iDreamPost
android-app
ios-app

కొత్త కరెంట్ బిల్లు పేదలకు భలే మేలు

కొత్త కరెంట్ బిల్లు పేదలకు భలే మేలు

సోమవారం వెలువరించిన కొత్త విద్యుత్‌ టారిఫ్‌లో పేదలకు మేలు చేసేలా ఏపీ ప్రభుత్వం ఒక వినూత్న నిర్ణయాన్ని తీసుకుంది. ఇకపై ఎంత విద్యుత్‌ వాడితే ఆ మేరకే విద్యుత్‌ బిల్లులు చెల్లించాల్సి ఉంటుంది. తద్వారా లక్షల కుటుంబాలకు భారీ లబ్ధి జరగనుంది.

అదేంటి.. ఎప్పటి నుంచే ఇదే విధానం కదా అమలులో ఉండేది అనుకుంటున్నారా? కాదు గతంలో మనకు తెలిసీ తెలియకుండానే మనం వాడిన విద్యుత్‌కంటే ఎక్కువ బిల్లు కట్టేవాళ్లం. దాన్ని తెలుసుకోవాలంటే విద్యుత్‌ టారిఫ్‌లలో ఏయే కేటగిరీలు ఉంటాయి? ఆయా కేటగిరీలకు ఎలాంటి విద్యుత్‌ బిల్లులు ఉంటాయో తెలుసుకుందాం.

ఏ కేటగిరీలో 50 యూనిట్లు విద్యుత్‌ వినియోగం చేస్తే ఒక్కో యూనిట్‌కు 1.45 రూపాయలు, 51–75 మధ్య వినియోగం చేస్తే 2.60 చొప్పున బిల్లును చెల్లించాల్సి ఉంటుంది.

బీ కేటగిరీలో 100 యూనిట్ల వరకు.. ఒక్కో యూనిట్‌కు 2.60 రూపాయలు, 101–200 యూనిట్ల వరకు 3.60 రూపాయలు, 201–225 మధ్య అయితే యూనిట్‌కు 6.90 చొప్పున బిల్లును చెల్లించాలి.

సీ కేటగిరీలో అయితే 50 యూనిట్ల వరకు వినియోగానికి యూనిట్‌కు 2.65 చొప్పున, 51–100 వరకు 3.35 చొప్పున, 101–200 వరకు 5.40 చొప్పున, 201–300 యూనిట్ల వరకు 7.10 చొప్పున, 301–400 యూనిట్ల వరకు 7.95 చొప్పున, 401–500 యూనిట్ల మధ్య 8.50 చొప్పున, 500 యూనిట్ల పైన వినియోగానికి 9.95 చొప్పున చెల్లించాల్సి ఉంటుంది.

అంటే విద్యుత్‌ వాడకాన్ని బట్టి మీ కేటగిరీ మారుతుంది. రేట్లూ మారతాయి.
ఇకపోతే పేదలకు గతంలో బిల్లుల చెల్లింపులో ఎలాంటి వాయింపు ఉండేది?. ఈ ప్రభుత్వంలో ఎలాంటి లబ్ధి చేకూరుతుందో చూద్దాం..

ఉదాహరణకు.. మీరు ఎప్పుడూ ఏ– కేటగిరీలోనే(75 యూనిట్లలోపు) బిల్లులు చెల్లించేవారు అనుకుందాం. ఓ ఏడాది మీ ఇంట్లో ఏదైనా ఫంక్షన్లు, పండుగలు, పెళ్లిల్లు ఘనంగా జరుపుకున్నప్పుడు కరెంటు వినియోగం పెరుగుతుంది. అప్పుడు ఉన్నట్టుండి మీరు సీ కేటగిరీలో (225 యూనిట్లపైన)వెళ్తారు. అప్పటికి అది సరిపెట్టుకున్నా.. వచ్చే ఏడాది నుంచి కూడా మీరు సీ కేటగిరీలోనే ఉంటారు. అంటే మీరు కరెంటును ఎంత తక్కువ వాడినా మీరు సీ కేటగిరీలో బిల్లులు చెల్లిస్తారు. 50 యూనిట్లే వాడినా.. యూనిట్‌కు రూ. 2.65 చొప్పున చెల్లించాల్సి ఉండేది. 75 యూనిట్లు కాల్చితే.. మొదటి 50 యూనిట్లకు 2.65 చొప్పున, మిగతా 25 యూనిట్లకు 3.35 చొప్పున చెల్లించాల్సిందే. అయితే ఈ వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో అలాంటి విధానానికి చెక్‌ పెట్టారు. ఇక మీ గత ఏడాది వాడకాన్ని ఏ మాత్రం పరిగణలోకి తీసుకోరు. 50 యూనిట్లు వాడితే 1.45 చొప్పునే చెల్లించొచ్చు. 75 యూనిట్లు వాడితే మొదటి 50 యూనిట్లకు 1.45 చొప్పున. మిగిలిన 25 యూనిట్లకు రూ. 2.60 చొప్పునే వసూలు చేస్తారు. అంటే మీరు వాడిన విద్యుత్‌ మేరకే బిల్లులు చెల్లించొచ్చు.

దీనివల్ల ఎంతో మంది మధ్యతరగతి ప్రజలకు భారీ లబ్ధి జరగనుంది.
ఇప్పుడు అర్థమయిందనుకుంటా..
ఇక ఎందుకు ఆలస్యం.. ఆ లబ్ధిదారుల జాబితాలో మీరూ ఉంటారు.. ఆనందించండి.