తుమ్మల కారు దిగ‌నున్నారా?

By Kalyan.S Sep. 01, 2021, 10:10 am IST
తుమ్మల కారు దిగ‌నున్నారా?

ఉమ్మడి ఖమ్మం జిల్లా రాజకీయాల్లో తుమ్మల నాగేశ్వరరావు ముద్ర ప్ర‌త్యేక‌మైంది. నాలుగు దశాబ్దాలకు చేరువ కాబోతున్న ఆయన రాజకీయ జీవితంలో జిల్లా రాజకీయాలను శాసించారు. టీడీపీలో ఉన్నంత కాలం తిరుగులేని నాయకుడిగా ఉన్నారు. టీఆర్ఎస్ లోకి వచ్చిన తర్వాత కూడా మంత్రిగా చ‌క్రం తిప్పారు. అయితే.. 2018 ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత నుంచి ప‌రిస్థితి మారింది. ఇప్పుడు ఆయనకు టీఆర్ఎస్ లో ఉన్న సీనియర్ నేత అనే పేరు త‌ప్ప‌... అంతకు మించి.. మరే ప్రాధాన్యమూ లేకుండా పోయింద‌నే అసంతృప్తి ఆయ‌న అనుచ‌రుల్లో ఉంది. ఈ క్ర‌మంలో ఆయ‌న పార్టీ మార‌బోతున్నార‌నే ప్ర‌చారం జోరుగా సాగుతోంది.

నిజానికి తుమ్మలకు టీఆర్ఎస్ లో మంచి ప్రాధాన్య‌మే ద‌క్కింది. ఆయన పార్టీలోకి రావడమే మంత్రి పదవి హామీతో వచ్చారు. ఆ మేర‌కు రోడ్లు భవనాల శాఖను కట్టబెట్టారు కేసీఆర్. ఆ తర్వాత పాలేరు ఉప ఎన్నికల్లో ఆయన గెలుపుకోసం టీఆర్ఎస్ స్పెషల్ ఇంట్రెస్ట్ చూపించింది. ఆ తర్వాత తుమ్మల హవా కొనసాగింది. 2018 ఎన్నికల వరకు దూకుడు కొనసాగించారు. అయితే.. ఆ ఎన్నికల్లో రాష్ట్రం మొత్తం కారు జోరు కొనసాగినా.. ఖమ్మంలో మాత్రం పంక్ఛరైపోయింది. పది ఎమ్మెల్యే స్థానాలకు ఒకే ఒక్క సీటు గెలిచింది టీఆర్ఎస్. మంత్రిగా ఉన్న తుమ్మల ఓటమి పాలయ్యారు. గెలిచిన ఒక్క ఎమ్మెల్యే అజయ్ కు మంత్రి పదవి దక్కింది. దీంతో.. పరిస్థితులు మొత్తం వేగంగా మారిపోయాయి.

దీంతో.. తుమ్మల ప్రాభవం వేగంగా పడిపోతూ వచ్చింది. మంత్రిగా అజయ్.. చక్రం తిప్పుతూ.. ఇతర గ్రూపులకు అవకాశం ఇవ్వడం లేదనే అభిప్రాయం బలపడుతూ వచ్చింది. జిల్లాలో.. అజయ్, తుమ్మల, నామ నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి వర్గాలు బలంగా ఉన్నాయి. వీరిలో.. మంత్రిగా అజయ్ ఎంపీగా నామా హవా కొనసాగుతుండగా.. తుమ్మల, పొంగులేటి వర్గాలు డీలా పడిపోయాయి. జిల్లాలో క్షేత్రస్థాయిలో తుమ్మలకు మంచి పట్టు ఉందన్నది కాదనలేని సత్యం. కానీ.. ఎంత పట్టున్నా.. అధికారం చేతిలో ఉండాల్సిందే. అప్పుడే.. నాయకులు జనం వెంట ఉంటారు. అవేవీ లేకపోతే.. ఒంటరిగా మిగిలిపోవాల్సిందే. గత కార్పొరేషన్ ఎన్నికల వేళ అన్నీతానై వ్యవహరించి తనవారికి టిక్కెట్లు ఇప్పించుకున్న తుమ్మల నాగేశ్వరరావు.. ఇప్పుడు అజయ్ కారు నడిపిస్తుంటే.. మౌనంగా చూస్తూ ఉండాల్సిన పరిస్థితి తలెత్తిందనే అభిప్రాయాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి.

ఈ పరిస్థితిని తమకు అనుకూలంగా మలుచుకునేందుకు బీజేపీ తీవ్రంగా ప్రయత్నాలు చేసింది. తుమ్మలకు కమలం కండువా కప్పాలని నేతలు గట్టిగా ప్రయత్నించారు. కానీ.. తాను బీజేపీలోకి వెళ్లేది లేదని తుమ్మల చెప్పారు. అలాగే, షర్మిల పార్టీ నుంచి కూడా తుమ్మలకు ఆహ్వానం అందినట్టుగా చెబుతున్నారు. నిజానికి తుమ్మల వంటి నేతను ఏ పార్టీ అయినా కోరుకుంటుంది. దానికి ఆయనకున్న పట్టు నిదర్శనం. తుమ్మల చేరిక వరకు ఖమ్మం జిల్లాలో టీఆర్ఎస్ నామమాత్రంగానే ఉండేది. ఆయన వచ్చిన తర్వాత పరిస్థితి మొత్తం మారిపోయింది. టీడీపీ కేడర్ దాదాపుగా ఆయన వెంట నడిచింది. దీంతో.. గులాబీ పార్టీ తిరుగులేనిదిగా తయారైంది. అయితే.. ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత ఆయనకు ఎమ్మెల్సీ ఇచ్చి మళ్లీ మంత్రిని చేస్తారనే ప్రచారం కూడా సాగింది. కానీ.. కేసీఆర్ అలాంటిది ఏమీ చేయలేదు. దీంతో.. తుమ్మల మౌనంగా ఉండిపోవాల్సిన పరిస్థితి వచ్చింది.

కాంగ్రెస్ చీఫ్ గా బాధ్య‌త‌లు స్వీక‌రించిన త‌ర్వాత ఉమ్మడి ఖమ్మం జిల్లానుంచే రేవంత్ రెడ్డి యాక్షన్ మొదలుపెట్టారు. రేవంత్ ఆపరేషన్ సక్సెస్ కావడంతో .. ఖమ్మం జిల్లా రాజకీయాల్లో తనదైన ముద్ర వేసుకున్న మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వర్‌రావు కూడా కాంగ్రెస్ లో చేరడానికి రంగం సిద్ధం చేసుకున్నారనే ప్ర‌చారం సాగుతోంది. కేసీఆర్ తొలి ప్రభుత్వంలో మంత్రిగా జిల్లాను శాసించిన తుమ్మల.. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో పాలేరులో ఓడిపోయారు. అప్పటి నుంచి ఆయన సైలెంట్ అయ్యారు. పాలేరులో తుమ్మలపై గెలిచిన కాంగ్రెస్ ఎమ్మెల్యే ఉపేందర్ రెడ్డి టీఆర్ఎస్ లో చేరడంతో తుమ్మల ప్రాబ‌ల్యం త‌గ్గింది. టీఆర్ఎస్ పార్టీ క్రియాశీలక సమావేశాలకు ఆయన దూరంగా ఉంటున్నారు. మరోవైపు జిల్లాలో అధికారపార్టీ పై అసమ్మతి పెరుగుతుండటం, ప్రత్యామ్నాయ పార్టీగా కాంగ్రెస్ కనిపించడంతో.. తుమ్మల నాగేశ్వరరావు కూడా కాంగ్రెస్‌కు వెళ్లాలని నిర్ణయించుకున్నారని తెలుస్తోంది.

తుమ్మలతో రేవంత్ రెడ్డి చర్చలు జరిపారని, ఆయన కూడా అంగీకరించారని చెబుతున్నారు. త్వరలోనే అధికారికంగా తుమ్మల తన నిర్ణయాన్ని ప్రకటించనున్నారని జిల్లాలో ప్రచారం జరుగుతోంది. ఇటీవలే పాలేరులో జరిగిన ఓ సభలో మాట్లాడిన తుమ్మల తనయుడు.. త్వరలో మంచి రోజులు రాబోతున్నాయని చెప్పారు. స్థానిక ఎమ్మెల్యే తీరుపైనా విమర్శలు చేశారు. దీంతో కాంగ్రెస్ లో చేరాలని నిర్ణయించుకోవడం వల్లే తుమ్మల తనయుడు ఆ వ్యాఖ్యలు చేశారని తెలుస్తోంది.

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp