తెలుగు సినిమా ఖ్యాతిని ప్రపంచవ్యాప్తంగా చాటి చెప్పిన దర్శకుడు రాజమౌళి, చేసింది తక్కువ సినిమాలే అయినా తెలుగులో విపరీతమైన ఫాలోయింగ్ సంపాదించుకున్న నటుడు పవన్ కళ్యాణ్ కలిసి ఒక సినిమా చేస్తే ఎలా ఉంటుంది? రికార్డులు బద్దలే కదూ. వీరిద్దరూ కలిసి ఒక సినిమా చేస్తే ఎలా ఉంటుందో అని తెలుగు సినీ ప్రేమికుల సహా సాధారణ ప్రేక్షకులు సైతం చాలా ఆసక్తిగా ఎదురు చూశారు.. అయితే తమ కాంబినేషన్లో సినిమా ఉండకపోవచ్చు అని హింట్ ఇచ్చారు రాజమౌళి. తాజాగా శ్రీకాకుళం జిల్లాలోని ఒక మెడికల్ కాలేజీలో జరిగిన ఈవెంట్ కు రాజమౌళి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ ఈవెంట్ లో అనేక ప్రశ్నలకు రాజమౌళి సమాధానమిచ్చారు.
ఈ సందర్భంగా ఒక విద్యార్థి పవన్ కళ్యాణ్ తో సినిమా ఎప్పుడు ఉంటుంది అని ప్రశ్నించగా దానికి రాజమౌళి ఆసక్తికరంగా స్పందించారు. పవన్ కళ్యాణ్ గారితో సినిమా చేయాలని నేను కూడా చాలా సంవత్సరాలు వెయిట్ చేశాను అని, ఒకసారి ఒక సినిమా షూటింగ్ లో ఆయనను కలిసి మాట్లాడితే చాలా కంఫర్టబుల్గా అనిపించింది అని చెప్పుకొచ్చారు. ఈ సమయంలో మీరు ఎలాంటి సినిమా చేయాలి అనుకుంటున్నారు అని పవన్ ని అడిగితే నాకు ఫలానా అని లేదు మీరు ఎలాంటి సినిమా చెప్పినా చేసేస్తా అని పవన్ చెప్పుకొచ్చారు అని రాజమౌళి వెల్లడించారు.
దీంతో మీకు సమయం కుదిరినప్పుడు కబురు పంపించమని, వచ్చి కథను నేరెట్ చేస్తానని చెప్పానని అలా చెప్పి సంవత్సరం, సంవత్సరంనర్ర ఎదురు చూసినా ఆయన నుంచి ఎలాంటి కబురు రాలేదని వెల్లడించారు. ఆ తర్వాత ఆయన కొన్ని సినిమాలతో బిజీగా ఉన్నారని, ఈ లోపు తమ ఆలోచనా విధానం మారిపోయింది అని చెప్పుకొచ్చారు.. సాధారణ సినిమాలు, మాస్ సినిమాలు కాకుండా ఎక్కువ రీచ్ ఉన్న సినిమాలు, ఎక్కువ రోజులు పట్టే సినిమాలు, బిగ్గర్ థాన్ లైఫ్ సినిమాలు చేయాలని ఫిక్స్ అయ్యాయని చెప్పుకొచ్చారు. అలా పుట్టుకొచ్చినవే యమదొంగ, మగధీర, బాహుబలి లాంటి సినిమాలని ఈ లోపు పవన్ సినిమాల కంటే రాజకీయాల మీద ఆసక్తి చూపిస్తూ వచ్చారని దీంతో ఇద్దరి దారులు వేరయ్యాయని రాజమౌళి చెప్పుకొచ్చారు. నాకు ఆయనంటే చాలా ఇష్టం అని, చాలా గౌరవం ఉందని పేర్కొన్న రాజమౌళి భవిష్యత్ లో కూడా కలిసి చేస్తామనే మాట మాత్రం చెప్పలేదు.
Also Read : Bigg Boss 5 : సెకండాఫ్ షో అయినా రక్తి కట్టాలి