దేశంలో కరోనా వైరస్ సునామీ సృష్టిస్తున్న వేళ మహమ్మారికి మూకుతాడు వేసేందుకు రాష్ట్ర ప్రభుత్వాలు లాక్‌డౌన్‌కు వెళుతున్నాయి. ప్రస్తుత పరిస్థితుల్లో లాక్‌డౌన్ విధించడం ద్వారానే మహమ్మారికి మూకుతాడు వేయగలమనే నిర్థారణకు వస్తున్న రాష్ట్రాలు తప్పనిసరి పరిస్థితుల్లో లాక్‌డౌన్‌ను ప్రకటిస్తున్నాయి.
గత సోమవారం ఢిల్లీ రాష్ట్రం లాక్‌డౌన్ ప్రకటించగా.. తాజాగా కర్ణాటక అదే బాటలో నడిచింది. కర్ణాటకలో రెండు వారాలపాటు లాక్‌డౌన్ విధిస్తున్నట్లు యడ్యూరప్ప ప్రభుత్వం ప్రకటించింది. రేపటి నుంచి ఇది అమలులోకి వస్తుందని తెలిపింది. ఉదయం 6 గంటల నుంచి 10 గంటల వరకు నిత్యవసరాలు, కూరగాయల కొనుగోలుకు మాత్రమే అవకాశం ఇచ్చింది. అత్యవసర సేవలకు మినహాయింపు ఇచ్చింది. కఠిన లాక్‌డౌన్‌అమలు చేయడం వల్ల వైరస్‌ను నియంత్రించాలని కర్ణాటక సర్కార్ యోచిస్తోంది.
కర్ణాటకలో గడిచిన 24 గంటల్లో 35 వేల కొత్త కేసులు వెలుగుచూశాయి. దీంతో యడ్యూరప్ప ప్రభుత్వం లాక్‌డౌన్‌ను ప్రకటించింది. లాక్‌డౌన్ విధించడంపై గత కొన్ని రోజులుగా ప్రభుత్వంలో చర్చ జరుగుతోంది. సీఎం యడ్యూరప్ప కూడా పలుమార్లు లాక్‌డౌన్‌పై పరోక్ష వ్యాఖ్యలు చేశారు. తాజాగా నిర్ణయం తీసుకున్నారు.
ఢిల్లీ, కర్ణాటక బాటలో మరికొన్ని రాష్ట్రాలు పయనించే అవకాశాలు లేకపోలేదు. ఉత్తర భారత దేశంలో కరోనా వ్యాప్తి అధికంగా ఉంది. పలు రాష్ట్రాలు రాత్రి కర్ఫ్యూలు అమలు చేస్తుండగా.. మరికొన్ని రాష్ట్రాలు రాత్రి కర్ఫ్యూతోపాటు వారాంతపు లాక్‌డౌన్లను అమలు చేస్తూ వైరస్ కట్టడికి యత్నిస్తున్నాయి.
గడచిన 24 గంటల్లో దేశ వ్యాప్తంగా దాదాపు మూడున్నర లక్షల మంది వైరస్ బారిన పడడంతో ఆదివారం రాత్రి కేంద్ర ప్రభుత్వం అత్యవసర ఆదేశాలు జారీ చేసింది. స్థానిక పరిస్థితులకు తగినట్లుగా మినీ లాక్‌డౌన్లు విధించాలంటూ మార్గదర్శకాలు జారీ చేసింది. అత్యవసర సేవలకు మినహాయింపులు ఇస్తూ.. ఇతర రంగాలపై ఆంక్షలు విధించాలని ఆయా మార్గదర్శకాల్లో పేర్కొంది.
మే నెల మధ్యనాటికి వైరస్ ఉధృతి పతాక స్థాయిలో ఉంటుందన్న నిపుణుల అంచనాలు అందరినీ కలవరపెడుతున్నాయి. వైరస్ కట్టడికి లాక్‌డౌన్ విధించాలనే సలహాలు, సూచనలు కేంద్ర ప్రభుత్వానికి అందుతున్నాయి. దేశంలో వైరస్ ఉధృతిని కేంద్ర ప్రభుత్వం కూడా నిశితంగా గమనిస్తోంది. మే 2వ తేదీన ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెల్లడికానున్నాయి. ఆ ఫలితాలు వెల్లడైన తర్వాత ఏ క్షణమైనా లాక్‌డౌన్‌ను కేంద్ర ప్రభుత్వం ప్రకటించే అవకాశం ఉందనే ఊహాగానాలు హల్‌చల్ చేస్తున్నాయి.
Also Read : నష్టం జరిగాక చర్యలు.. ఆలస్యమైంది ప్రధాని గారు..!
17466