iDreamPost

ఈ పనేదో అప్పుడు చేసుంటే గెలిచేవాడివి కదా పవన్‌..!

ఈ పనేదో అప్పుడు చేసుంటే గెలిచేవాడివి కదా పవన్‌..!

జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్‌ ప్రతిపక్ష నేత పాత్ర పోషించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. తెలిసో, తెలియకో లేదా.. షూటింగ్‌లు లేక ఖాళీగా ఉన్నాడనో ఈ రోజు భవన నిర్మాణ కార్మికులతో టెలి కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. రాష్ట్ర వ్యాప్తంగా 150 మందితో ఈ కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా పవన్‌ కళ్యాణ్‌ భవన నిర్మాణ ఇసుక కొరత సమస్య ఎదుర్కొంటోందన్నారు. ఇసుక సరఫరాను సులభతరం చేయాలని డిమాండ్‌ చేశారు. ఇసుక విధానంలో గత ప్రభుత్వం చేసిన తప్పదమే ఈ ప్రభుత్వం కూడా చేస్తోందని విమర్శించారు.

గత ప్రభుత్వం ఎలాంటి ఇసుక విధానం అవలంభించింది.. ఈ ప్రభుత్వం ఎలాంటి ఇసుక విధానం తెచ్చిందీ.. పవన్‌ కళ్యాణ్‌కు అవగాహన ఉందా..? లేదా..? అనే విషయం పక్కనపెడితే పవన్‌ కళ్యాణ్‌ సమస్య ఉందంటూ ఆయా వర్గ కార్మికులతో మాట్లాడే ప్రయత్నం చేశారు. అసలు సమస్య ఉందా..? లేదా..? అనేది ఇక్కడ విశేషం కాదు. పవన్‌ కళ్యాణ్‌ ప్రజా సమస్యలపై స్పందిస్తున్నారనేదే వార్త.

అడపా దడపా ఇప్పుడు వ్యవహరిస్తున్నట్లుగానే గత ప్రభుత్వ హాయంలో పని చేసి ఉంటే.. పవన్‌ కళ్యాణ్‌ జనసేన పార్టీ, ఆయన రాజకీయ భవిష్యత్‌ ఇప్పటి కన్నా భిన్నంగా ఉండేదనడంలో ఎలాంటి సందేహం లేదు. 2014 ఎన్నికలకు ముందు పార్టీ పెట్టిన పవన్‌.. సరైన సమయం, క్షేత్రస్థాయిలో పార్టీ నిర్మాణం జరగలేదంటూ అప్పటి బీజేపీ, టీడీపీ కూటమికి మద్ధతు ఇచ్చారు. బీజేపీ, టీడీపీ హామీలకు నాది పూచి అన్నారు. హామీలు అమలు చేయకపోయినా,.. ప్రజలకు నష్టం జరిగినా ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తానని గొప్పగా చెప్పారు.

నిజంగా పవన్‌ కళ్యాణ్‌ తాను చెప్పినట్లు.. హామీలు అమలు చేయని బీజేపీ, టీడీపీ ప్రభుత్వాలను, ప్రజా వ్యతిరేక నిర్ణయాలపై ప్రశ్నించి ఉంటే ఈ రోజు పవన్‌ కళ్యాణ్‌ శాసన సభలో సభ్యుడుగా ఉండేవారని ఆయన అభిమానులే వ్యాఖ్యానిస్తున్నారు. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం, విశాఖ జిల్లా గాజువాకల్లో పోటీ చేసిన పవన్‌ కళ్యాణ్‌ను.. ప్రజలు కనీసం ఒక్కచోటైనా గెలిపించేవారు.

ఆయన అన్న చిరంజీవి మాదిరిగా పవన్‌ కళ్యాణ్‌ ఒక చోట ఓడిపోయినా.. మరోచోట గెలిచేవారు. ఆ పార్టీకి చెప్పుకోదగ్గ సీట్లు అయినా వచ్చేవి. పుండు మీద కారం చల్లినట్లుగా పార్టీ అధ్యక్షుడు ఓడినా.. రాజోలు అభ్యర్థి రాపాక వరప్రసాద్‌ గెలిచినట్లుగా ఉండేది కాదు. ఏది ఏమైనా పోయిన కాలం తిరిగి రాదు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి