Idream media
Idream media
తెలంగాణలో రాజకీయంగా అందరి దృష్టీ హుజూరాబాద్ పైనే ఉంది. అధికార పార్టీ అయితే అక్కడ గెలుపే ధ్యేయంగా సర్వ శక్తులూ ఒడ్డుతోంది. ఆ నియోజకవర్గంలో పథకాల అమలు కోసం ప్రత్యేక రూల్స్‌ను కూడా పాటిస్తోంది. అదే విధంగా బీజేపీ నుంచి పోటీలో ఉన్న ఈటల రాజేందర్ అధికార పార్టీని ఇరుకున పెట్టేలా వ్యాఖ్యలు చేస్తున్నారు. ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను తన ఖాతాలో వేసుకునే ప్రయత్నం చేస్తున్నారు. ప్రజల మద్దతు కోసం విస్తృతంగా పోరాడుతున్నారు.
ఇటువంటి తరుణంలో బీఎస్‌పీలో చేరిన మాజీ ఐపీఎస్ అధికారి ఆర్‌ఎస్ ప్రవీణ్‌కుమార్ కూడా ఇక్కడ నుంచి పోటీ చేసే అవకశాలు ఉన్నాయని ప్రచారం జరుగుతోంది. దీనికితోడు ఇక్కడ దళితుల ఓట్లు ఎక్కువగా ఉండడం ఆ ప్రచారానికి బలం చేకూరింది. అయితే, తాజాగా ఆయన చేసిన వ్యాఖ్యలతో హుజూరాబాద్ బరిలో బీఎస్‌పీ పోటీలో ఉండదనే సంకేతాలు వెలువడుతున్నాయి.
Also Read:తుమ్మల కారు దిగనున్నారా?
విద్యానగర్‌లోని బీసీ భవన్‌లో బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్యతో మాజీ ఐపీఎస్, బీఎస్పీ రాష్ట్ర కోఆర్డినేటర్ ఆర్‌ఎస్ ప్రవీణ్‌కుమార్ భేటీ అయ్యారు. తాజా రాజకీయాలపై చర్చించారు. ఎల్‌బీనగర్‌లో తెలంగాణ రాష్ట్ర సంచార జాతుల సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన సమావేశంలోనూ ఆయన మాట్లాడారు. దళితులలో నిండుగా ఆత్మగౌరవం ఉందని, అంబేడ్కర్ రాసిన రాజ్యాంగం, మహత్మా జ్యోతిరావుఫూలే ఆశయాలతో గౌరవంగా బతుకుతున్నారని చెప్పారు. దళిత బంధు పథకం ప్రకటనపై పరోక్షంగా విమర్శించారు. రాష్ట్ర ప్రభుత్వ పెద్దలు ప్రతీసారి తమ స్వార్థం కోసం దళితులు అనే పదం వాడుతూ వారిని అగౌరవపరుస్తున్నారని ఆరోపించారు. అంతేకాదు.. ప్రభుత్వ తప్పులను ప్రశ్నించిన ఒక్కగానొక్క బీసీ నాయకుడు ఈటల రాజేందర్‌ను కావాలనే బయటకు పంపించారని పేర్కొన్నారు. హుజూరాబాద్‌లో ఆయనను ఓడించడానికి కుట్రలు, కుతంత్రాలు చేస్తూ.. ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్నారు అని సీఎం కేసీఆర్‌పై ఆరోపణలు కురిపించారు.
ఓ వైపు ఈటలకు మద్దతుగా మాట్లాడుతూ, మరోవైపు సీఎం కేసీఆర్‌ను విమర్శిస్తూ సమకాలీన అంశాలపై ఆర్‌ఎస్‌పీ స్పందించారు. ‘‘హుజూరాబాద్ ఉప ఎన్నికలో రాజకీయ లబ్ధి కోసమే సీఎం కేసీఆర్ దళితబంధు పథకాన్ని తీసుకొచ్చారు. దళితులకు మూడు ఎకరాల భూమి హామీని ఎందుకు నెరవేర్చడం లేదు? ఎంబీసీ కార్పొరేషన్‌కు నిధులు ఎందుకు కేటాయించలేదు? ఎస్సీ కార్పొరేషన్ రుణాల కోసం కేటాయించిన నిధులలో 30ు నిధులను కూడా ఎందుకు ఖర్చు చేయడంలేదు’’ అని సీఎం కేసీఆర్‌ను ప్రశ్నించారు. అంతేకాదు.. దళితులు, బీసీలకు విద్య, అఽధికారంలో వాటా ఇవ్వకుండా గొర్రెలు, బర్లు వంటి పథకాలతో బహుజనులను బిచ్చగాళ్లుగా తయారు చేయడం తగదంటూ ప్రభుత్వానికి హితవు పలికారు. బహుజన రాజ్యాధికారం సాధించడంలో భాగంగానే ఆర్.కృష్ణయ్యను కలిసి భవిష్యత్ రాజకీయాలపై చర్చించినట్లు చెప్పారు.
Also Read:కుదిరిన పదవుల పంపకం,రాజస్థాన్ కాంగ్రెస్ ప్రభుత్వం గట్టెక్కినట్లే !
ఈటలకు మద్దతుగా ప్రవీణ్‌కుమార్ చేసిన వ్యాఖ్యలు తాజాగా చర్చనీయాంశంగా మారాయి. దీన్నిబట్టి హుజూరాబాద్‌లో పోటీ చేయకుండా రాజేందర్‌కు అనుకూలంగా ప్రచారం చేస్తారని పరిశీలకులు భావిస్తున్నారు. అయితే, ఇక్కడే మరో ట్విస్ట్ ఉంది. ‘‘బహుజనులు ప్రలోభాలకు లొంగవద్దు. మటన్, చికెన్ ఇచ్చినా, ఫుల్ బాటిల్ ఇచ్చినా, రూ.10 లక్షలు ఇచ్చినా.. చివరికి ఏనుగు గుర్తుకు ఓటు వేయండి’’ ఇదే సందర్భంగా ఆర్‌ఎస్‌పి స్టేట్‌మెంట్ ఇచ్చారు. ఇది హుజూరాబాద్‌ను ఉద్దేశించి అన్నారా? అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని అన్నారా అనే మరో సందిగ్ధం తెరపైకి వచ్చింది.