iDreamPost
android-app
ios-app

సంక్షోభంలో అవకాశాల సృష్టికర్తలు ….

  • Published Mar 28, 2020 | 7:32 AM Updated Updated Mar 28, 2020 | 7:32 AM
సంక్షోభంలో అవకాశాల సృష్టికర్తలు ….

ఇప్పుడు ఈ కరోనా సంక్షోభంలో అవకాశాలు సృష్టించుకొంటున్న సందట్లో సడేమియా గాళ్ల గురించిలేండి . ఏంటీ వాళ్ళెవరు అంటారా , ఒకరా ఇద్దరా? .

నిన్న ఒక ప్రబుద్ధుడు తన కారు మీద కోవిడ్ 19 స్పెషల్ ఆఫీసర్ అని స్టిక్కర్ అంటించుకొని విజయవాడ నుండి వైజాగ్ వరకూ చెక్ పోస్ట్లు తప్పించుకొని చివరికి వైజాక్ పోలీసులకి దొరికిపోయాడు .

మరో మేధావి గోదావరి జిల్లా మారుమూల ప్రాంతాల్లో గంజాయి అమ్ముతూ 200 గ్రాముల గంజాయితో దొరికిపోయాడు .

గుంటూరు జిల్లా నరసరావుపేటలో ఒక వ్యక్తి మద్యం బాటిళ్లు బాత్ రూమ్స్ లో స్టాక్ పెట్టుకొని కోరిన చోటికి సరఫరా చేస్తూ మద్యం బాటిళ్లతో పోలీసులకు పట్టుబడ్డాడు . మరో వ్యక్తి పల్నాడు రోడ్డులో పచ్చిగడ్డి మోపుల్లో దాచిన మద్యాన్ని అమ్ముతూ పోలీసులకు పట్టుబడ్డాడు .

పక్క రాష్ట్రంలో దొరికిన ప్రబుద్దుడి కధ అయితే మరీ విచిత్రం , బులెట్ బండి బాక్స్ లో మద్యం బాటిళ్లు పెట్టుకొని కోరిన చోటికి అందిస్తూ పోలీసులు ఆపిన చోట మెడిసిన్ కోసం బయటికొచ్చానని జేబులో ఉంచుకొన్న ఖాళీ టాబ్లెట్ షీట్ చూపిస్తూ బయట పడసాగాడు . అయితే ఓ చెక్ పోస్ట్ వద్ద మెడిసిన్ గురించి అవగాహన ఉన్న ఓ కానిస్టేబుల్ ఆ టాబ్లెట్ షీట్ తీసుకొని పరీక్షించి చూడగా అది సంసార సామర్ధ్యం పెంచటానికి వాడే వయాగ్రా టైప్ టాబ్లెట్ షీట్ గా గుర్తించి బండి సోదా చేయగా 12 మద్యం బాటిళ్లు దొరికాయని సదరు మేధావికి దేహశుద్ధి చేసి స్టేషన్ కి తరలించారని వినికిడి .

అలాగే మరో యువతి తెలంగాణ నుండి కృష్ణా జిల్లా చెక్ పోస్ట్ వద్ద ఏపీ లోకి ప్రవేశించబోగా అడ్డుకున్న పోలీసులకు తాను సీబీఐ అధికారినని చంద్రబాబు సంతకంతో కూడిన ఐడీ కార్డు చూపించింది . అది నకిలీది అని గుర్తించిన పోలీసులు తిరస్కరించేసరికి మోడీ తన తాత అని జగన్ మీకు ఫోన్ చేస్తాడని , మీకు కష్టాలు తప్పవని బెదిరించినా వినని పోలీసులు బలవంతంగా వెనక్కి తిప్పి పంపారు .

మొత్తానికి కోవిడ్ 19 లాక్ డౌన్ సంక్షోభం కొందరు అక్రమార్కులకు , ప్రబుద్దులకు సంక్షోభంలో అవకాశాల వనరుగా మారినట్టు ఉంది . పాపం ఆయన చెప్పిన సంక్షోభం వేరు ఈ సంక్షోభం వేరు అని తెలుసుకోకుండా ఇలా కక్కుర్తి పడితే ఆదాయం ఏమో కానీ వైరస్ వాహకాలుగా పని చేసి వారి ప్రాణాలతో పాటు ప్రజల ప్రాణాలతో కూడా చెలగాటమాడుతున్నారు . ఇలాంటి ప్రబుద్దుల పట్ల మరింత కఠినంగా వ్యవహరించి కట్టడి చేయాల్సిన అవసరం ఉంది .