iDreamPost

పరిశ్రమను కుదిపేస్తున్న ఓటిటి మంటలు

పరిశ్రమను కుదిపేస్తున్న ఓటిటి మంటలు

గత నాలుగైదు రోజులుగా జరుగుతున్న పరిణామాలు సినిమా ఇండస్ట్రీలో తీవ్రమైన సెగలు రేపుతున్నాయి. కొందరు బాలీవుడ్ మరియు సౌత్ నిర్మాతలు డైరెక్ట్ ఓటిటి రిలీజ్ కు ఓటు వేయడం ఆ మేరకు సదరు సంస్థల నుంచి అధికారిక ప్రకటనలు రావడం ఎగ్జిబిటర్లకు ముఖ్యంగా మల్టీప్లెక్సు చైన్లకు ఏ మాత్రం మింగుడుపడటం లేదు. ఇప్పటికే ఐనాక్స్, పివిఆర్, కార్నివాల్ లు అధికారిక ప్రకటనలు ప్రెస్ నోట్ రూపంలో విడుదల చేశారు. అందులో ఒకరకమైన బెదిరింపు ధోరణి కనిపించడంతో ప్రొడ్యూసర్ గిల్డ్ సైతం స్పందించి ఘాటుగానే సమాధానం ఇచ్చింది. చాలా అసంబద్ధంగా కార్పొరేట్ సంస్థలు ఇచ్చిన వార్నింగ్ లాంటి లెటర్ కు స్పష్టమైన వివరణ ఇచ్చింది.

అంతిమంగా ఏ సినిమా అయినా థియేటర్లో విడుదల చేసేందుకే ప్రాధాన్యం ఇస్తామని కానీ కోట్లలో పెట్టుబడులు పెట్టిన నిర్మాతలు తమకు తీవ్రమైన నష్టం కలుగుతుందనుకున్నప్పుడు ఎలాంటి నిర్ణయమైనా తీసుకోవచ్చని చెప్పిన సంగతి తెలిసిందే. ఇది చిలికి చిలికి గాలి వానగా మారే అవకాశం లేకపోలేదని విశ్లేషకులు అభిప్రాయ పడుతున్నారు. ఇప్పటికే రెండు నెలలుగా సినిమా హాళ్లు, మాల్స్ మూతబడ్డాయి. ఎప్పుడు తెరుచుకుంటాయో ఎవరికీ తెలియదు. ఒకవేళ ఓపెన్ చేసినా జనం వస్తారన్న గ్యారెంటీ లేదు. ఇలాంటి విపత్కర పరిస్థితిలో ఇలా చీలిక రావడం మంచిది కాదని సీనియర్లు చెబుతున్న మాట. భవిష్యత్తులో ఫలానా సినిమా మా చైన్ లో విడుదల కానివ్వబోమని చెప్పడం కూర్చున్న కొమ్మను నరుక్కోవడం లాంటిదేనని అంటున్నారు.

నిజంగా అలాంటి పరిస్థితే తలెత్తితే అప్పుడు నిర్మాతలంతా ఏకతాటిపైకి వచ్చి మేమే మీకు సినిమాలు ఇవ్వమని తీర్మానిస్తే అప్పుడు ఇంకా దారుణమైన పరిణామాలు ఎదురుకోవాల్సి వస్తుందని హెచ్చరిస్తున్నారు. ఇది పరస్పర సహకారంతో కొనసాగాల్సిన రంగమని అంతే తప్ప తాము లేకపోతే అవతలి వాళ్ళకు మనుగడ లేదన్న తరహాలో ఆలోచిస్తే అందరూ నష్టపోవడం ఖాయమని రాబోయే రోజులని ఊహిస్తున్నారు. ఇందులో నిజం లేకపోలేదు. ప్రభుత్వం ఎలాంటి నిబంధనలు తీసుకొస్తుందో తెలియదు. పబ్లిక్ భయం లేకుండా థియేటర్లకు వస్తారో లేదో వెంటనే చెప్పలేని పరిస్థితి. ఇంకో రెండు నెలలు ఈ స్తబ్దత ఇలా కొనసాగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఈ నేపథ్యంలో కొందరు నిర్మాతలు డిజిటల్ వైపు చూడటం తప్పు కాదు నేరం అంతకన్నా కాదు. ఇదంతా తాత్కాలికమే.ఈ సత్యాన్ని కనక గుర్తిస్తే ఎలాంటి విభేదాలకు ఆస్కారమే ఉండదు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి