ఇప్పుడు ఆంధ్ర ప్రదేశ్ లో ఉన్న ఏకైక సమస్య “అమరావతి”. ఈ సమస్యపై మందడం గ్రామంలో నిరసన తెలుపుతున్న వారెవరు? విజయవాడలో ప్రదర్శనలు చేస్తున్న మహిళలు ఎవరు? అమరావతికోసం పోరాడుతున్న రాజకీయపార్టీ ఏది? అమరావతికోసం అక్షర యుద్ధం చేస్తున్న మీడియా ఏది? ఈ మొత్తం శక్తుల నేపధ్యం ఏది?
విజయవాడలో మొన్న బందరు రోడ్డులో జరిగిందనే మహిళా ప్రదర్శన, నిన్న జరిగిన కొవ్వొత్తుల ప్రదర్శన ప్రస్తావించినప్పుడు… ఆ ప్రదర్శనల వెనుక కొద్దిదూరంలో వరుసగా నెమ్మదిగా నడిచిన “ఆడి, బెంజి, బిఎండబ్ల్యూ,” తదితర కార్లు చూస్తే తెలియడం లేదా? అమరావతి ఎవరిదో? దానికోసం పోరాటం చేస్తున్నదెవరో? అమరావతిలో ఎవరి “ఇంట్రెస్టులు” ఎక్కువగా ఉన్నాయో, లేదా ఎవరి “ఇంట్రెస్టులు” దెబ్బతిన్నాయో వారే పోరాటం చేస్తుంటారు. ఇప్పుడు జరుగుతున్నది అదే. రాజకీయంగా, ఆర్ధికంగా, సామాజికంగా అమరావతి ఏ వర్గం సమస్య అన్నది నిరసన చేస్తున్న ప్రజలను చూస్తే తెలుస్తుంది.
మందడంలో కౌలు రైతులు, రైతు కూలీలు నిరసనలో పాల్గొనడం లేదు అంటేనే స్పష్టంగా తెలుస్తోంది ఇది ఎవరి సమస్యో. గ్రామీణ జీవితంలో ఒకరికొకరితో ఉండే సంబంధాల కారణంగా నామమాత్రపు మద్దతు పలుకుతున్న ఎస్ సి, ఎస్ టి, బీసీ, మైనారిటీలను అగ్రభాగాన నిలిపి పోరాటం చేయాలనుకున్న శక్తులకు ఆ వర్గాల ప్రజలు కలిసిరాకపోవడంతో వాళ్ళే మహిళలను, యువతులను, పిల్లలను ముందు పెట్టి పోరాటం చేస్తున్నారు. వాస్తవానికి ఈ పోరాటంలో రైతులు తక్కువ. భూ యజమానులే ఎక్కువ. భూమి హక్కుదారులుగా ఉంటూ వ్యవసాయం చేయకుండా కౌలుకు ఇచ్చే భూ యజమానులు చంద్రబాబు అడిగిందే తడవుగా రాజధానికోసం ఇచ్చేసిన “వ్యవసాయం చేయని రైతులు”.
తమ భూములు కౌలుకిచ్చి వ్యవసాయం ఎప్పుడో మానేసిన రైతుల పోరాటం. రాజకీయ వ్యవసాయం చేస్తున్న రైతులు. పారిశ్రామిక వ్యవసాయం చేస్తున్న రైతులు. మీడియా వ్యవసాయం చేస్తున్న రైతులు. విదేశాల్లో స్థిరపడి డాలర్ల వ్యవసాయం చేస్తున్న రైతులు. ఈ రైతుల ఇళ్ళలోంచి వచ్చిన మహిళలే రైతు మహిళలు. సమస్య ఈ రైతులదే. పోరాటం చేస్తున్నది ఈ రైతులే. ఈ పోరాటానికి వచ్చే ఈ రైతుల డ్రైవర్లు, ఈ రైతుల గన్ మెన్లు అమరావతిపై ఎంత చిత్తశుద్ధితో ఉన్నారో ఈ ఉద్యమంలో అక్కడక్కడా కనిపించే దళితులూ, రైతు కూలీలు అంతే చిత్తశుద్ధితో ఉన్నారు. ఈ రైతుల పత్రికల్లో, టీవీ ఛానల్లో పనిచేసే జర్నలిస్టులు కూడా అమరావతిపట్ల అంత చిత్తశుద్ధితోనే ఉన్నారు.
మొన్నోరోజు బెజవాడలో ప్రదర్శన నిర్వహించిన మహిళలను పోలీస్ స్టేషన్ కు తరలిస్తుంటే పోలీస్ వ్యాన్ వెనుక యజమానురాళ్ళ కోసం బెంజి కార్లలో వెళ్ళిన డ్రైవర్లను చూస్తే తెలుస్తుంది “అన్నివర్గాల ప్రజలు అమరావతిని ఓన్ చేసుకుంటున్నారు అని.” ఈ పోరాటంలో పాల్గొంటున్న ఏ రైతు (నాయకుడి) వెనుక ఉన్న గన్ మెన్ ని అడిగినా, డ్రైవర్ని అడిగినా తడుముకోకుండా చెప్పేస్తున్నారు “జై అమరావతి” అని. ఈ రైతుల యాజమాన్యంలోని మీడియాలో పనిచేస్తున్న వివిధ సామాజిక వర్గాలకు చెందిన వారు కూడా “జై అమరావతి” అంటున్నారు. ఇలా అన్ని వర్గాల వారూ అమరావతికే మద్దతు పలుకుతున్నారు. అందుకే అమరావతి అందరిదీ అని ఆ నాయకులూ, ఆ మీడియా పదే పదే చెపుతుంటే నమ్మకుండా ఎలా ఉంటారు? నమ్మేశారు లెండి!
డ్రైవర్లు, గన్ మెన్లు, విధేయులు ఉంటే ఉద్యమం అందరిదీ అవుతుంది. అందుకే పతాక శీర్షికల్లో వార్తలు. పేజీలకు, పేజీలు వార్తలు వండి వారుస్తున్నారు. గంటలకు గంటలు టీవిలో అవే చర్చలు. ఉద్యమం ఉధృతం. అందరిదీ అమరావతి