iDreamPost

అవతార్ 2 ది వే అఫ్ వాటర్ రివ్యూ

అవతార్ 2 ది వే అఫ్ వాటర్ రివ్యూ

మాములుగా ఒక హాలీవుడ్ సినిమాకు తెల్లవారుఝామున ఆరు గంటలకు షోలు పడటం తెలుగు రాష్ట్రాల్లో చాలా అరుదు. ఏ మహేష్ బాబో పవన్ కల్యాణో అయితే సహజం అనుకోవచ్చు. కానీ అవతార్ 2కి పట్టణాల్లో సైతం స్పెషల్ ప్రీమియర్లు వేశారంటే పరిస్థితి ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవాలి. మొదటి భాగం వచ్చిన పదమూడేళ్ల తర్వాత వచ్చిన సీక్వెల్ అయినప్పటికీ జనంలో దీని క్రేజ్ ఇంకా తగ్గలేదనే క్లారిటీ వచ్చేసింది. ముఖ్యంగా హైదరాబాద్ లాంటి నగరాల్లో టికెట్ల కోసం డిమాండ్ మాములుగా లేదు. లార్జ్ స్క్రీన్ తో త్రీడిలో ఎక్స్ పీరియన్స్ చేసేందుకు ఫ్యాన్స్ ఎగబడుతున్నారు. మరి ఇంతగా అంచనాలు మోసిన అవతార్ 2 ఎలా ఉందో రివ్యూలో చూసేద్దాం

కథ

ఇది ఫస్ట్ పార్ట్ కి కొనసాగింపే. పండోరా గ్రహంలో భార్యా పిల్లలతో ప్రశాంతంగా జీవిస్తుంటాడు జేక్ సల్లీ(శామ్ వాషింగ్టన్). ఈ తెగకు నాయకుడిగా వాళ్ళను కాపాడుకుంటూ ఉంటాడు. అయితే సల్లీ మీద ప్రతీకారంతో రగిలిపోతున్న క్వారిచ్(స్టీఫెన్ లాంగ్) అడవి మీద దాడి చేసి పిల్లలను ఎత్తుకుపోతారు. అందులో తెల్లజాతికి చెందిన స్పైడర్ ఉంటాడు. తాను పండోరాలోనే ఉంటే ప్రజాల ప్రాణాలకు ప్రమాదమని గుర్తించి సల్లీ కుటుంబంతో సహా సముద్ర తీరంలో ఉండే మెట్కయినా ప్రాంతానికి తీసుకెళ్తాడు. క్వారిచ్ ఇది కనిపెట్టి మిసైల్స్ తో జలమార్గం ద్వారా అటాక్ చేస్తాడు. మరి సల్లీ ఈ ప్రమాదాన్ని ఎలా ఎదురుకున్నాడనేదే తెరమీద చూడాల్సిన అసలు స్టోరీ

నటీనటులు

ఇది మోషన్ క్యాప్చర్ టెక్నాలజీతో రూపొందించిన సినిమా. పేరుకి సాంకేతిక వాడకమే కానీ యాక్టర్స్ మాములుగా కంటే ఎక్కువ కష్టపడాల్సి ఉంటుంది. ఇది తేడా కొట్టినందు వల్లే ఆది పురుష్ టీజర్ మీద అన్ని విమర్శలు వచ్చాయి. కానీ ఇక్కడ ఉన్నది జేమ్స్ క్యామరూన్. తాను తీసుకున్న క్యాస్టింగ్ నుంచి ఎలాంటి పెర్ఫార్మన్స్ రాబట్టుకోవాలో మైక్రో లెవల్ లో ఏదీ వదలకుండా పిండుకున్నాడు. మనం చూస్తున్నది నిజమైన మనుషులా లేక సృష్టా అనే అయోమయం కలిగే రేంజ్ లో వాటితోనూ ఎమోషన్స్ పండించాడు. జో సాల్డనా, స్టీఫెన్ లాంగ్, కేట్ విన్స్లెట్, శామ్ వాషింగ్టన్ ఇలా ఎవరికి వారు తమకిచ్చిన బాధ్యతను చక్కగా నిర్వర్తించి మెప్పించారు.

డైరెక్టర్ అండ్ టీమ్

దర్శకుడు జేమ్స్ క్యామరూన్ పదమూడేళ్ల కల ఇది. అవతార్ మొదటిసారి రిలీజైనప్పుడు పండోరా అనే సరికొత్త ప్రపంచం ఊహాతీతంగా ఉండి ప్రేక్షకులకు అద్భుతంగా కనిపించింది. నమ్మశక్యం కాని రీతిలో నీలిరంగులో ఎప్పుడూ చూడని జాతిని పరిచయం చేయడం చూసి థ్రిల్ అయ్యారు. దానికి తోడు కళ్ళు చెదిరే విజువల్ ఎఫెక్ట్స్, యాక్షన్ ఎపిసోడ్స్, గూస్ బంప్స్ ఇచ్చే ఫైట్లు, అన్నిటిని మించి సున్నితమైన భావోద్వేగాలు వెరసి అవతార్ అనే అనుభూతి దశాబ్దంపైగా మనసులో అలా ఉండిపోయింది. దానికంత గొప్ప విలువ దక్కింది కాబట్టి ఈరోజు మతిపోయే స్థాయిలో ఓపెనింగ్స్ దక్కాయి. అంతే గొప్పగా ఈ వే అఫ్ వాటర్స్ ని ఊహించుకుంటాం.

క్యామరూన్ ఈసారి ఎమోషన్స్ కు పెద్ద పీఠ వేశాడు. తండ్రెవరో తెలియని ఓ అనాథ కుర్రాడికి పండోరా పెద్దకు అతని పిల్లలకు మధ్య ఏర్పడ్డ అనుబంధం, తీరా చూస్తే వాడు విలన్ కొడుకే కావడం, ఆశ్రయం కోరి తమ దగ్గరకు వచ్చిన వాడి ఆచూకీ కోసం శత్రువులు ప్రాణాల మీదకు తెస్తే చలించకుండా సముద్రజాతి ఒకే మాట మీద నిలబడటం ఇవన్నీ చక్కగా కుదిరాయి. అయితే సుదీర్ఘంగా కథను విడమరిచి చెప్పాలన్న జేమ్స్ ప్రయత్నం నిడివిని ఏకంగా 3 గంటల 12 నిమిషాలకు తీసుకెళ్లింది. దీనివల్ల ల్యాగ్ ఎక్కువైపోయి అవసరం లేని సన్నివేశాలతో మధ్యలో బోర్ కొట్టేస్తుంది. ఒకదశలో సింపుల్ సీన్లు సైతం సాగతీత గురి కావడం అసహనాన్ని కలిగిస్తుంది

ఏవైతే అంచనాలతో ఆడియన్స్ థియేటర్ లో అడుగు పెడతారో వాటిని ఒడిసిపట్టుకోవడంలో మాత్రం జేమ్స్ క్యామరూన్ సక్సెస్ అయ్యారు. పండోరా మేజిక్ ని మళ్ళీ రిపీట్ చేశారు.కాకపోతే మనం వన్ లో చూసిందానికి పది రెట్లు ఎక్కువ ఇందులో ఎక్స్ పెక్ట్ చేస్తాం. విజువల్ ఎఫెక్ట్స్ ఎంత అద్భుతంగా ఉన్నా ఫస్ట్ హాఫ్ లో ఎక్కడా పెద్దగా గూస్ బంప్స్ మూమెంట్స్ ఉండవు. మైండ్ బ్లోయింగ్ అనిపించే ట్విస్టులు కనిపించవు. మరీ విసుగు రాకుండా ఎలా తీశారబ్బా అనే విస్మయాన్ని మాత్రం కలగజేస్తూ ఉంటాయి. చివరి గంట క్వారిచ్ జలచరాల మీద దాడి చేయడం మొదలుపెట్టాకే కథనం పరుగులు పెడుతుంది. యాక్షన్ లవర్స్ కోరుకున్న స్పీడ్ వస్తుంది.

పండోరాని విపరీతంగా ప్రేమించిన వాళ్లకు వే అఫ్ వాటర్స్ నిరాశపరిచే ఛాన్స్ లేదు. కానీ అంతకు మించి అని ఏదేదో ఊహించుకుంటే మాత్రం చివర్లో కొంతైనా అసంతృప్తి లేకుండా బయటికి రాలేం. పైగా క్లైమాక్స్ అయ్యాక కూడా పావు గంట ఇంకేదో చెప్పాలనుకుని పెట్టిన ఎపిసోడ్ ట్రిమ్ చేసి ఉంటే బాగుండేది. ఇంత లెన్త్ ఉన్నవి మనకు కొత్తేమి కాదు కానీ పాటలు, కమర్షియల్ అంశాలు లేని హాలీవుడ్ మూవీ కి ఇది సమస్యే. టైటానిక్ లోనూ గంటన్నర తర్వాతే షిప్పు మునిగిపోతుంది. అప్పటిదాకా టైం పాస్ వ్యవహారంతో నడిపిస్తారు క్యామరూన్. ఆ ట్రాజెడీ తాలూకు బేసిక్ సెటప్ పర్ఫెక్ట్ గా కుదిరింది కాబట్టి అదేమీ ఇబ్బంది కాలేదు. ఒకవేళ టైటానిక్ 2 తీసుంటే ఇంపాక్ట్ తగ్గేదేమో

మొదటిసారి అద్భుతంగా అనిపించింది రెండోసారికి రుచి తగ్గినట్టు అనిపించడం సహజం. అవతార్ 2లోనూ అదే జరిగింది. సముద్రంలో ఫైట్, ఛేజ్ ని నభూతో నభవిష్యత్ అన్న రీతిలో డిజైన్ చేసుకున్న క్యామరూన్ ఈ దశాబ్ద కాలంలో చాలా మార్పులు వచ్చాయని, ఆడియన్స్ మైండ్ సెట్ మరింత డిమాండ్ చేస్తోందని గుర్తించలేకపోయారు. నెయ్యి ఎంత క్వాలిటీ ఉన్నా ఇంకేమి కలుపుకోకుండా వట్టి అన్నంతో ఎంతసేపని తింటాం. పచ్చడి, కాయగూర, రసం, అప్పడం లాంటివి పడాల్సిందే. ఇక్కడ ఉద్దేశం ఐటెం సాంగులు బోయపాటి ఫైట్లని కాదు. గతంలో ఫీలవ్వని అదనపు హంగులు జోడిస్తే చూసేవాళ్ళు కంటిని మరింత ఇంపు కలగజేస్తుంది

జురాసిక్ పార్క్, స్పైడర్ మ్యాన్, యాంట్ మ్యాన్, అవెంజర్స్ అంటూ బోలెడు సిరీస్ చూస్తున్నాం ఆదరిస్తున్నాం. అదే నమ్మకంతోనే అవతార్ కూడా నాలుగైదు భాగాలుగా వచ్చేందుకు సిద్ధపడుతోంది. మనకు ఈ సినిమా ఇంతగా కనెక్ట్ కావడానికి కారణాలు లేకపోలేదు. బాహుబలి తరహా ఎలివేషన్లు, ఘర్షణ టైపు అన్నదమ్ముల కొట్లాటలు, స్నేహం కోసం లాగా ఫ్రెండ్స్ కోసం ప్రాణమిచ్చే నేస్తాలు, అమ్మాయి నచ్చితే ఎంత రిస్క్ అయినా చేసే కుర్రాళ్ళ సాహసాలు ఇవన్నీ తనదయిన స్టైల్ లో క్యామరూన్ అవతార్ లో పొందుపరుస్తున్నారు కాబట్టి ఇంతగా ఎగబడుతున్నాం. అందుకే ఎక్కడా లేని అడ్వాన్స్ బుకింగ్స్ మన దగ్గరే కనిపిస్తున్నాయి.

టెక్నికల్ గా క్యామరూన్ పనితనం గురించి లోతుగా విశ్లేషించాల్సిన అవసరం లేదు కానీ ఎప్పటికప్పుడు మారిపోతున్న కంటెంట్ డిమాండ్ దృష్ట్యా తన నెరేషన్ స్టైల్ ని 2009 నుంచి 2022కి మార్చాల్సిన అవసరమైతే ఉంది. పండోరా నుంచి ఫ్యాన్స్ ఏవేవో ఆశిస్తున్నారు. వాటిని అందుకోవాలంటే మరింత కసరత్తు జరగాలి. గేమ్ అఫ్ థ్రోన్స్, హౌస్ అఫ్ డ్రాగన్స్ లాంటి వెబ్ సిరీస్ లోనే టాప్ మోస్ట్ క్వాలిటీ విజువల్ ఎఫెక్ట్స్ ని చూపిస్తున్నప్పుడు అవతార్ వాటికి మించి ఇంకా అతీతంగా మరింత డ్రామాతో ఇంకాస్త ఎలివేషన్లతో నెక్స్ట్ లెవెల్ లో ఉండాలి. అవతార్ 2 విజయం సాధించవచ్చు. కానీ త్రీకి బూస్ట్ కావాలంటే ఇది సరిపోదు. అదేంటో మనకన్నా క్యామరూన్ కే బాగా తెలుసు

రస్సెల్ కార్పెంటర్ ఛాయాగ్రహణం గురించి చెప్పాలంటే రెండు మూడు లైన్లు సరిపోవు. లేని ప్రపంచాన్ని ఊహించుకుని తన కెమెరా కన్నుని వాడుకున్న తీరుకి హాట్స్ అఫ్ చెప్పాల్సిందే. ముఖ్యంగా సీ ఎపిసోడ్స్ లో చెలరేగిపోయారు. సైమన్ ఫ్రాగ్లెన్ నేపధ్య సంగీతం అవతార్ ది వే అఫ్ వాటర్ కి ఎలాంటిది కావాలో అలాగే కుదిరింది. అట్మోస్ సౌండ్ లో బాగా ఫీలవ్వొచ్చు. నలుగురు ఎడిటర్లు పని చేసినా ల్యాగ్ తప్పలేదు.. స్టీఫెన్, డేవిడ్, జాన్, జేమ్స్ క్యామరూన్ లు సంయుక్తంగా ఈ బాధ్యత నిర్వర్తించారు. ప్రొడక్షన్ వేల్యూస్ గురించి చెప్పడానికేం లేదు. పదహారు వేల కోట్ల బ్రేక్ ఈవెంట్ టార్గెట్ అంటేనే ఏ రేంజ్ లో ఖర్చు పెట్టారో అర్థం చేసుకోవచ్చు

ప్లస్ గా అనిపించేవి

సముద్రపు నేపథ్యం
సెకండ్ హాఫ్
విజువల్ ఎఫెక్ట్స్
నిర్మాణ విలువలు

మైనస్ గా తోచేవి

మూడు గంటలకు పైగా నిడివి
మొదటి సగంలో ల్యాగ్
గూస్ బంప్స్ మూమెంట్స్ తగ్గడం

కంక్లూజన్

కొన్ని అనుభూతులు బిగ్ స్క్రీన్ మీద చూస్తేనే బాగుంటాయి. ఫైనల్ గా సినిమా బాగుందా లేదా అనేది కాసేపు పక్కనపెడితే ఒక టాప్ నాచ్ ఎక్స్ పీరియన్స్ కోసం అవతార్ ది వే అఫ్ వాటర్ లాంటివి థియేటర్లోనే ఎంజాయ్ చేయాలి. కొందరికి నచ్చకపోవచ్చు. కొందరికి ఓకే అనిపించచ్చు. మరికొందరికి వావ్ అనిపించవచ్చు అభిప్రాయాలు ఎంత మిశ్రమంగా వచ్చినా ఫైనల్ గా తీవ్రంగా నిరాశ చెందకుండా చేయడంలో మాత్రం క్యామరూన్ సక్సెస్ అయ్యారు. ముఖ్యంగా ఇండియన్ ఆడియన్స్ కి కావాల్సిన ఎమోషనల్ ఎలిమెంట్స్ బాగా కుదిరాయి. ఇంట్లో పిల్లలుండి వాళ్ళను థియేటర్ కు తీసుకెళ్లే ఆలోచన చేస్తే అవతార్ 2 ఖచ్చితంగా డీసెంట్ రికమండేషన్ అవుతుంది.

ఒక్క మాటలో – ది వే అఫ్ థియేటర్

రేటింగ్ : 2.75 / 5

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి