iDreamPost

NC 22 – తండ్రికొడుకుల సంగీతం

NC 22 – తండ్రికొడుకుల సంగీతం

దర్శకుడు వెంకట్ ప్రభుది విలక్షణ శైలి. రెగ్యులర్ కమర్షియల్ ఫార్మట్ లో సినిమాలు తీయకపోయినా ఆయన టేకింగ్ మాస్ ని సైతం విపరీతంగా మెప్పిస్తుంది. దానికి ఉదాహరణ అజిత్ గ్యాంబ్లర్, శింబు మానాడు.కొన్ని డిజాస్టర్లు కూడా ఉన్నాయి లెండి. ప్రస్తుతం ఈయన నాగచైతన్యతో ఓ సినిమా చేయబోతున్నాడు. ఉప్పెన ఫేమ్ కృతి శెట్టి హీరోయిన్ గా చేస్తోంది. ఇవాళే అఫీషియల్ గా ప్రకటించారు. దానికన్నా పెద్ద విశేషం ఇళయరాజాతో పాటు వారి అబ్బాయి యువన్ శంకర్ రాజా దీనికి సంయుక్తంగా సంగీతం అందించబోతున్నారు. ఒక తెలుగు సినిమాకు ఇలా జంటగా మ్యూజిక్ ఇవ్వడం ఇదే మొదటిసారి. అందుకే ఇది స్పెషల్ న్యూస్ అవుతోంది.

ఇళయరాజా చైతు తండ్రి నాగార్జునకు మంచి హిట్స్ ఇచ్చారు. ఆఖరి పోరాటం, నిర్ణయం, చైతన్య, కిల్లర్ ఇవన్నీ హిట్టు ఫ్లాపు పక్కనపెడితే పాటల పరంగా చార్ట్ బస్టర్స్ గా నిలిచాయి. ముఖ్యంగా హలో గురు ప్రేమ కోసమే రోయ్ జీవితం, ఓహో లైలా ఓ చారుశీలా, ప్రియా ప్రియతమా రాగాలు, తెల్లచీరకు తాకధిమి తాపనలు సాంగ్స్ ఇప్పటి తరం కూడా విపరీతంగా వింటారు. ఇక యువన్ శంకర్ పేరు వినగానే గుర్తొచ్చే సినిమాలు హ్యాపీ, పంజా, ఆడవాళ్ళ మాటలకు అర్థాలే వేరులే వగైరా. ఇప్పుడు ఇద్దరు కలిసి చైతుకి మ్యూజిక్ ఇవ్వడమంటే విశేషమేగా. ఇళయరాజా ప్రస్తుతం చేస్తున్న వాటిలో కృష్ణవంశీ రంగమార్తాండ ప్రధానంగా ఉంది.

సో చైతుకి ఇది ఎలాంటి బ్రేక్ ఇస్తుందో చూడాలి. ఈ ఏడాది ప్రారంభంలో బంగార్రాజుతో బోణీ కొట్టాక జూలై 8న థాంక్ యు రాబోతోంది. అమెజాన్ ప్రైమ్ భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్న దూత వెబ్ సిరీస్ నిర్మాణం దాదాపు పూర్తయినట్టే. ఇప్పుడీ వెంకట్ ప్రభు సినిమా రెగ్యులర్ షూటింగ్ ని వచ్చే నెల నుంచే ప్రారంభించబోతున్నారు. లాల్ సింగ్ చడ్డాలో అమీర్ ఖాన్ తో స్క్రీన్ షేర్ చేసుకున్న చైతుకి దాని ఫలితం ఆగస్ట్ లో తేలిపోతుంది. ఇవి కాకుండా పరశురామ్ తో ఓ సినిమా ఆల్రెడీ ఫైనల్ అయ్యింది. స్క్రిప్ట్ లాక్ చేయగానే షూట్ మొదలుపెడతారు. నాగ్ వారసుల్లో తమ్ముడైన అఖిల్ కంటే ఈ ఏడాది నాగ చైతన్య స్పీడే చాలా జోరుగా ఉంది.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి