iDreamPost

రానా ముందు రీమేక్ సవాల్

రానా ముందు రీమేక్ సవాల్

పక్క భాషలో సినిమా హిట్ అయితే దాని హక్కులు కొనేసుకోవడం ఈజీనే కానీ సరైన క్యాస్టింగ్ తో రీమేక్ చేయడం మాత్రం చాలా కష్టం. అంత చిరంజీవికే గాడ్ ఫాదర్ కోసం తిప్పలు తప్పలేదు. ముందు సుజిత్ కు ఇచ్చారు. తర్వాత వినాయక్ ని పిలిపించారు. మధ్య సుకుమార్ ఒక లుక్ వేశారు. ఇవన్నీ అయ్యాక లాభం లేదని చెన్నైలో ఉన్న మోహన్ రాజాకు కబురు పెట్టి తీయించారు. ఇంతా చేసి అదేం రికార్డులు బద్దలు కొట్టేంత హిట్టు కాలేదు. భీమ్లా నాయక్ కు ఇదే సమస్య వస్తే త్రివిక్రమ్ కేవలం రాతకే పరిమితమై ఖాళీగా ఉన్న సాగర్ చంద్రను కెప్టెన్ చేశారు. వకీల్ సాబ్ కు ఇదే ఫాలో అయిపోయి వేణు శ్రీరామ్ ని పట్టుకొచ్చారు. ఇలా ఉంటాయి రీమేక్ కష్టాలు

తాజాగా రానాకు ఇదే పరిస్థితి ఎదురవుతోంది. శింబు హీరోగా విడుదలైన మానాడు ఎంత పెద్ద హిట్టో కోలీవుడ్ ని ఫాలో అయ్యేవాళ్ళకు బాగా తెలుసు. టైం లూప్ కాన్సెప్ట్ ని తీసుకుని దర్శకుడు వెంకట్ ప్రభు తీర్చిదిద్దిన విధానం క్లాస్ మాస్ ఆడియన్స్ ని బాగా ఎక్కేసింది. తెలుగు డబ్బింగ్ కూడా చేయించారు కానీ రీమేక్ చేస్తేనే బాగుంటుందని భావించిన సురేష్ బాబు విడుదల ఆపించేసి స్క్రిప్ట్ పనులు మొదలుపెట్టారు. కానీ సోనీ లివ్ లో డబ్బింగ్ వచ్చేయడంతో చాలా మంది చూసేశారు కూడా. సరే ఇదంతా మాములే అనుకుంటే ఇప్పుడు రానా ఏ పాత్ర చేయాలనే కన్ఫ్యూజన్ తో పాటు ఎస్జె సూర్య క్యారెక్టర్ కు ఎవరు సూటవుతారనే ఛాలెంజ్ మొదలయింది

మొత్తానికి ఆలస్యం తప్పేలా లేదు. నిజానికి మానాడు అనువాదం చేస్తే సరిపోయేది కానీ సబ్జెక్టు మీదున్న కాన్ఫిడెన్స్ తో రీమేక్ కే మొగ్గు చూపారు. ఒక ముస్లిం యువకుడికి టెర్రరిస్టు ముద్ర పడి ముఖ్యమంత్రిని చంపే ఎపిసోడ్ కు టైం లూప్ ద్వారా లింక్ కావడమనే ఇంటరెస్టింగ్ పాయింట్ తో దీన్ని తెరకెక్కించారు. ఒకరకంగా సీన్లు పదే పదే రిపీట్ అవుతూ స్క్రీన్ ప్లే డిఫరెంట్ గా సాగుతుంది. మన ఆడియన్స్ కి అంత ఈజీగా కనెక్ట్ అయ్యే కాన్సెప్ట్స్ కావివి. మరి వెంకట్ ప్రభు స్థాయిలో ఇక్కడ హ్యాండిల్ చేయగల దర్శకుడిని సెట్ చేసుకోవడం రానాకు పెద్ద సవాల్. నారప్పకు శ్రీకాంత్ అడ్డాలని తీసుకొచ్చినట్టు దీన్ని కూడా ఏదైనా మేనేజ్ చేస్తారేమో చూడాలి

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి