూసో క్యాస్టింగ్ ని బట్టో జనం థియేటర్లకు రావడం లేదు. ఈ విషయంలో కేవలం స్టార్ హీరోలకు మాత్రమే మినహాయింపు ఇస్తారు. శర్వాకు అంత మార్కెట్ కానీ ఇమేజ్ కానీ లేదు. తన మీదున్న సాఫ్ట్ కార్నర్ సినిమా బాగుందనే టాక్ బయటికి వస్తేనే ఉపయోగపడుతుంది తప్ప పైపై మెరుగులుకు కలెక్షన్లు రావు. అందుకే గత రెండేళ్లలో అన్ని ఫ్లాపులు.

ఈ ఇంట్రడక్షన్ ఆడవాళ్ళూ మీకు జోహార్లు సినిమా బాలేదని చెప్పడానికి కాదు. ఒక ప్రేమకథను ఫ్యామిలీ ఎమోషన్స్ జోడించి చెప్పాలనుకున్నప్పుడు ఫాలో కావలసిన బేసిక్ గ్రౌండ్ రూల్ ని మిస్ చేస్తే దేని ఫలితమైనా ఒకటే ఉంటుందని చెప్పడానికి. నిజానికి ఇది బ్యాడ్ లైన్ కాదు. ఇంట్లో ఆడాళ్ళ మధ్య అల్లారుముద్దుగా పెరిగిన ఓ అబ్బాయికి వాళ్ళ వల్లే తన పెళ్లి ఇబ్బందిలో పడటం అనేది చాలా బాగా చెప్పొచ్చు. కానీ తిరుమల కిషోర్ ఏ దశలోనూ ప్రాపర్ హోమ్ వర్క్ చేసినట్టు అనిపించదు. అసలు శర్వా క్యారెక్టర్ మీదే బోలెడు కామెడీని సృష్టించొచ్చు. కానీ ఇదంతా లైటర్ వీన్ వ్యవహారంలా సాగుతుందే తప్ప ఎక్కడా నవ్వించదు.

అక్కడక్కడా కాసిన్ని నవ్వులు ఉన్నాయి కానీ అవి టికెట్ ధరకు న్యాయం చెల్లించే స్థాయిలో మాత్రం కాదు. ఆద్యాకు తన తల్లి విషయంలో అంత క్లారిటీ ఉన్నప్పుడు అదేదో హీరోకు ముందే చెప్పేయాలి. ఆ ఛాన్స్ ఉంది కూడా. కేవలం ఇంటర్వెల్ బ్లాక్ కోసం దాన్ని దాచిపెట్టి రెండు పాటలు ఇరికించి ఆ తర్వాత రివీల్ చేయడం సింక్ అవ్వలేదు. పైగా వకుళ వైపు నుంచి చూపించిన పెళ్లి వ్యతిరేకత వెర్షన్ ఆసక్తికరంగా లేదు. ఏదో ఒక డైలాగుతో సరిపుచ్చారు తప్పించి నిజంగా ఏ తల్లి తన కూతురు జీవితాంతం ఒంటరిగా ఉన్నా పర్లేదు అని అనుకోదు. ఒకవేళ ఆమె ఉద్దేశం ఇల్లరికం అయినప్పుడు అదైనా సరిగా రిజిస్టర్ చేసి ఉంటే మలుపు వేరేలా ఉండేదేమో.

అసలు చిరు ఆద్యల లవ్ ట్రాకే సోసోగా సాగుతుంది. ఆటోలో కలిసి ప్రయాణించగానే అంత చదువుకున్న అమ్మాయి సిల్లీగా కమర్షియల్ సినిమాల టైపులో అతని మీద అంత ఆరాధ్య భావం పెంచుకోవడం అర్థం కాదు. ఆ ఒక్క సంఘటనకే పదే పదే చిరుకి ఫోన్ చేయడం, కలవాలనుందని చెప్పడం ఇవన్నీ అతి మాములుగా ఉన్నాయి. పోనీ హీరో ఇంట్లో ఆడవాళ్ళ మీదైనా కిషోర్ గట్టిగా దృష్టి పెట్టారా అంటే అదీ లేదు. టీవీ సీరియల్స్ తరహాలో సన్నివేశాలు సృష్టించి రెగ్యులర్ ఆడియన్స్ కి బోర్ కొట్టించారు. ఈ మాత్రం డ్రామాలు రోజుకు పది గంటల సేపు ఇంట్లోనే చూసే అవకాశం ఉన్నప్పుడు డబ్బులు ఖర్చు పెట్టి మరీ ఆడాళ్ళు థియేటర్ కు వస్తారా.

సినిమాలో ఏ క్యారెక్టరైజేషన్ సరిగా కుదరలేదు. అన్ని హాఫ్ బేక్డ్ గా అనిపిస్తాయి. మల్లేశ్వరిలో వెంకటేష్ ని పెళ్లి కానీ ప్రసాద్ అని ఎగతాళి చేసినప్పుడు మనకు నవ్వుతో పాటు అతని మీద సానుభూతి ఓ అభిప్రాయం కలుగుతాయి. కాబట్టే అతను చేసిన పనులను ఒప్పుకున్నాం. కానీ ఇక్కడ చిరుకు సైతం అలాంటి పెయిన్ ఉన్నా మనకు ఏ ఫీలింగ్ కలగదు. కారణం ఎమోషనల్ ని బలంగా చెప్పే తిరుమల కిషోర్ ఇందులో మాత్రం ఈ విషయంలోనే తేలిపోయాడు. టైటిల్ సాంగ్ కూడా మైనస్సే. పిన్ని బాబాయ్ లను పట్టుకుని మీరు కత్రినా కైఫ్ లా, మీ మొగుళ్ళు ప్రభాస్ లా, మీరు ముగ్గురేసి పిల్లలని కనలేదా అంటూ పాట పాడటం ఉత్తమాభిరుచికి నిదర్శనం.

ఇమేజ్ ఉన్న హీరో మూవీ కాబట్టి కొంత కమర్షియల్ టచ్ ఉండటం అవసరం. అందుకే ఫైట్లు గట్రా పెట్టొచ్చు అనిపిస్తాయి. తప్పు లేదు. కానీ ఒకపక్క సెంటిమెంటే బ్యాలన్స్ కాక చూస్తున్న వాళ్ళు కిందా మీద పడుతుంటే రెండు ఫైట్లు పెట్టడం తేడా కొట్టేసింది. ఆద్యను కాసేపు పక్కన పెడితే ఇది చిరు వకుళ మధ్య నడవాల్సిన కథ. కానీ ఆ పాత్రల తీరుతెన్నులే గతి తప్పినప్పుడు మిగిలిన వాటి నుంచి ఏమీ ఆశించలేం. చాలా నీట్ గా, ఎక్కడా అసభ్యతకు తావు ఇవ్వకుండా, ఇబ్బంది పడేలా చిన్న లిప్ లాక్ కిస్సు లేకుండా తిరుమల కిషోర్ తన స్కూల్ కి కట్టుబడి ఉండటం ఒక్కటే ఈ సినిమాకు సంబంధించిన సానుకూలమైన అంశం.

దేవిశ్రీ ప్రసాద్ పాటలు రెండు క్యాచీగా ఉన్నాయి కానీ వాటికి పెద్దగా రిపీట్ వేల్యూ లేదు. నేపధ్య సంగీతం కూడా ఎలాంటి ప్రత్యేకత లేకుండా పోయింది. సుజిత్ సారంగ్ ఛాయాగ్రహణం కలర్ ఫుల్ గా మంచి విజువల్స్ ని ఇచ్చింది. శ్రీకర్ ప్రసాద్ ఎడిటింగ్ లో అనుభవం కనిపించింది కానీ నిమిషాల తరబడి క్లాసులు పీకే క్యారెక్టర్ల మధ్య ఆయన చేయగలిగింది ఇంత కన్నా ఎక్కువేం లేదు. సంభాషణలు చప్పగా సాగాయి. అక్కడక్కడా మెరుపులు ఉన్నాయి. ఆర్ట్ వర్క్ పర్వాలేదు. నిర్మాణ విలువలు తెలివిగా ఉన్నాయి. ఆడవాళ్ళ హంగామా మధ్య సరిపెట్టేశారు కానీ విపరీతంగా ఖర్చయిన దాఖలాలు పెద్దగా లేవు

ప్లస్ గా అనిపించేవి

తారాగణం
క్లీన్ ప్రెజెంటేషన్
రష్మిక గ్లామర్
రెండు పాటలు

మైనస్ గా తోచేవి

ఎమోషన్స్
బంధాల మీద క్లాసులు
సెకండ్ హాఫ్
లవ్ ట్రాక్

కంక్లూజన్

ఆకర్షణీయమైన టైటిల్, కనులవిందుగా ఉండే క్యాస్టింగ్ ఈ రెండు చాలనుకుంటే ఆడవాళ్ళూ మీకు జోహార్లుని ట్రై చేయొచ్చు. అలా కాకుండా మాకంటూ కొన్ని అంచనాలు ఉన్నాయి, ఎంటర్ టైన్మెంట్ కావాలి, ఎంజాయ్ చేసే ఫీల్ గుడ్ లవ్ స్టోరీ ఉండాలి, ఫ్యామిలీ మొత్తాన్ని మెప్పించే కంటెంట్ కావాలి అంటే మాత్రం నిరాశ తప్పదు. పేరు మోసిన సుబ్బయ్య హోటల్ భోజనమైనా వండిన రోజే తింటే బాగుంటుంది. ఓ నెల తర్వాత బుట్ట తీస్తే జరిగేదేంటో వేరే చెప్పాలా. తిరుమల కిషోర్ ఆలోచన మంచిదే కానీ దాన్ని తీర్చిదిద్దే విధానం మీద బలమైన కసరత్తు చేసి ఉంటే నేను శైలజ రేంజ్ లో ఏదో మేజిక్ జరిగేది. కానీ ఛాన్స్ మిస్ అయ్యింది

ఒక్క మాటలో – తెప్పించారు బేజార్లు

Also Read : Bheemla Nayak Review : భీమ్లా నాయక్ రివ్యూ

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి