iDreamPost

జగన్ చెప్పినట్లు మండలి రద్దుకు రామోజీ రావే కారణమా?

జగన్ చెప్పినట్లు మండలి రద్దుకు రామోజీ రావే కారణమా?

గత పది రోజులుగా శాససనమండలి మీద జరుగుతున్న చర్చ ప్రభుత్వము నిన్న మండలిని రద్దు చేస్తూ ప్రవేశ పెట్టిన తీర్మానాన్ని శాసన సభ ఆమోదించడంతో ముగిసింది. చర్చలో భాగంగా ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి గతంలో ఎన్టీఆర్ రామోజీరావును రక్షించడానికే శాసనమండలిని రద్దు చేసారని అన్నారు. దీనితో రామోజీరావుకు శాసనమండలికి ఏమి సంబంధం అనే చర్చ జరుగుతుంది.

తెలుగుదేశం తొలి ప్రభుత్వం

1983 ఎన్నికల్లో టీడీపీ గెలిచి జనవరి 9 న ఎన్టీఆర్ ముఖ్యమంత్రి అయ్యారు. తెలుగుదేశం శాసనసభ్యుల తొలి సమావేశంలోనే తమకు ప్రాతినిధ్యం లేని శాసన మండలిని రద్దు చేయాలని డిమాండ్ వచ్చింది. టీడీపీ ఎమ్మెల్యేలు భయపడ్డట్లుగానే శాసనమండలిలో కాంగ్రెస్ తరపున రోశయ్య, బీజేపీ తరపున జూపూడి యజ్ఞ నారాయణ, రంగారెడ్డి తదితరులు ప్రభుత్వం మీద విరుచుకుపడేవారు. రాజకీయాలు కొత్త కావడం పరిపాలన అనుభవం లేకపోవడంతో ప్రభుత్వం సమాధానాలు చెప్పడానికి ఇబ్బంది పడేది. శాసన మండలి సమావేశం అంటేనే ప్రభుత్వానికి పీడకలగా ఉండేది.

Read Also: మండలి రద్దు – నాడు ఎన్టీఆర్ సమర్థన

ప్రభుత్వం ఏర్పడిన సరిగ్గా రెండు నెలలకు అంటే 9 మార్చ్ 1983న శాసనమండలిలో ప్రశ్నోత్తరాల సమయాన్ని రద్దు చేసి ప్రభుత్వం బడ్జెట్ ప్రవేశపెట్టింది. ప్రశ్నోత్తరాల సమయాన్ని రద్దు చేయడం మీద మండలిలో గందరగోళం నెలకొంది. దీనిమీద ఈనాడు “పెద్దల గలబ” అన్న హెడ్డింగ్ తో వార్త ప్రచురించింది.

ఈ గందరగోళాల మధ్య ప్రభుత్వం ప్రవేశపెట్టిన పలు బిల్లులను సెలెక్ట్ కమిటీ కి పంపడం పర్యవసానంగా 24 మార్చ్ 1983 నాడు శాసనమండలిని రద్దు చేస్తూ శాసనసభలో తీర్మానం చేసి ఆమోదం కోసం కేంద్రానికి పంపింది. అంటే అధికారంలోకి వచ్చిన 75 రోజుల్లోనే మండలికి ముగింపు పలికే ప్రయత్నం చేసారు.

మండలి రద్దుకు రామోజీరావు ఈనాడు వార్తలే కారణము అని నమ్మిన విపక్ష కాంగ్రెస్ బీజేపీ ఎమ్మెల్సీలు రద్దును నివారించడానికి రామోజీరావు మీద ప్రతీకారానికి “పెద్దల గలబ” అన్న వార్తపై, బీజేపీ ఎమ్మెల్సీ వై.సీ రంగా రెడ్డి సభాహక్కుల నోటీసుని ఇచ్చారు. ఈ నోటీసును పరిశీలించిన సభాహక్కుల కమిటీ “పెద్దల గలబ” అనడం అవమానించడమే అని రామోజీరావుకు షోకాజ్ నోటీసులు ఇచ్చింది.

Read Also: మండ‌లికి మంగ‌ళం.. 13 ఏళ్లకే ముగిసిన ప్రయాణం

షోకాజ్ నోటీసుకి సమాధానంగా రామోజీరావు పెద్దల గలబ అనే హెడ్డింగ్ లో ఎవరినీ అవమానపరిచే ఉద్దేశ్యం కానీ పదాలు కానీ లేవని, ఏ విధంగా సభాహక్కులకు భంగం కలిగించింది ఈ నోటీసులో లేదని, సభా సంఘంలో ఉన్నవాళ్లు రాజకీయ పక్షపాతం లేకుండా ఉండాలని,తాను వ్యక్తిగతంగా హాజరు కానని సమాధానం ఇచ్చారు.

ఈ వివాదం అనేక నెలల పాటు కొనసాగింది. ఈనాడు పత్రిక సంపాదకీయంలో రామోజీరావు మండలి రద్దుపై ప్రభుత్వ నిర్ణయాన్ని సమర్ధించారు. ఒక సందర్భంలో ఈనాడు పెద్ద సింహాసనంపై కుక్క కూర్చున్న కార్టూన్ ని వేసింది. దీనితో ఈ సమస్య ఇంకా ముదిరింది. పది నెలలపాటు కొనసాగిన సభాహక్కుల విచారణ 28 మార్చ్ 1984 న ముగిసి రామోజీరావుకు మరోసారి సమన్లు ఇవ్వాలని నిర్ణయం తీసుకుంది. దీనితో తన అరెస్టును ముందస్తుగా ఊహించిన రామోజీరావు సుప్రీం కోర్టుకు వెళ్లి అరెస్ట్ కాకుండా మండలి నిర్ణయంపై స్టే తీసుకొచ్చుకున్నారు.

Read Also: రాజధాని వికేంద్రీకరణ బిల్లుకు బ్రేక్ – అనుకున్నది సాధించిన టీడీపీ

27 మార్చ్ 1984న నాటి హైదరాబాద్ సిటీ కమిషనర్ కే. విజయ రామారావు(మాజీ సిబిఐ డైరెక్టర్, మాజీ మంత్రి) రామోజీరావును అరెస్టు చేయడానికి ఈనాడు కార్యాలయానికి వెళ్లారు. రామోజీరావు సుప్రీం కోర్టు స్టే ఆర్డర్ ను విజయ రామారావుకు చూపించారు.

విజయ రామారావు న్యాయ సంకటం

రామోజీరావును అరెస్టు చేస్తే సుప్రీం కోర్టు ధిక్కరణ అవుతుంది.. అరెస్టు చేయకుండా వెళ్తే శాసనమండలి ధిక్కరణ అవుతుంది.. ఎటూ పాలుపోక మీరు స్వచ్చందంగా రండి అని రామోజీరావును అడిగారు. దానికి రామోజీరావు మీరు అరెస్ట్ చేసి తీసుకు వెళ్ళండి “నేను రాను” అని చెప్పారు. చివరకు రామోజీరావును అరెస్టు చేయకుండానే వెనుదిరిగిన విజయరామారావు సుప్రీం కోర్టు స్టే ఆర్డర్ గురించి మండలి చైర్మన్ కి చెప్పారు.

Read Also: మండలి రద్దుపై చంద్రబాబు Uturn తీసుకుంటారా ?

ఆ తర్వాతి మద్రాస్ కు చెందిన ఒక “లాయర్” సలహా మేరకు శాసనమండలిని “ప్రోరోగ్” ప్రభుత్వం గవర్నర్ కు రికమెండ్ చేసారు. దాన్ని గవర్నర్ అంగీకరించారు. దీని తరువాత శాసనమండలి సమావేశాలు మళ్ళీ జరగలేదు..

కేంద్రము శాసనమండలి రద్దు మీద ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంతో 1985లో మరొకసారి శాసనమండలి ని రద్దు చేస్తూ కేంద్రానికి తీర్మానం పంపారు. నాటి రాజకీయ పరిస్థితుల్లో ప్రధాని రాజీవ్ గాంధీ “పార్టీ ఫిరాయింపుల చట్టానికి” విపక్షాల మద్దతు కూడా కూడగట్టే ప్రయత్నంలో భాగంగా ఆంధ్ర ప్రభుత్వ శాసనమండలి రద్దు బిల్లును ఆమోదించారు. ప్రతిగా టీడీపీ పార్లమెంట్లో పార్టీ ఫిరాయింపుల చట్టానికి మద్దతు ఇచ్చింది. ఆ విధంగా 31 మే 1985 నాడు శాసన మండలి రద్దు అయ్యింది.

Read Also: మండలి రద్దు దిశగా..

శాసన మండలి ప్రోరోగ్ కాకుండా ఉన్నా లేక రద్దు కాకుండా ఉన్న నాటి ప్రభుత్వానికన్నా రామోజీరావుకు ఎక్కువ ఇబ్బంది ఉండేది. సుప్రీం కోర్టు ఇచ్చిన స్టే ఎక్కువ కాలం నిలబడదు.. ఏదో ఒక రోజు రామోజీరావు తప్పక శాసన మండలి ముందు హాజరయ్యి సంజాయిషీ ఇచ్చుకునే పరిస్థితి వచ్చేది.. అందుకే శాసన మండలి రద్దుకు RRR- రామోజీరావు, రామారావు, రోశయ్య కారణమని చెప్తారు. ఇదే నాటి శాసన మండలి కథ..

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి