iDreamPost

మ‌నిషి చీక‌టి కోర‌ల్లోకి ప్ర‌స్థానం – Nostalgia

మ‌నిషి చీక‌టి కోర‌ల్లోకి ప్ర‌స్థానం – Nostalgia

“ఒక్క‌సారి పురాణాలు దాటి వ‌చ్చి చూడు, అవ‌స‌రాల కోసం దారులు తొక్కే పాత్ర‌లే త‌ప్ప‌, హీరోలు, విల‌న్‌లు లేరీ నాట‌కంలో” ఈ వాక్యంతో ప్రారంభ‌మ‌య్యే సినిమా ప్ర‌స్థానం. 2010లో వ‌చ్చిన ప్ర‌స్థానం, రాజ‌కీయాల్లో ఉన్న కొత్త కోణం, మ‌నుషుల్ని న‌డిపించే అహాన్ని ఆవిష్క‌రించే ప్ర‌య‌త్నం చేసింది. అయితే కొన్ని రోటీన్ స‌న్నివేశాలు, పాట‌లు , మూడు గంట‌ల నిడివి సినిమా ఔచిత్యాన్ని దెబ్బ‌తీశాయి. అయినా ఇది డిఫ‌రెంట్ సినిమానే.

అమెరికాలో చ‌దువుకుని వ‌చ్చిన దేవ్‌ క‌ట్టా , సినిమాల మీద ఇష్టంతో “వెన్నెల” తీశాడు. త‌ర్వాత ప్ర‌స్థానం. ఇది క‌మ‌ర్షియ‌ల్‌గా హిట్ కాక‌పోయినా, బోలెడు అవార్డులు, ప్ర‌శంస‌లు వ‌చ్చాయి. త‌ర్వాత ఈ ద‌ర్శ‌కుడు ఆటోన‌గ‌ర్ సూర్య తీశాడు. దాన్ని ఎవ‌రూ గుర్తించ‌లేదు.

ప్ర‌స్థానంలో హీరో సాయికుమార్‌. క‌థ ఆయ‌న చుట్టూనే న‌డుస్తుంది. త‌న‌కి అడ్డుగా వ‌స్తాడ‌నే అనుమానంతో స్నేహితున్నే చంపేస్తాడు. ఆయ‌న భార్య‌ని పెళ్లి చేసుకుంటాడు. ఆమె పిల్ల‌ల‌కి తండ్రి అవుతాడు. ఆమెతో ఒక కొడుకుని కంటాడు.

అత‌ను చెడ్డ‌వాడు కాదు, ఎందుకంటే స్నేహితుడి కొడుకు (శ‌ర్వానంద్‌)ని విప‌రీతంగా ప్రేమిస్తాడు. మంచి వాడు కూడా కాదు, త‌న కొడుకు దుర్మార్గుడ‌ని తెలిసినా వాన్ని కాపాడ్డానికి ఎంత‌కైనా దిగజారుతాడు.

మ‌నిషిలోని చీక‌టి వెలుగుల్ని చూపించే సినిమాలు మ‌న‌కు బాగా త‌క్కువ‌. డైరెక్ట‌ర్లు అంత రిస్క్ తీసుకోరు. 1964లో వ‌చ్చిన గుడిగంట‌లు (NTR )లో అనుమానం, అసూయ‌, ద్వేషం ఒక మ‌నిషిని ఎంత‌గా ప‌త‌నం చేస్తాయో చూపిస్తారు. ఒక ర‌కంగా NTR దీంట్లో విల‌న్‌. నెగిటివ్ షేడ్స్ పాత్ర‌లంటే NTR కి ఇష్టం. అందుకే ఆయ‌న దుర్యోధ‌నుడు, రావ‌ణుడి పాత్ర‌లు వేసేవాడు.

ప్ర‌స్థానంలో రాజ‌కీయంగా ఎదిగిన సాయికుమార్‌, మొద‌టి కొడుకు శ‌ర్వానంద్‌. తండ్రికి అనుగుణంగా ఉంటాడు. ఒక ర‌కంగా అత‌నే వార‌సుడు. రెండో కొడుకు సందీప్‌కిష‌న్‌కి అన్న అంటే ద్వేషం. త‌న‌కి గుర్తింపు లేద‌ని అసూయ‌. డ్ర‌గ్ అడిక్ట్‌గా మారిపోయి అక్క‌ని, బావ‌ని కూడా చంపేస్తాడు.

జ‌బ‌ర్ద‌స్త్ ర‌ష్మీ అత‌ని ల‌వ‌ర్‌, మ‌త్తులో ఆమెని కూడా చంపేస్తాడు. సొంత కొడుకుని ర‌క్షించుకునే ప్ర‌య‌త్నంలో మారు కొడుకుని చంపేయ‌మ‌ని ఒక పోలీస్ అధికారికి చెబుతాడు సాయికుమార్‌.

చివ‌ర్లో పాప భారం మోయలేక ఆత్మ‌హ‌త్య చేసుకుంటాడు. ప‌దేళ్లైనా ఈ సినిమా ఇప్ప‌టికీ ప్రెష్‌గానే ఉంటుంది. You tubeలో పాటలు forward చేసుకొని చూడండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి