iDreamPost

పార్లమెంట్‌ను తాకిన రైతు ఉద్యమం

పార్లమెంట్‌ను తాకిన రైతు ఉద్యమం

దేశ రాజధాని ఢిల్లీ వణికిపోతోంది. ఈ సారి శీతాకాలంలో చలికి ఢిల్లీ ప్రజలతోపాటు అన్నదాతల ఉద్యమానికి రాజకీయ నాయకులు కూడా వణకాల్సిన పరిస్థితి నెలకొంది. వ్యవసాయ రంగంలో కొత్తగా తెచ్చిన మూడు చట్టాలను రద్దు చేయాలని కోరుతూ అన్నదాలు ఎముకలు కొరికే చలిని సైతం లెక్క చేయడకుండా గత 20 రోజులుగా ఢిల్లీ సహరిద్దుల్లో నిరసన వ్యక్తం చేస్తున్నారు. అక్కడే టెంట్లు వేసుకుని ఉంటున్నారు. కొత్త చట్టాలను రద్దు చేసే వరకూ ఉద్యమం ఆపేది లేదని భీష్మించుకూర్చున్నారు. కేంద్ర ప్రభుత్వంతో పలు దఫాలుగా జరిగిన చర్చల్లో చట్టాల రద్దు తప్పా.. మరే సవరణలకు తాము ఒప్పుకోబోమని రైతులు స్పష్టం చేయడంతో కేంద్ర ప్రభుత్వం ఉక్కిరిబిక్కిరి అవుతోంది. ఢిల్లీకి వెళ్లే రహదారులు స్తంభించిపోయాయి.

తాజాగా రైతు ఉద్యమ ప్రభావం దేశ అత్యున్నత ప్రజా ప్రతినిధుల సభపై కూడా పడింది. పార్లమెంట్‌ శీతాకాల సమావేశాలను రద్దు చేస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. కొత్త చట్టాలను రద్దు చేయాలని రైతులు ఉద్యమం చేస్తున్న తరుణంలో ఆ చట్టాలపై చర్చించేందుకు పార్లమెంట్‌ను సమావేశపరచాలని కాంగ్రెస్‌ పార్టీ లోక్‌షభా పక్ష నేత అధీర్‌రంజన్‌ ఛౌదరి పార్లమెంట్‌ వ్యవహారాల శాఖ మంత్రికి లేఖ రాయడంతో సమావేశల రద్దు విషయం వెలుగులోకి వచ్చింది. అధీర్‌ లేఖకు మంత్రి ప్రహ్లాద్‌ జోషి సమాధానం ఇస్తూ… కరోనా నేపథ్యంలో ఈ సారి శీతాకాల పార్లమెంట్‌ సమావేశాలు నిర్వహించబోవడం లేదని పేర్కొన్నారు. ఒకే సారి బడ్జెట్‌ సమావేశాలు నిర్వహిస్తామని ఆ లేఖలో పేర్కొనడం విశేషం.

రైతులు ఉద్యమం నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్‌ శీతాకాల సమావేశాలను రద్దు చేసినట్లు పరిశీలకులు పేర్కొంటున్నారు. కరోనా వైరస్‌ను ఇందుకు సాకుగా చూపుతున్నారనే విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. ఈ ఏడాది సెప్టెంబర్‌లో కరోనా వైరస్‌ ఉధృతంగా ఉన్న సమయంలోనే పార్లమెంట్‌ వర్షాకాల సమావేశాలు నిర్వహించారని, అలాంటిది ప్రస్తుతం కరోనా వైరస్‌ వ్యాప్తి తగ్గుముఖం పట్టిన సమయంలో ఉద్దేశపూర్వకంగానే సమావేశాలను రద్దు చేసారని విశ్లేషిస్తున్నారు. రైతు ఉద్యమం కొనసాగుతున్న తరుణంలో సమావేశాలు నిర్వహిస్తే.. ఈ అంశంపై తప్పని పరిస్థితుల్లో చర్చించాల్సి వస్తుందనే సమావేశాలు రద్దు చేసినట్లు విమర్శిస్తున్నారు.

రైతుల ఉద్యమానికి ఎన్‌డీయేతర రాజకీయ పార్టీలు మద్ధతు తెలిపాయి. దేశం యావత్తూ రైతులకు అండగా నిలబడింది. ఇతర దేశాల నుంచి మద్ధతు లభించింది. ఇటీవల జరిగిన భారత్‌ బంద్‌ విజయవంతమైంది. అన్ని వైపుల నుంచి రైతులకు మద్ధతు లభిస్తుండడంతో కేంద్ర ప్రభుత్వం తీవ్ర ఒత్తిడిలో ఉన్నట్లు పార్లమెంట్‌ సమావేశాలను రద్దు చేయడం ద్వారా అర్థమవుతోంది.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి