ఆటోలో తిరిగిన ప్రజా నాయకుడు సున్నం రాజయ్య ఇక లేరు

By Raju VS Aug. 04, 2020, 07:29 am IST
ఆటోలో తిరిగిన ప్రజా నాయకుడు సున్నం రాజయ్య ఇక లేరు

ఉమ్మడి రాష్ట్రంలో మూడు సార్లు విజయం సాధించిన ఎమ్మెల్యేగా తెలుగు ప్రజల్లో మంచి గుర్తింపు సాధించిన సున్నం రాజయ్య మరణించారు. కరోనా తో ఆయన మృతి చెందారు. తూర్పు గోదావరి జిల్లా విఆర్ పురం మండలంలోని సున్నం వారి గూడెం నివాసి అయిన రాజయ్య కు తీవ్ర అస్వస్థత సోకడంతో విజయవాడ ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గం మధ్యలో మరణించారు. ఆయనకు కరోనా పాజిటివ్ నిర్ధారణ అయ్యింది.

సున్నం రాజయ్య సీపీఎం తరుపున ఆయన 1999, 2004, 2014 ఎన్నికల్లో విజయం సాధించారు. 2009లో మాత్రం ఓటమి పాలయ్యారు. తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికయిన తర్వాత వైఎస్సార్ ప్రతిపక్ష నేతగా ఉన్న ఆయనతో కలిసి పలు ఉద్యమాల్లో పాల్గొన్నారు. ముఖ్యంగా 2000 సంవత్సరం చారిత్రక విద్యుత్ ఉద్యమంలో సున్నం రాజయ్య కీలక పాత్ర పోషించారు. రాజశేఖర్ రెడ్డితో కలిసి ఆమరణదీక్ష సాగించారు. ఆ ఆమరాణ దీక్షలో రాజయ్య శరీరంలో షుగర్ లెవెల్స్ పడిపోయి శరీరంలో కీటోన్స్ పెరిగాయి,డాక్టర్ లు దీక్ష విరమించమని చెప్పినా వినకుండా దీక్షను కొనసాగించారు.అప్పటికే అందరు ఎమ్మెల్యేల వద్ద సెల్ ఫోన్ ల ఉన్నాయి. రాజయ్య వద్ద సెల్ ఉండేది కాదు దానితో ఆయన కుటుంబ సభ్యులు కాంగ్రెస్ ఎమ్మెల్యే ఆనం వివేకానందరెడ్డి సెల్ ఫోనులో రాజయ్యతో టచ్ లో ఉండేవారు.

Also Read: ప్రజా గాయకుడు వంగపండు ఇకలేరు...

1999 ఎన్నికల్లో టీడీపీ కమ్యూనిస్టులతో పొత్తు తెంచుకొని బీజేపీతో కలిసి పోటీచేసింది. కమ్యూనిస్టులు ఒక్క సీటన్నా గెలుస్తారా అన్న మీదొయా విశ్లేషణలను ,కమ్యూనిస్టులను శాసనసభలో అడుగుపెట్టనీయనన్నా చంద్రబాబు శపదాన్ని బద్దలుకొట్టి సున్నం రాజయ్య భద్రాచలం నుంచి గెలిచారు. ఆ ఎన్నికల్లో సిపిఎం భద్రాచలం, నకిరేకల్ స్థానాలలో మాత్రమే గెలవగా సిపిఐ ఒక్క స్థానం కూడా గెలవలేదు.

అనంతరం వైఎస్సార్ సీఎంగా ఉన్న సమయంలో పోలవరం వంటి సమస్యలపై రాజయ్య పోరాటాలు సాగించారు. పోలవరం నిర్వాసితుల కోసం నిలబడ్డారు. రాష్ట్ర విభజన తర్వాత ఆయన నియోజకవర్గం భద్రాచలం తెలంగాణాలో ఉండగా, ఆయన ఓటర్లు ఏపీలో విలీనం అయ్యారు. ఏడు మండలాల విలీన ప్రజల సమస్యల కోసం అటు తెలంగాణా అసెంబ్లీలోనూ, ఇటు ఏపీ ప్రభుత్వంతోనూ ఆయన పోరాడేవారు.

అటు అసెంబ్లీలోనూ, ఇటు ప్రజా జీవితంలోనూ సౌమ్యుడిగా గుర్తింపు పొందారు. నిజాయితీగా ప్రజా పక్షాన పోరాడిన నేతగా ఆయనకు పేరుంది. 2019 ఎన్నికల్లో ఆయన సీపీఎం తరుపున రంపచోడవరం అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఓటమి పాలయ్యారు. అయినప్పటికీ వివిధ ప్రజా సమస్యలపై పనిచేస్తున్నారు. ముఖ్యంగా గిరిజనుల పక్షాన నికరంగా నిలబడిన నేతగా ఆయన్ని అందరూ కొనియాడుతారు. మారుమూలు ప్రాంతం నుంచి వచ్చిన ఆయన చివరకు అసెంబ్లీకి కూడా ఆటోలో వెళ్లే నిరాడంబరత ప్రదర్శించారు. ఆర్టీసీ బస్సులలో ప్రయాణించేవారు. ఒకసారి ఆటోలో ఆయన గన్ మేన్ కూడా లేకుండా సచివాలయానికి వెళ్లిన సమయంలో ఆయన్ని సెక్యూరిటీ అనుమతించకపోతే తాను ఎమ్మెల్యేనని నిరూపించుకోవాల్సి వచ్చింది. ఇలాంటి నిబద్ధత కలిగిన నేతగా సున్నం రాజయ్య 59 ఏళ్ల వయసులోనే మరణించారు.

సున్నం రాజయ్య మృతికి పలువురు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. ఉభయ తెలుగు రాష్ట్రాలలోనూ సుదీర్ఘకాలం ప్రజా జీవితంలో సాగిన రాజయ్య హఠాన్మరణం గిరిజనులకు తీరని నష్టం అని పలువురు అభిప్రాయపడుతున్నారు. సున్నంవారి గూడెం లో ఆయనకు అంత్యక్రియలు నిర్వహించబోతున్నట్టు సీపీఎం నేతలు తెలిపారు.

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp