iDreamPost

పీవీజి…నమష్కార్ ….!!ఆప్ కైసే హో…!!! – సీనియర్ నేతకు ప్రధాని ఫోన్

పీవీజి…నమష్కార్ ….!!ఆప్ కైసే హో…!!! – సీనియర్ నేతకు ప్రధాని ఫోన్

ఆయన అంతే మనసులో ఏం అనుకుంటే అది చేస్తారు. హఠాత్తుగా సీనియర్ నేత మురళి మనోహర్ జోషి ఇంటికి వెళ్లి పాదాభివందనం చేస్తారు. అద్వానీ ఆశీర్వాదం తీసుకుంటారు. పార్టీ సీనియర్లను ఒక్కోసారి సడన్ గా గుర్తు చేసుకొని వారితో మాటా మంతీ కలిపి వారిని ఆశ్చర్యంలో ముంచెత్తుతారు. జనాలకు గుర్తులేని పాతతరం వాళ్ళను ఆయనే గుర్తు చేసారు. పాత జ్ఞాపకాలను నెమరువేసుకుంటారు. ఆయన మరెవరో కాదు మన ప్రధాని నరేంద్ర మోదీ. అవును ఈ కరోనా కష్టకాలంలో సీనియర్ నాయకులతో మాట్లాడడం, వారి మంచిచెడ్డలు కనుక్కోవడం వారి నుంచి సలహాలు తీసుకోవడం మోడీ కి ఇప్పుడు అలవాటుగా మారింది. మాజీ ప్రధానులు, మాజీ రాష్ట్రపతులతో బాటు సీనియర్ నేతలు కూడా ఆయన పలకరించారు.

ఇదే క్రమంలో మోడీ మొన్న విశాఖకు చెందిన సీనియర్ నాయకుడు పివి చలపతి రావుకు ఫోన్ చేసి కాసేపు మాట్లాడారు. మాజీ సీఎం లు, మాజీ ప్రధానులు, రాష్ట్రపతులకు ఫోన్ చేశారంటే అర్థం ఉంది కానీ ఈ పీవీ చలపతిరావు ఎవరు. ఈయనకు ఎందుకు ఫోన్ చేసారన్నది ఈతరపు జనానికి పెద్దగా తెలీదు. సరిగా చెప్పాలంటే పీవీ చలపతిరావు విశాఖకు చెందిన బిజెపి నేత.

ఆ రోజుల్లో బీజేపీ అంటే జాతీయ స్థాయిలో అటల్ బిహారీ వాజ్ పేయ్, లాల్ క్రిష్ణ అద్వానీ. ఇక జనసంఘ్ నుంచి బీజేపీగా రూపాంతరం చెందినపుడు అఖిల భారత స్థాయిలో వాజ్ పేయి బీజేపీకి తొలి అధ్యక్షుడు అయితే ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ కు పీవీ చలపతిరావు రాష్ట్ర అధ్యక్షుడు గా ఉన్నారు. అయితే ఆ తరానికి చెందిన నాయకులెవరు ఇప్పుడు దాదాపు కనుమరుగైపోయారు. జోషి, అద్వానీ వంటివారు వార్థక్యంతో తెరమరుగయ్యారు.

ఈ నేపధ్యంలో ఎనభై అయిదేళ్ళ పీవీ చలపతిరావుకు ఒక ఫోన్ వచ్చింది. అవతల గొంతు నేను ప్రధాని మోడీని అంటూ పలకరించింది. అంతే పెద్దాయన ఒక్కసారిగా షాక్ తిన్నారు. బాగున్నారా పీవీ గారు, ఆరొగ్యం ఎలా ఉంది అంటూ కాసేపు మోడీ కుశల ప్రశ్నలు అడిగారు. ఇది బీజేపీలోనూ, పీవీ కుటుంబంలోనూ ఊహించని ఘటన.

మోడీ కరోనా విపత్తు వేళ దేశాన్ని ఓ వైపు మోనిటరింగ్ చేస్తూ పార్టీలో పెద్దల ఆరోగ్యం పట్ల కూడా శ్రధ్ధ చూపడం గొప్ప విషయమని అంటున్నారు. విశాఖ నుంచి లోక్ సభకు రెండుసార్లు పీవీ చలపతిరావు పోటీ చేసినా విజయం దక్కలేదు. ఏనాడు పార్టీ కట్టు తప్పని, విలువల కట్టుబాట్లు దాటని పెద్ద మనిషిగా పీవీని విశాఖ వాసులు గౌరవిస్తారు. ఈ తరం ప్రజలు మర్చిపోయిన చలపతిరావును ప్రధాని గుర్తుపెట్టుకొని ఫోన్ చేసి పలకరించడం చాలా గొప్ప విషయం అని పార్టీ కార్యకర్తలు చెప్పుకుంటున్నారు.

గత ఎన్నికల వేళ ఢిల్లీ నుంచి మోడీ విశాఖ బీజేపీ నేతలతో వీడియో సమావేశంలో మాట్లాడినపుడు కూడా ప్రత్యేకంగా పీవీని పలకరించారు. చలపతిరావు కుమారుడు ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ శాసనమండలిలో సభ్యునిగా ఉన్నారు. ఉత్తరాంధ్ర పట్టభద్రుల నియోజకవర్గం నుంచి ఆయన విజయం సాధించారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి