ఆంధ్రప్రదేశ్ శాసన మండలి రద్దుపై శాసన సభలో జరిగిన చర్చకు ప్రతిపక్ష టీడీపీ గౌర్హాజరైంది. సభకు హాజరు కావాలా..? వద్దా..? అనే అంశంపై ఆదివారం దాదాపు 6 గంటల పాటు టీడీఎల్పీ భేటీలో చర్చించిన ప్రతిపక్ష నేత చంద్రబాబు చివరకు సభకు హాజరు కాకూడదని నిర్ణయించారు. ఒక సభ గురించి మరొక సభలో చర్చించడం రాజ్యాంగ విరుద్ధం అనే కారణం చెబుతూ సభకు దూరంగా ఉండి పెద్ద తప్పిదం చేశారని విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు. సభకు హాజరు కాకుండా ప్రజల వాదనను వినిపించాల్సిన ప్రతిపక్షం విఫలమైందని పేర్కొంటున్నారు.
శాసన మండలి రద్దు ఏ కారణాల వల్ల జరిగిందనేది అందరికీ తెలిసిన విషయమే. మూడు రాజధానుల ఏర్పాటు బిల్లును మండలి అడ్డుకుని సెలెక్ట్ కమిటీకి పంపడమేనన్నది తక్షణ కారణం. మండలిలో ఆ బిల్లును సెలెక్ట్ కమిటీకి పంపి అమరావతి విషయంలో విజయం సాధించామని సంబరాలు చేసుకున్న టీడీపీ.. శాసన సభలో కూడా అమరావతిపై తమ వాణిని వినిపించి ఉంటే బాగుండేదని రాజకీయ విశ్లేషకులు పేర్కొంటున్నారు. మండలి రద్దును ఇప్పుడు వ్యతిరేకిస్తున్న చంద్రబాబు, 2004లో ఏర్పాటను వ్యతిరేకించారని సభలో అధికార పక్షం తన తీరును ఎండగట్టే అవకాశం ఉందని ముందుస్తుగానే చంద్రబాబు తప్పించుకున్నారన్న అపవాదు తప్పేది. అసలు సభకు హాజరై ఉంటే.. ప్రతిపక్షం తన పాత్రను పోషించిందన్న కితాబులు ప్రజల నుంచి దక్కేవి. వ్యూహమంటూ తప్పించుకునేందుకు టీడీపీ పెద్ద తప్పిదం చేసిందనే విమర్శలూ తప్పేవి.
టీడీపీ గత ప్రభుత్వంలో శాసన సభలో వాదోపవాడాలు జరిగాయి. వైఎస్ జగన్‌పై కేసులు, అవినీతి ఆరోపణలు పదే పదే చేస్తూ టీడీపీ సభ్యులు ఎదురుదాడి చేశారు. వైఎస్ జగన్ మాట్లాడే సమయంలో పదే పదే మైక్ కట్ చేస్తూ ప్రతిపక్షం గొంతు నొక్కేశారని విమర్శలు ఎదుర్కొన్నారు. అయినా పట్టువిడవకుండా వైఎస్ జగన్ అధికార పార్టీ అనుచరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను, ఎన్నికల హామీల అమలుపై వైఫల్యాలను తరచూ ఎండగట్టి ప్రజల మన్ననలను పొందారు. అయితే అధికార టీడీపీ తన పంథాను మార్చుకోకుండా.. మైక్ కట్ చేస్తుండడంతో ప్రజా క్షేత్రంలోనే తేల్చుకుంటానని వైఎస్ జగన్, ప్రతిపక్ష పార్టీ సభ్యులు సభ నుంచి బయటకు వచ్చారు. 2017 నుంచి సభకు హాజరుకాకుండా ఉన్నారు. ప్రజల తరఫున ప్రభుత్వాన్ని ప్రశ్నించాల్సిన ప్రతిపక్షం సభకు హాజరుకాకపోవడంపై విమర్శలు వచ్చాయి. అప్పట్లో అధికార టీడీపీ కూడా వైఎస్సార్‌సీపీ పారిపోయిందని హేళనగా మాట్లాడింది. అయితే ప్రజా సంకల్పపాదయాత్ర ద్వారా వైఎస్ జగన్ నిత్యం ప్రజల్లో ఉంటూ వారి మన్ననలను పొందారు.
అప్పట్లో వైఎస్సార్‌సీపీని విమర్శించిన టీడీపీ.. తాను ప్రతిపక్షంలోకి వచ్చిన తర్వాత ఆ మాటలను మరిచినట్లుంది. సభకు హాజరుకాకుండా అదే తీరును కొనసాగించింది. సభలో కేవలం 21 మంది ఎమ్మెల్యేలు ఉన్నా కూడా ప్రతిపక్ష టీడీపీకి తగినంత సమయం స్పీకర్ ఇస్తున్నారు. టీడీపీ సభ్యులు, చంద్రబాబు నాయుడు ఎప్పుడు మాట్లాడాలనుకుంటే అప్పుడు మైక్ ఇస్తున్నారు. సీఎం వైఎస్ జగన్ కూడా మాట్లామంటూ ప్రతిపక్షాన్ని ప్రోత్సహిస్తున్నారు. ప్రతిపక్షం మాట్లాడే సమయంలో మైక్ కట్స్ అస్సలే లేవు. అయినా ప్రతిపక్షం సభకు రాకపోవడంతో పారిపోయిందన్న విమర్శలు టీడీపీ ఎదుర్కొవాల్సి వస్తోంది. మరి చంద్రబాబు ఈ విషయాన్ని ఏ విధంగా సమర్థించుకుంటారో చూడాలి.
4314