ఆంధ్రప్రదేశ్ లో స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు ముగ్గురు పిల్లలు కలిగి ఉంటే అనర్హులని ఎన్నికల కమిషన్ స్పష్టం చేసింది. త్వరలో ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు నిర్వహించనున్న నేపథ్యంలో రాష్ట్ర ఎన్నికల కమిషన్ నిబంధనలను సిద్ధం చేసింది. వీటి ప్రకారం 1995 మే 31 తర్వాత మూడో సంతానం కలిగి ఉన్నవారు పరిషత్ ఎన్నికల్లో పోటీ చేసేందుకు అనర్హులవుతారు. ఎంపీటీసీగా పోటీ చేయాలంటే అభ్యర్థి ఆ మండలంలో ఓటరుగా నమోదై ఉండాలి. మండల పరిధిలో ఎక్కడ నుంచైనా పోటీ చేయవచ్చు.
జడ్పీటీసీగా పోటీ చేయాలంటే జిల్లా పరిధిలో ఓటరుగా నమోదై ఉండాలి. జిల్లాలో ఎక్కడి నుంచైనా పోటీ చేయవచ్చు. అయితే, ఒక వ్యక్తి ఒక చోట మాత్రమే పోటీ చేయాలి. అభ్యర్థులకు 21 ఏళ్లు నిండి ఉండాలి. షెడ్యల్డ్ కులాలు, తెగలు, వెనుకబడిన తరగతులకు చెందిన వారు పరిషత్ ఎన్నికల్లో పోటీ చేయాలనుకుంటే తమ కులం, వర్గం తెలియజేస్తూ సర్టిఫికెట్ సమర్పించాలి. పరిషత్ ఎన్నికల్లో పోటీ చేసేందుకు జడ్పీటీసీలు రూ.5 వేలు, ఎంపీటీసీలు రూ.2500లు డిపాజిట్ చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాలకు చెందినవారు ఎంపీటీసీ ఎన్నిక కోసం రూ.1250, జడ్పీటీసీ ఎన్నిక కోసం రూ.2500 చెల్లించాలి.
కాగా, తెలంగాణ పురపాలక ఎన్నికల్లో సంతానం నిబంధనను తొలగించారు. చట్టంలో సవరణలు చేసిన ఎంత మంది సంతానం ఉన్నా పోటీ చేసేందుకు అవకాశం కల్పించారు. ఆంధ్రప్రదేశ లో ఉన్న చట్టాన్ని పటిష్టంగా అమలు చేసేందుకు చర్యలు తీసుకుంటుండగా, తెలంగాణాలో అదే చట్టాన్ని బలహీనపరిచే చర్యలు చేపట్టారన్న విమర్శలు వస్తున్నాయి.
3800