iDreamPost

వెండితెరపై మాయాబజార్ మాయాజాలం మరోసారి

వెండితెరపై మాయాబజార్ మాయాజాలం మరోసారి

ఎప్పుడో 1957లో వచ్చిన సినిమా గురించి ఇప్పటి తరం మాట్లాడుకుంటున్నారంటే దాని సృష్టికర్త కెవి రెడ్డి ప్రభావం ఆ స్థాయిలో ఉంది. స్క్రీన్ ప్లేకు తిరుగులేని గ్రామర్ బుక్ గా ఇప్పటికీ ఎందరో దర్శకులు దాని వెనుక ఉన్న రహస్యాలను చేధిస్తూనే ఉన్నారు. రచయితలు పుస్తకాలు రాస్తూనే ఉన్నారు. కథ మొత్తం పాండవులకు సంబంధించినదే అయినా అసలు వాళ్ళను చూపించకుండా కేవలం అభిమన్యుడు ఘటోత్ఘచుడులు కౌరవుల కన్నుగప్పి శశిరేఖను ఎలా తీసుకొచ్చారనే కథను ఆవిష్కరించిన వైనం ఎప్పటికీ మర్చిపోలేని ఒక అద్భుతం. ఇన్ని దశాబ్దాల తర్వాత కూడా ఎక్కడో ఒక చోట ఏదో ఒక మూల దీనికి సంబందించిన చర్చలు జరుగుతూనే ఉంటాయి

అంతగొప్ప వెండితెర మాయాజాలం మరోసారి థియేటర్లకు రాబోతోంది. మాయాబజార్ కలర్ వెర్షన్ ఈ నెల 9న మరోసారి విడుదల చేస్తున్నారు. పదమూడేళ్ల క్రితం గోల్డ్ స్టోన్ అనే సంస్థ విజయా వారి దగ్గర హక్కులను కొని వాళ్ళ క్లాసిక్స్ కి రంగులద్దే బాధ్యత తీసుకుంది. అంతే కాదు డీటీఎస్ సౌండ్ ఎక్స్ పీరియన్స్ కోసం మొత్తం ఆడియో ట్రాక్ ని రీ రికార్డింగ్ చేయించి మరీ బోలెడు ఖర్చుతో ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు. అప్పట్లో భారీ స్పందన దక్కింది. ఈ కలర్ ప్రింట్ ఎప్పుడూ శాటిలైట్ టెలికాస్ట్ జరుపుకోలేదు. ఆ టైంలోనే డివిడి, బ్లూ రే డిస్కుల రూపంలో తీసుకొచ్చారు తప్ప టీవీ హక్కులు ఇవ్వలేదు. యూట్యూబ్ లో అందుబాటులో ఉంది

రీ రిలీజుల ట్రెండ్ నడుస్తున్న ఇలాంటి సమయంలో మాయాబజార్ ని మరోసారి దర్శనం చేయించడం మంచి విషయమే. తెలుగు రాష్ట్రాలతో పాటు వరల్డ్ వైడ్ ప్లాన్ చేస్తున్నారు. తొమ్మిదో తేదీ చాలా సినిమాలు ఉన్నప్పటికీ ప్రత్యేకంగా హైప్ ఉన్నవి బజ్ ఉన్నవి ఏవీ లేవు. అందుకే మాయాబజార్ కి ఈ సమయాన్ని ఎంచుకున్నారు. ఎన్టీఆర్ ఏఎన్ఆర్ ఎస్విఆర్ సావిత్రి గుమ్మడి రమణారెడ్డి సూర్యకాంతం నాగభూషణం లాంటి ఎందరో ఉద్దండులు నటించిన ఈ ఎవర్ గ్రీన్ క్లాసిక్ ని సరికొత్త అనుభూతితో చూడటం కంటే కావాల్సింది ఏముంటుంది. భవిష్యత్తులో ఇదే తరహాలో మిస్సమ్మ, జగదేకవీరుని కథ, రాముడు భీముడు లాంటివి తెస్తే ఎంత బాగుంటుందో

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి