iDreamPost
android-app
ios-app

వైవిధ్యాల సమ్మేళనం సోలిపేట రామలింగారెడ్డి

  • Published Aug 06, 2020 | 7:05 AM Updated Updated Aug 06, 2020 | 7:05 AM
వైవిధ్యాల సమ్మేళనం సోలిపేట రామలింగారెడ్డి

కరోనా ప్రభావమో లేక ఇతర ఆరోగ్య కారణాలో వరుసగా నివాళ్లు రాయాల్సి వస్తుంది..

ఈనాడు ఆవిర్భావంతో వామపక్ష మరియు వాటి ప్రజాసంఘాల కార్యకర్తలు ఈనాడులో చేరి జర్నలిస్టులయ్యారు. తొలి రెండు దశాబ్దాలు ఈనాడు బరువును వారే మోసారంటే అతిశయోక్తి కాదు. ఈనాడు యాజమాన్యం కూడా కొన్ని అంశాలలో తప్ప మొదటి రోజుల్లో ప్రజాపక్షంగా ఉండటంతో వార్తలు,కథనాలు రాసిన జర్నలిస్టులకు, పత్రికకు మంచి పేరు వచ్చింది.

అదే రాజకీయాల విషయానికి వస్తే తెలుగుదేశం ఆవిర్భావంతో వామపక్ష మద్దతుదారులు క్రమంగా టీడీపీ ఓటు బ్యాంకుగా రూపాంతరం చెందారు.. అలాంటి పరిణామక్రమం TRS -తెలంగాణ రాష్ట్రసమితి ఆవిర్భావముతో తెలంగాణలో కూడా జరిగింది.

తెరాస ఆవిర్భవించిన తొలి రోజుల్లో వివిధ సంఘాలుగా పనిచేస్తున్న తెలంగాణా వాదులు తెరాస బ్యానర్ కింద రాజకీయ పునరేకీకరణ జరిగింది.కెసిఆర్ తెరాసను స్థాపించినప్పుడు అలంపురం నుంచి బీజేపీ తరుపున ఎమ్మెల్యేగా గెలిచిన రావుల రవీంద్రనాథ్ రెడ్డి,సిరిసిల్ల నుంచి కాంగ్రెస్ తరుపున గెలిచిన రేగులపాటి పాపారావు తమ పార్టీలను వీడి తెరాసలో చేరారు.గాదె ఇన్నయ్య,ప్రకాష్ లాంటి వారితో పాటు నారదాసు లక్ష్మణ రావ్ ,ఈటెల రాజేందర్ లాంటి ఉద్యమ నేపధ్యం ఉన్నవారు కూడా చేరారు.

Also Read:రాజధాని పై రాష్ట్రానిది నిర్ణయాధికారం – తేల్చి చెప్పిన కేంద్రం

కెసిఆర్ సొంత జిల్లా మెదక్ కు చెందిన సోలిపేట రామలింగారెడ్డి కూడా తెరాస లో చేరారు..ఈ రామలింగా రెడ్డి గత రాత్రి అనారోగ్యంతో మరణించారు.

సోలిపేట రామలింగా రెడ్డి నేపథ్యం ఏమిటి?
రామలింగారెడ్డిది భిన్నమైన నేపథ్యం. విద్యార్థి దశలో రాడికల్ స్టూడెంట్ యూనియన్ (RSU) నేతగా పనిచేసిన రామలింగా రెడ్డి చదువు పూర్తయిన తరువాత “ఉదయం” పత్రికలో రిపోర్టర్ గా జర్నలిస్ట్ జీవితాన్ని మొదలు పెట్టారు. రిపోర్టర్ గా పనిచేస్తూనే ప్రజాసమస్యల మీద స్పందిస్తుండేవారు.ఈ క్రమంలో రామలింగా రెడ్డి మీద పోలీసుల దృష్టి పడింది, పోలీసు వేధింపులు మొదలయ్యాయి.

మొట్టమొదటి “టాడా” కేసు
రామలింగారెడ్డి “ఉదయం” రిపోర్టర్ గా పనిచేస్తూనే పీపుల్స్ వార్ గ్రూప్ కు సహకరిసున్నారన్న అనుమానంతో పోలీసులు పలుసార్లు అయన ఇంటి మీద దాడి చేసారు.

1991లో రామలింగా రెడ్డి ఇంట్లో పేలుడు పదార్ధాలతో పాటు విప్లవ సాహిత్యం దొరికిందని ఆయన్ను “టాడా” చట్టం కింద అరెస్ట్ చేశారు. ఒక జర్నలిస్ట్ మీద టాడా చట్టాన్ని ప్రయోగించటం అదే మొదటిసారి . దీనితో జర్నలిస్ట్ సంఘాలతో పాటు హక్కుల సంఘాలు తీవ్రంగా స్పందించాయి. కోర్టు విచారణలో పోలీసులు పెట్టిన కేసులో తగిన ఆధారాలు లేవని కొట్టేశారు .


“వార్త”తో ప్రయాణం

టాడా కేసు నుంచి విముక్తి పొందిన తరువాత రామలింగారెడ్డి వార్తలో చేరారు, మెదక్ జిల్లా జర్నలిస్టు యూనియన్ అధ్యక్షుడిగా కూడా పనిచేశారు .1999-2002 మధ్య కూడా పోలీసుల వేధింపులు తప్పలేదు. ఎదో కేసులో రామలింగా రెడ్డి దొరకలేదని ఆయన శ్రీమతిని పోలీసు స్టేషన్ కు తీసుకువెళ్లగా స్థానికులు, జర్నలిస్టు యూనియన్ నేతలు ధర్నా చేసి ఆవిడను బయటకు తీసుకొచ్చారు.

రాజకీయ నేపథ్యం
సోలిపేట రామలింగా రెడ్డి సొంత చిన్నాయన సోలిపేట రామచంద్రారెడ్డి సీనియర్ పొలిటీషియన్. 1972లో దొమ్మెట ఎమ్మెల్యే గెలిచారు. టీడీపీ ఆవిర్భావం తరువాత టీడీపీలో చేరి ఆయన 1996లో రాజ్యసభకు ఎన్నికయ్యారు. కానీ రామలింగారెడ్డి వారి చిన్నాయన రామచంద్రారెడ్డి రాజకీయాలకు దూరంగా ఉండేవారు. రామలింగారెడ్డిది మొదటి నుంచి వామపక్ష భావజాలం కావటం ఒక కారణం అయితే ఆ ఇరు కుటుంబాల మధ్య ఉన్న విభేదాలు మరో కారణం.

Also Read:ఆటోలో తిరిగిన ప్రజా నాయకుడు సున్నం రాజయ్య ఇక లేరు

దొమ్మాట అంటే ముత్యం రెడ్డి

చెరుకు ముత్యం రెడ్డి టీడీపీ తరుపున 1989,1994 మరియు 1999 ఎన్నికల్లో గెలిచారు. 2009 నియోజకవర్గాల పునఃవిభజనలో దొమ్మాట రద్దయ్యి దుబ్బాక నియోజకవర్గం ఏర్పడింది. దొమ్మాట నియోజకవర్గ చరిత్రలో ముత్యంరెడ్డి మాత్రమే హ్యాట్రిక్ విజయాలు సాధించారు.

ఎన్టీఆర్ మరియు చంద్రబాబు ప్రభుత్వంలో మెదక్ జిల్లా నుంచి మెదక్ శాసనసభ్యుడు కరణం రామచంద్ర రావ్ మంత్రిగా ఉండేవారు. రామచంద్రరావ్ 1972-1999 మధ్య ఐదుసార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. 2002లో రామచంద్రరావు చనిపోగా ఉప ఎన్నికల్లో ఆయన శ్రీమతి ఉమా దేవి గెలిచారు. మంత్రి పదవి మాత్రం ముత్యం రెడ్డికి ఇవ్వాలని ఆయన వర్గం హైద్రాబాద్లో చంద్ర బాబు ఇంటి వద్ద బల ప్రదర్శన చేశారు. ఒక వైపు కెసిఆర్ టీడీపీని వీడి తెరాసను స్థాపించటం మరో వైపు సీనియర నేత రామచంద్ర రావు మరణం వెరసి జిల్లాలో టీడీపీని నడపటానికి బలమైన నేత అవసరమని భావించిన చంద్రబాబు ముత్యం రెడ్డికి మంత్రి పదవిని ఇచ్చారు.

2004 ఎన్నికలు- రామలింగా రెడ్డి పోటీ

2004 ఎన్నికల్లో కాంగ్రెస్-తెరాస-కమ్యూనిస్టుల మధ్య పొత్తులో భాగంగా దొమ్మాట స్థానాన్ని తెరాస కు కేటాయించారు. టీడీపీ తరుపున మంత్రి ముత్యం రెడ్డి పోటీచేస్తుండటంతో ఆయన్ను ఓడించగల గట్టి నేత కోసం తెరాస అన్వేషించి సోలిపేట రామలింగారెడ్డికి టికెట్ ఇచ్చింది.

ఆ ఎన్నికల్లో మెదక్ జిల్లాలో టీడీపీ గెలవటానికి అవకాశం ఉన్న ఏకైక నియోజకవర్గం దొమ్మాట అంచనాలు బద్దలు చేస్తూ రామలింగారెడ్డి గెలిచారు. ముత్యం రెడ్డి సొంత బలం ,మంచి పేరు,ఆయన చేసిన అభివృద్ధి ఆయన్ను గెలిపించలేకపోయాయి. మెదక్ జిల్లాలోని మొత్తం 10 స్థానాలలో 9 కాంగ్రెస్ కూటమి గెలవగా,మెదక్ నుంచి కాంగ్రెస్ రెబల్ అభ్యర్థి పటోళ్ల శశిధర్ రెడ్డి గెలిచారు.

బలమైన నేతగా ఎదిగిన క్రమం

రామలింగా రెడ్డి 2008 ఉప ఎన్నికల్లో గెలిచారు. 2009 నియోజక పునఃవిభజనలో దొమ్మాట రద్దయ్యి దుబ్బాక నియోజకవర్గం ఏర్పడింది. 2009 ఎన్నికల్లో కాంగ్రెస్ తరుపున పోటీచేసిన ముత్యం రెడ్డి తెరాస తరుపున పోటీచేసిన రామలింగా రెడ్డిని ఓడించారు. 2014 మరియు 2018 ఎన్నికల్లో మాత్రం రామలింగా రెడ్డి గెలిచారు. 2018 ఎన్నికల్లో కాంగ్రెస్ టికెట్ నిరాకరించటంతో ముత్యం రెడ్డి తెరాసలో చేరి రామలింగా రెడ్డికి  మద్దతు ఇచ్చారు.

ముత్యం రెడ్డి గత సంవత్సరం సెప్టెంబర్ లో అనారోగ్యంతో మరణించగా రామలింగా రెడ్డి గత రాత్రి మరణించారు. రాజకీయ పార్టీలు ఏవైనా సోలిపేట రాంచంద్రారెడ్డి,ముత్యం రెడ్డి మరియు రామలింగా రెడ్డి ముగ్గురి మీద ఎలాంటి అవినీతి ఆరోపణలు లేకపోవటం విశేషం.

Also Read:డైరెక్ట‌ర్ సూరిబాబు క‌థ‌

అనేక మంది జర్నలిస్టులు రాజకీయాలలోకి వచ్చి రాణించారు కానీ 1978 తరువాత రాజకీయాలలోకి వచ్చిన జర్నలిస్టుల్లో నాలుగుసార్లు (ఒక ఉప ఎన్నికతో కలిపి) ఎమ్మెల్యే గా గెలిచింది సోలిపేట రామలింగా రెడ్డి మాత్రమే!

ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ శాఖ మంత్రి కన్నబాబు రెండుసార్లు, టీడీపీ తరుపున మాజీ మంత్రి కాల్వ శ్రీనివాసులు ఒక సారి ఎమ్మెల్యే & ఒక సారి ఎంపీగా గెలిచారు. టీడీపీ తరుపున 1983లో ఈనాడు సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్న గంటల సుమన పాయకరావు పేట నుంచి గెలిచారు.

రామలింగా రెడ్డి దంపతులది ఆదర్శ వివాహం.మంజీర రచయితల సంఘం ఆద్వరంలో కాళోజీ  మరియు కెసిర్ ల సమక్షంలో జరిగింది.కొడుకు సతీష్, కూతురు ఉదయశ్రీ లకు కూడా ఆదర్శ వివాహాలు చేశారు .

ఈ మధ్య కాలంలో రాజకీయ నాయకులు ఆర్టికల్స్ రాయటం ఎక్కువైంది. అలాంటి వాటిలో ఎక్కువ వేరే వారి సహాయంతో రాసినవే ఉంటాయి. స్వయంగా జర్నలిస్ట్ అయినా రామలింగా రెడ్డి మాత్రం ఎమ్మెల్యే అయినా తరువాత కూడా తరచుగా పత్రికల్లో ఆర్టికల్స్ రాస్తుండేవారు.

తొలి టాడా కేసు ఎదుర్కొన్న జర్నలిస్టుగా, ఎక్కువసార్లు గెలిచిన జర్నలిస్టుగా సోలిపేట రాంలింగారెడ్డిది రికార్డు. 59 సంవత్సరాలు అంటే పెద్ద వయస్సు కాదు…దీర్ఘకాలిక ఆనారోగ్యం.. ట్రీట్మెంట్ తీసుకుంటుండగానే గుండెపోటు రావటంతో గత రాత్రి మరణించారు .. వారికి నివాళి.