iDreamPost

పొలిటిక‌ల్ గెస్ట్ రోల్ లో ప‌వ‌ర్ స్టార్..! జ‌నసేన‌కు గ‌డ్డుస్థితి త‌ప్ప‌దా?

పొలిటిక‌ల్ గెస్ట్ రోల్ లో ప‌వ‌ర్ స్టార్..! జ‌నసేన‌కు గ‌డ్డుస్థితి త‌ప్ప‌దా?

రాజ‌కీయాల్లో రాణించాల‌నే త‌ప‌న ఉంటే స‌రిపోదు..దానికి త‌గ్గ‌ట్టుగా కార్యాచ‌ర‌ణ ఉండాలి. అందులోనూ ప్ర‌జ‌ల‌కు చేరువ‌గా ఉన్న‌ట్టు క‌నిపించాలి. ముఖ్య‌మంత్రి జ‌గ‌న్ అనుభ‌వం గ‌మ‌నిస్తే తండ్రి ఛ‌రిష్మా ఉన్న‌ప్ప‌టికీ నాయ‌కుడిగా అనునిత్యం ప్ర‌జ‌ల మ‌ధ్య ఉండ‌డ‌మే జ‌గ‌న్ కి వ‌రంగా మారింది. ఆయ‌న ఆశించిన సీఎం సీటు వ‌రించింది. కానీ రాజ‌కీయాల్లో మార్పు తీసుకొస్తానంటూ ముందుకొచ్చిన ప‌వ‌న్ క‌ళ్యాణ్ ప‌రిస్థితి మాత్రం ఎవ‌రికీ అర్థం కాన‌ట్టుగా మారుతోంది. సినిమాల్లో గెస్ట్ రోల్ మాదిరిగా రాజ‌కీయాల్లో అప్పుడ‌ప్పుడూ వ‌చ్చి పోయే ప‌ద్ధ‌తిని ఆయ‌న వీడ‌డం లేదు. దాంతో జ‌న‌సేన భ‌విత‌వ్యం మీద ఆశ‌లు పెట్టుకున్న వారు కూడా నీరుగారిపోవాల్సిన దుస్థితి దాపురిస్తోంది.

ప‌వ‌న్ క‌ళ్యాణ్ కి ప‌దేళ్ల రాజ‌కీయ అనుభ‌వం ఉంది. 2009 లోనే రాజ‌కీయాల్లోకి వ‌చ్చినప్ప‌టికీ ఆ త‌ర్వాత ప్ర‌జారాజ్యం ఓట‌మి, కాంగ్రెస్ లో విలీనం త‌ర్వాత ఈ యువ‌రాజ్యం అధినేత ప్ర‌జాజీవితానికి దూర‌మ‌య్యాడు. మ‌ళ్లీ హ‌ఠాత్తుగా 2014 ఎన్నిక‌లకు ముందు సొంత పార్టీతో తెర‌మీద‌కు వ‌చ్చాడు. అయిన‌ప్ప‌టికీ పోటీ చేయ‌కుండా ప్ర‌చారం మాత్రం నిర్వ‌హించి చంద్ర‌బాబు హామీల‌కు త‌న‌ది హామీ అంటూ భ‌రోసా క‌ల్పించాడు. బీజేపీ, టీడీపీ కూట‌మి విజ‌యానికి తోడ్ప‌డిన ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఆ త‌ర్వాత కూడా రాజ‌కీయాల్లో క్రియాశీల‌కంగా వ్య‌వ‌హ‌రించ‌లేక‌పోయారు.

రాజ‌కీయ ప‌రిణ‌తి ప్ర‌ద‌ర్శించ‌లేని జ‌న‌సేన‌

సినిమాలు, రాజ‌కీయాలు రెండు ప‌డ‌వ‌ల మీద కాళ్లు వేసి కొంత కాలం సాగిన‌ప్ప‌టికీ 2019 ఎన్నిక‌ల‌కు ముందు సినిమాల‌కు దూర‌మ‌వుతున్న‌ట్టు ప్ర‌క‌టించారు. దాంతో ఎట్టకేల‌కు ఫుల్ టైమ్ పొలిటీషియ‌న్ అవుతున్న‌ట్టు చాలామంది అంచ‌నా వేశారు. ఎన్నిక‌ల్లో కూడా సొంతంగా పోటీ చేయ‌డం, మంగ‌ళ‌గిరి, విజ‌య‌వాడ‌ల్లో లింగ‌మ‌నేని ఎస్టేట్స్ ద్వారా వ‌చ్చిన భ‌వ‌నాల్లో కార్యాల‌యాలు ప్రారంభించ‌డంతో రాజ‌కీయంగా జ‌న‌సేనాని జోరు పెంచే అవ‌కాశాలున్న‌ట్టు భావించారు. కానీ తీరా ఎన్నిక‌ల్లో ఆపార్టీ ఆశ‌ల‌న్నీ అడియాశ‌ల‌య్యాయి. ఆఖ‌రికి అధినేత కూడా గ‌ట్టెక్క‌క‌పోవ‌డంతో ఆశ‌ల‌న్నీ నీరుగారిపోయాయి. దాంతో ఆ ఫ‌లితాల నుంచి గుణ‌పాఠం నేర్చుకుని జ‌నాభిప్రాయాల‌కు అనుగుణంగా వ్య‌వ‌హ‌రిస్తార‌ని ఆయ‌న అభిమానులు ఆశించారు.

జ‌న‌సేన‌లో సందిగ్ధానికి తెర‌ప‌డేనా

తీరా చూస్తే గ‌డిచినె ఏడెనిమిది నెల‌లుగా ప‌వ‌న్ ప‌రిస్థితి పూర్తి అయోమ‌యంగా క‌నిపిస్తోంది. ఎన్నిక‌ల‌కు ముందు వామ‌ప‌క్షాలు, బీఎస్సీతో క‌లిసి పోటీకి దిగిన ప‌వ‌న్ ఇప్పుడు దాదాపుగా వారికి దూర‌మ‌య్యారు. అదే స‌మ‌యంలో టీడీపీతో స‌ఖ్య‌త‌గా ఉన్న‌ట్టు మాట్లాడ‌డం, ఆపార్టీ నేత‌ల‌తో క‌లిసి వేదిక పంచుకోవ‌డం ద్వారా మ‌ళ్లీ చంద్ర‌బాబుకి చేరువ‌వుతున్న‌ట్టు క‌నిపిస్తోంది. అదే స‌మ‌యంలో బీజేపీకి ప్ర‌త్యేక హోదా విష‌యంలో విమ‌ర్శించానే త‌ప్ప ఎన్న‌డూ దూరం కాలేద‌ని చెప్ప‌డం ద్వారా క‌మ‌లం క్యాంపుకి కూడా ఆయ‌న ట‌చ్ లో ఉన్న‌ట్టు స్ప‌ష్టం అయ్యింది.

ఏపార్టీతో ఆయ‌న ఎలా వ్య‌వ‌హ‌రిస్తార‌న్న‌ది ప‌క్క‌న పెడితే ప్ర‌జ‌ల స‌మ‌స్య‌లు, వారి ఆందోళ‌న‌లో తోడుగా ఉండాల్సిన ప‌వ‌న్ క‌ళ్యాణ్ అతిథి పాత్ర‌కే ప‌రిమితం కావ‌డం జ‌న‌సేన నేత‌ల‌ను కూడా అస‌హ‌నానికి గురిచేస్తోంది తాజాగా అమ‌రావ‌తి ఉద్య‌మంలో ఆయ‌న ఒక‌రోజు క‌నిపించి మాయం అయిపోయారు. క్రిస్మ‌స్ వేడుక‌ల కోసం అత్తారింటికి వెళ్లి వ‌చ్చిన ప‌వ‌న్ హ‌ఠాత్తుగా అమ‌రావ‌తిలో హ‌డావిడి చేసి మ‌ళ్లీ అంత‌లోనే క‌నిపించ‌క‌పోవ‌డంతో ఆపార్టీకి ప్ర‌జ‌లు చేర‌వ‌య్యే అవ‌కాశాలు చేజారిపోతున్న‌ట్టు క‌నిపిస్తోంది. అదే స‌మ‌యంలో తాజాగా బీజేపీకి చెందిన మైసూర్ ఎంపీ ప్ర‌తాప్ సిన్హా, బెంగ‌ళూరు సౌత్ ఎంపీ తేజ‌స్వీ సూర్య‌తో స‌మావేశ‌మ‌య్యారు. దానికి సంబంధించిన ఫోటోల‌ను మైసూర్ ఎంపీ ట్విట్ట‌ర్ లో పోస్ట్ చేయ‌డంతో ఈ వ్య‌వ‌హారం బ‌య‌ట‌ప‌డింది.

బీజేపీ అధిష్టానం మొఖం చాటేస్తే..ఎంపీల‌తో ప‌వ‌న్ రాయ‌బారం

గ‌తంలో మోడీ, అమిత్ షా ల‌ను క‌లిస్తాన‌ని ఢిల్లీ వెళ్లిన ప‌వ‌న్ క‌ళ్యాణ్ కి అక్క‌డ వారు అవ‌కాశం ఇవ్వ‌లేదు. దాంతో రెండు రోజులు వెయిట్ చేసి వెనుదిర‌గాల్సి వ‌చ్చింది. అయినా బీజేపీ నేత‌ల‌కు ద‌గ్గ‌ర‌య్యే ప్ర‌య‌త్నాల‌ను మాత్రం ప‌వ‌న్ విడిచిపెట్ట‌లేద‌ని ఈ ప‌రిణామం చాటుతోంది. వాస్త‌వానికి ఓ రాజ‌కీయ పార్టీ అధ్య‌క్షుడిగా ఆయ‌న స‌మావేశం వివ‌రాలు జ‌న‌సేన అధికారికంగా విడుద‌ల చేయ‌డం హూందాత‌నం అనిపించుకుంటుంది. కానీ ఆ పార్టీ అధినేత స‌మావేశ వివ‌రాలు ఆయ‌నతో భేటీ అయిన వారు పోస్ట్ చేసిన తీరు విస్మ‌య‌క‌రంగా క‌నిపిస్తోంది. జ‌న‌సేన పూర్తిగా రాజ‌కీయ రూపం దాల్చ‌లేద‌ని, సినీ సెలబ్రిటీ త‌ర‌హాలోనే ప‌వ‌న్ మిగిలిపోయార‌న‌డానికి సంకేతంగా ఉంద‌ని భావించాల్సి వ‌స్తోంది. పైగా నాదెండ్ల మ‌నోహ‌ర్ కూడ ప‌వ‌న్ వెంట ఉండ‌డంతో పూర్తిగా రాజ‌కీయ స‌మావేశంగా స్పష్టమవుతుంది . 

అమ‌రావ‌తిలో వ‌న్డే షో, కీల‌క అంశాల్లో దాట‌వేత ధోర‌ణి

అమ‌రావ‌తిలో వ‌న్ డే షో చేసిన ప‌వ‌న్ ఆ త‌ర్వాత పెద‌వి విప్ప‌క‌పోవ‌డం చాలామందిని నిరాశ‌ప‌రుస్తోంది. అదే స‌మ‌యంలో ఎన్ ఆర్ సీ వంటి జాతీయ స్థాయిలో ప్ర‌కంప‌న‌లు పుట్టిస్తున్న అంశంలో కూడా జ‌న‌సేన గానీ, ప‌వ‌న్ క‌ళ్యాణ్ గానీ త‌మ వైఖ‌రిని వెల్ల‌డించ‌లేక‌పోవ‌డం విశేషం. ఇప్ప‌టికే ఏపీలో రెండు ప్ర‌ధాన పార్టీలు ఎన్నార్సీకి వ్య‌తిరేకం అంటూ చెప్పాయి. అయినా జ‌న‌సేన త‌న వెంట న‌డుస్తున్న మైనార్టీల విన‌తిని కూడా ప‌ట్టించుకుంటున్న‌ట్టు క‌నిపిచండం లేదు.

ఇక తాజాగా JNU లో విద్యార్థుల‌పై పాశ‌విక దాడిని చివ‌ర‌కు ఆరోప‌ణ‌లు ఎద‌ర్కొంటున్న బీజేపీ కూడా ఖండించింది. ఆర్ఎస్ఎస్, ఏబీవీపీ శ్రేణులే ఈ దాడుల‌కు పాల్ప‌డిన‌ట్టు ఆధారాల‌తో బ‌య‌ట‌పెడుతున్న వేళ బీజేపీ దానిని ఖండించ‌డం గ‌మ‌నార్హం. అలాంటి విష‌యంలో జ‌న‌సేన యువ‌త పాతికేళ్ల భ‌విష్య‌త్ గురించి పోరాడ‌తాన‌ని చెబుతూ ఇప్పుడు పోరాడుతున్న యువ‌త‌ను విస్మ‌రించ‌డం విచిత్రంగా క‌నిపిస్తోంది.

ఈ ప‌రిణామాల‌తో ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఫుల్ టైమ్ పొలిటీషియ‌న్ కాలేక‌పోతున్నార‌నే అభిప్రాయం బ‌ల‌ప‌రుస్తోంది. జ‌న‌సేన పుంజుకునే అవ‌కాశాలు చేజార్చుకుంటున్న‌ట్టు క‌నిపిస్తోంది. రాజ‌కీయంగా ఆపార్టీ భ‌విత‌వ్యం మెరుగుప‌డే అవ‌కాశాలు క‌నిపించ‌డం లేద‌నే అంచ‌నాలు వినిపిస్తున్నాయి. మొత్తంగా సినీ ప‌వ‌ర్ స్టార్ పొలిటిక‌ల్ ప‌వ‌ర్ లెస్ స్టార్ గా మిగిలిపోయే దుస్థితిని కొనితెచ్చుకుంటున్న‌ట్టు భావించాల్సి వ‌స్తోంది.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి