స్థానిక సంస్థల ఎన్నికల వ్యవహారంలో రాష్ట్రంలో ప్రధానప్రతిపక్షం వైఖరి చూస్తుంటే ఎదోకవిధంగా తిమ్మిని బొమ్మిని చేసైనా స్థానిక సంస్థల ఎన్నికలను ఆపించాలనే లక్ష్యంతోనే ముందుకి వెళ్తున్నట్టు అర్ధమౌతుంది. రాష్ట్రంలో ఇప్పుడున్న రాజకీయ పరిస్థితుల్లో స్థానిక సంస్థల ఎన్నికలు కనుక జరిగితే తమ పార్టీ ఘోర ఓటమిని చెవిచూడడం ఖాయమని ఒక అంచనాకు వచ్చిన తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు, అదే కనుక జరిగితే తమ పార్టీకి తీవ్రనష్టం తప్పదని, అదేసమయంలో పార్టీలో నాయకత్వం మీద కూడా చర్చ జరిగే ప్రమాదముందని గ్రహించినట్టు కొందరు రాజకీయ విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు.
ఇటీవలకాలంలో చంద్రబాబు తన అనుకూల మీడియాను అడ్డుపెట్టుకొని జగన్ ప్రభుత్వం మీద ప్రజలందరూ తీవ్ర అసంతృప్తితో ఉన్నారని నమ్మించి, ప్రభుత్వం మీద కృత్రిమ వ్యతిరేకత తీసుకొచ్చే ప్రయత్నం ఒకపక్క పెద్ద ఎత్తున చేస్తున్నప్పటికీ.. ఈ స్థానిక సంస్థల్లో ప్రజలు మళ్ళీ జగన్ మోహన్ రెడ్డి కి బ్రహ్మరధం పడితే తన పార్టీకి ఇబ్బందులు తప్పవని చంద్రబాబు భావిస్తున్నారని పార్టీ ఆంతరంగిక సమావేశాల్లో స్వయంగా కొందరు తెలుగుదేశం నేతలే వ్యాఖ్యానిస్తున్నారు.
ఏదేమైనా స్థానిక సంస్థల ఎన్నికలను తప్పించుకోవడానికి చంద్రబాబు ఆపసోపాలు పడుతున్నాడని సామాన్య జనానికి కూడా అర్ధమౌతుంది. ఒకపక్క తన అనుచరుల చేత కోర్టుల్లో కేసులు వేయించి ఎదోకవిధంగా ఎన్నికల ప్రక్రియను నిలుపుదల చేయించడానికి ఆయన చెయ్యని ప్రయత్నం అంటూ లేదు. అయినప్పటికీ ప్రభుత్వం తన పని తానూ చేసుకుంటూ ఇప్పటికే సంవత్సరం ఆలస్యమైన తరుణంలో 15 వ ఆర్ధిక సంఘం నుండి రాష్ట్రానికి రావాల్సిన షుమారు 5 వేల కోట్ల రూపాయల అభివృద్ధి నిధులు వెనక్కెళ్లే ప్రమాదం ఉండడంతో ఎలాగైనా నిర్ణిత గడువులోగానే ఈ ఎన్నికలను నిర్వహించేందుకు ఒకపక్క ప్రభుత్వం అన్ని ఏర్పాట్లను పూర్తి చేసింది.
మరోపక్క కేవలం రాజకీయ కారణాలతో ఎలాగైనా ఈ ఎన్నికల ప్రక్రియను ఆపించాలని కంకణం కట్టుకున్న విపక్ష నేత ఉన్నట్టుండి ఇప్పుడు ఒక వింత వాదనలు తెరమీదకి తీసుకొచ్చాడు. అందులో భాగంగానే మోకాలికి.. బోడిగుండుకి.. ముడిపెట్టిన చందాన కరోనా వైరస్ కు.. స్థానిక సంస్థలఎన్నికలకు ముడి పెట్టె ప్రయత్నం చేయడం విడ్డురంగా ఉంది.
ఇటీవలే ఎన్నికల రిజర్వేషన్ల అంశంలో హైకోర్టు నుండి స్పష్ట వచ్చిన తరుణంలో, ప్రస్తుతానికి ఎన్నికల నిర్వహణకు సంభందించి న్యాయపరమైన అడ్డంకులు తొలగిపోవడంతో, ఎన్నికల ప్రక్రియను మొదలుపెట్టిన రాష్ట్ర ఎన్నికల సంఘం ఎన్నికల నిర్వహణకు సంభందించి శుక్రవారం వివిధ రాజకీయ పక్షాల అభిప్రాయాలను తెలుసుకొనే నిమిత్తం రాష్ట్ర ఎన్నికల కమిషన్ అఖిలపక్ష పార్టీలతో ఒక సమావేశం నిర్వహించింది. ఆ సమావేశానికి రాష్ట్రంలోని అన్ని ప్రధాన రాజకీయ పక్షాల ప్రతినిధులతో పాటు తెలుగుదేశం ప్రతినిధిగా వర్ల రామయ్య హాజరయ్యాడు. ఈ సమావేశంలో వర్ల రామయ్య ఒకవైపు కరోనా వివిజృంభిస్తుంటే ఇప్పుడు ఎన్నికలను నిర్వహించాల్సిన అవసరం ఏంటంటూ వింత వాదన తెరపైకి తీసుకొచ్చాడు. అయితే వైసిపి మాత్రం కరోనా వైరస్ ను బూచి గా చూపి ఎన్నికల నుండి పారిపోయే ప్రయత్నం చేయడం ఏంటని తెలుగుదేశం పై ఎదురుదాడికి దిగింది.
కరోనా వైరస్ ఆందోళన కలిగిస్తున్న మాట వాస్తవమే.. దాన్ని ఎవరు కాదనరు. అయితే కరోనా వైరస్ ని అరికట్టడానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అన్ని చర్యలు తీసుకుంటున్నాయి. ఇదే సమయంలో వ్యాధి ప్రబలకుండా ప్రజలు కూడా కొన్ని జాగ్రత్తలు పాటించక తప్పదు. అయితే రాష్ట్రంలో ఇంతవరకు ఒక్క కరోనా పాజిటివ్ కేస్ కూడా నమోదు కాలేదు. అలాంటప్పుడు ఎన్నికలను ఆపాల్సిన అవసరమేముందని ప్రజాస్వామ్యవాదులు ప్రశ్నిస్తున్నారు. నిజంగా ఒకవేళ కరోనా తీవ్రత ఎక్కువైతే అప్పుడు దానికి తగ్గట్టు ఎన్నికల సంఘం నిర్ణయం తీసుకుంటుంది కదా అని వారు ప్రశిస్తున్నారు.
ఈ మొత్తం వ్యవహారంలో ఇప్పుడున్న పరిస్థితుల్లో రాష్ట్రాల్లో విపక్ష రాజకీయ పార్టీలు ఎన్నికలను ఎదుర్కోవడానికి సిద్ధంగా లేవనే సంగతి అందరికి అర్ధమౌతుంది. అయితే ఈ మొత్తం వ్యవహారంలో చంద్రబాబు తన పలయాన వాదంతో జనంలో విశ్వాసం కోల్పోయి తెలుగుదేశం తన వైఖరితో జనంలో అభాసుపాలౌతుందని తమ పార్టీ ఆంతరంగిక సమావేశాల్లో స్వయంగా కొందరు సీనియర్ తెలుగుదేశం నేతలే వ్యాఖ్యానిస్తున్నారంట!!