iDreamPost

రాజకీయాలలో సినిమా గ్లామర్ జీరో అయిపోయిందా?

వెండితెరపై ఒక్క వెలుగు వెలిగిన వాళ్లు తర్వాత రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చి తమ సత్తా చాటారు. అయితే ఇది అతి కొద్దిమందికి మాత్రమే సాధ్యమైంది. ఎన్టీఆర్, ఎంజీఆర్, జయలలిత లాంటి వాళ్లు ఏకంగా ముఖ్యమంత్రి హోదాలు కొనసాగారు. కానీ కొంతమంది హీరోలు కొత్తపార్టీ పెట్టి రాజకీయాల్లో రాణించలేకపోయారు.

వెండితెరపై ఒక్క వెలుగు వెలిగిన వాళ్లు తర్వాత రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చి తమ సత్తా చాటారు. అయితే ఇది అతి కొద్దిమందికి మాత్రమే సాధ్యమైంది. ఎన్టీఆర్, ఎంజీఆర్, జయలలిత లాంటి వాళ్లు ఏకంగా ముఖ్యమంత్రి హోదాలు కొనసాగారు. కానీ కొంతమంది హీరోలు కొత్తపార్టీ పెట్టి రాజకీయాల్లో రాణించలేకపోయారు.

రాజకీయాలలో సినిమా గ్లామర్ జీరో అయిపోయిందా?

సమాజంలో రెండే రంగాలకు తిరుగులేని గ్లామర్. ఒకటి రాజకీయాలు, మరొకటి సినిమా. సినిమా రంగం పబ్లిక్ మీద ఎదురులేని ప్రభావం చూపించి, సినిమా హీరోలు, హీరోయిన్లు, క్యారెక్టర్ ఆర్టిస్టులకు ప్రజల బ్రహ్మరథం ఎప్పుడైతే సిద్ధమైందో, వాళ్ళు కూడా రాజకీయాలలోకి అడుగుపెట్టడమనే ప్రక్రియ ప్రారంభమైంది. రాజకీయాలలో కూడా వారికి బ్రహ్మరథమే లభ్యం కావడం చారిత్రక సంచలనంగా చరిత్ర పేజీలపైన ఒత్తుగా నమోదైంది. ఒక ఎంజిఆర్, ఒక ఎన్టీఆర్ రాజకీయాలలో తమదైన సమాంతరం లేని నాయకత్వాన్ని ప్రదర్శించడంతో ఇంక సినిమా వాళ్ళకి రాజకీయాలలో వెనుకడుగు లేదన్న నమ్మకం రాజకీయపార్టీలలో కూడా తీవ్రంగా ప్రబలిపోయింది. దాంతో పార్టీ అధిష్టానాలే సినిమావాళ్ళను చంకలో వేసుకుని తిరగడానికి సిధ్ధపడిపోయి, వారికి కావాల్సిన తాయిలాలు కొన్ని సందర్భాలలో సమర్పించుకుని మరీ వాళ్ళని నెత్తిమీద పెట్టుకుని ఊరేగడం మొదలైంది.

లెక్కలేనంత మంది సినిమా రంగం ద్వారా, చిన్నాచితకా దగ్గర్నుంచి పెద్ద తలకాయల వరకూ కూడా అయితే అసెంబ్లీ లేదా పార్లమెంటు హౌస్ లలోకి జొరబడ్డారు. ప్రజావ్యవహారాలతో ఏమాత్రం ప్రత్యక్ష సంబంధాలు గానీ, క్రియాశీలక అనుబంధాలు గానీ కూడా లేకుండా పదవి అనంతరం పవర్ రెండింటినీ అమాంతం సొంతం చేసుకున్నవాళ్ళకి రాజకీయ రంగంలో ఏమాత్రమూ కొదవలేదు. కానీ ఇప్పుడు వరస మారుతోంది. రాజకీయాలు వేడి వాడిగా మారింది. ప్రజాక్షేత్రంలో కాకలు తీరిన, ప్రజా ప్రత్యక్ష కార్యకరమాలలో కొమ్ములు తిరిగినవారితో రాజకీయరంగం నిండిపోయి ఉంది. తెలుగు రాష్ట్రాలు రెండింటిలోనూ కూడా ఇదే పరిస్థితి. సినిమా గ్లామర్ను దాటి, మించి ప్రజలలో బలీయమైన ముద్రను వేసుకున్నవారి ప్రభావమే సినిమా వాళ్ళ కన్నా కూడా హెచ్చుగా ఉందన్న వ్యవస్థ తెరమీదకి వచ్చింది. అందుకు మెగాస్టార్ చిరంజీవిని మించిన పెద్ద ఉదాహరణ మరొకటిలేదు. వైయస్ రాజశేఖర్ రెడ్డి, చంద్రబాబు నాయుడు ఢీ అంటే ఢీ అని తలపడుతున్న 2009 ఎన్నికలలో తగుదునమ్మా అంటూ వచ్చిన మెగాస్టారి ఏమంత రికార్డు నెలకొల్పలేకపోయారు. ఐదేళ్ళ సుపరిపాలన ఫలితంగా చంద్రబాబు నాయుడుని సైతం మట్టి కరిపించి వైయస్ రాజశేఖర్ రెడ్డి రికార్డ్ విన్ ని సొంతం చేసుకున్న చరిత్ర ఇంకా మన కళ్ళ ముందు పచ్చిగానే ఉంది. ఇటీవలి ఎన్నికలలో జగన్ మోహన్ రెడ్డితో తలపడిని పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తన సీటును కూడా గెలిపించుకోలేని దుర్భర పరిస్థితిలో జగన్ ముందు మోకరిల్లాల్సి వచ్చిన సందర్భాన్ని చూశాం.

ఏదో శ్రీశ్రీ అన్నట్టుగా వచ్చే ఎన్నికలలో రౌడీలకు ఓటుండదు అని మరో మూడు యాభైలు పుస్తకంలో రాశారు. ఇప్పడు ఆ మాట మార్చి, వచ్చే ఎన్నికలలో సినిమా వాళ్ళకి సీటుండదు అని సవరించాలేమోననిపిస్తోంది ప్రస్తుత పరిణామాలు చూస్తుంటే. ఇటీవలే గోడదూకి బెజెపిలోకి గెంతిన సహజనటి జయసుథకి హై కమాండ్ నుంచి ఏ కబురు లేదు. అసలు పోటీ చేసే అవకాశం ఉందా లేక ఉత్తుత్తి జాయినింగేనా అన్నది తేలలేదు. జయసుథ ఈ కారణంగా మీడియాతో మాట్లడడానికి కూడా వణుకుతున్నారు. ఏం మాట్లాడితే ఏం కొంప ములుగుతుందోనన్న భయంలో ఆమె ఉండడం ఒకింత విచిత్రంగానే ఉంద. ప్రతీదానికి నేనున్నానంటూ సిద్ధమైపోయే జీవితరాజశేఖర్ కూడా తమకి సీటు రాకపోతుందా అనే ఎండమావి ఆశతో క్షణాలను గడుపుతున్నారు.

తెలంగాణలో సంచలన కథానాయకిగా, రాజకీయనాయకురాలిగా కూడా రికార్డు క్రియేట్ చేసిన రాములమ్మ విజయశాంతి కూడా మీనమేషాలు లెక్కపెట్టుకునే పరిస్థితిలోనే కొట్టుమిట్టాడుతుండడం మరో విలక్షణ వైచిత్రి. ఏ పార్టీ కూడా సినిమా వాళ్ళని భుజాలమీదకి ఎక్కించుకుని ఊరేగడానికి సిద్ధంగా లేరన్నది తేటతెల్లమవుతున్న నిజం. దానాదీనా సినిమా వాళ్ళ గ్లామర్ కూడా ప్రజాక్షేత్రంలో అడుగంటి పోయిందన్నది అక్షరాల రూఢీ అవుతోంది. కేవలం మునపటి రోజుల్లాగా ప్రజా సంక్షేమమే పరమావధిగా పోరాడుతున్న, ప్రజాశ్రేయస్సే ముఖ్య ఉద్దేశ్యంగా ఉపక్రమిస్తున్న వారికి తప్పితే రంగులేసుకుని, స్పెషల్ ఎఫెక్టులతో చెలరేగిపోదామనుకునే సినిమా వాళ్ళకి రాజకీయ పార్టీలు విస్తరి వేసే ఉద్దేశ్యాన్ని ఏ కోశాన్నా వ్యక్తం చేయకపోవడం ఈనాటి తాజా పరిణామం.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి