iDreamPost
android-app
ios-app

మా జట్టుతో మీకేం సంబంధం.. పాక్​ మాజీలపై గవాస్కర్ సీరియస్!

  • Author singhj Published - 03:16 PM, Fri - 8 September 23
  • Author singhj Published - 03:16 PM, Fri - 8 September 23
మా జట్టుతో మీకేం సంబంధం.. పాక్​ మాజీలపై గవాస్కర్ సీరియస్!

భారత్ వేదికగా జరగనున్న వన్డే వరల్డ్ కప్ కోసం క్రికెట్ ఫ్యాన్స్ ఎంతగానో ఎదురు చూస్తున్నారు. అక్టోబర్ 5వ తేదీ నుంచి ప్రారంభం కానున్న ఈ మెగా టోర్నీ కోసం భారత్ తన జట్టును ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే.. టీమ్ సెలక్షన్​పై పలువురి నుంచి విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. ముఖ్యంగా దాయాది పాకిస్థాన్​తో పాటు పలు విదేశీ మాజీ ఆటగాళ్ల నుంచి విమర్శలు వస్తున్నాయి. దీనిపై భారత క్రికెట్ లెజెండ్ సునీల్ గవాస్కర్ మండిపడ్డాడు. ఈ వార్తలకు ప్రాధాన్యం ఇస్తున్న మీడియా మీద ఆయన అసహనం వ్యక్తం చేశాడు.

భారత జట్టు సెలక్షన్ విషయంలో మీ బోడీ సలహాలు ఎవరికి కావాలంటూ పాకిస్థాన్, ఆస్ట్రేలియా మాజీలపై గవాస్కర్ సీరియస్ అయ్యాడు. పాక్​తో ఆడేందుకు టీమిండియా భయపడుతోందని పీసీబీ చీఫ్​ నజమ్ సేథీ గతంలో ట్వీట్ చేసిన విషయం తెలిసిందే. దీని మీద గవాస్కర్ స్పందిస్తూ.. ‘వాళ్ల నుంచి వచ్చే ప్రకటనలకు మన మీడియా అధిక ప్రాధాన్యం ఇస్తోంది. భారత జట్టును పాకిస్థాన్, ఆస్ట్రేలియా ఆటగాళ్లు ఎంపిక చేస్తున్నట్లుగా ఉంది. మన జట్టుతో వారికేం సంబంధం? అని గవాస్కర్ ప్రశ్నించాడు. మనవాళ్లు వాళ్ల టీమ్​ను సెలక్ట్ చేస్తున్నారా? అని క్వశ్చన్ చేశాడు.

భారత ఆటగాళ్లతో పోల్చుతూ వాళ్ల ఆటగాళ్లే గొప్ప అని పాక్ మాజీలు ప్రచారం చేసుకుంటారని గవాస్కర్ చెప్పుకొచ్చాడు. విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ కంటే బాబర్ ఆజం గొప్ప అని.. షాహిన్ అఫ్రిదీ మంచి బౌలర్ అని, సచిన్ టెండూల్కర్ కంటే ఇంజమాముల్ హక్ మంచి బ్యాటర్ అని వాళ్లకు వాళ్లు గొప్పలు పోతారన్నాడు గవాస్కర్. తద్వారా వాళ్ల ఫ్యాన్స్​కు దగ్గరవుతారన్నాడు. మన మీడియాలో వాళ్లకు అంత ప్రాధాన్యం ఇవ్వొద్దని సూచించాడు. తమ టీమ్​లో ఏ ప్లేయర్ ఉండాలో సౌతాఫ్రికా, ఆస్ట్రేలియా చెబుతాయని.. కానీ ఎవరి సలహాలూ తమకు అక్కర్లేదని గవాస్కర్ స్పష్టం చేశాడు.