కర్నూలులోని జనసేన పార్టీ కార్యాలయాన్ని యజమానులు ఖాళీ చేయించారు. రెండురోజుల క్రితం కార్యాలయం ఖాళీ చేయాలని నిర్వాహకులకు యజమానులు చెప్పారు. అయితే తమకు ఐదేళ్ల పాటు అగ్రిమెంట్ ఉందని, అద్దె క్రమం తప్పకుండా చెల్లిస్తున్నామంటూ నిర్వాహకులు ఖాళీ చేయలేదు.
ఈ క్రమంలో ఈ రోజు కొంతమంది పార్టీ కార్యాలయం వద్దకు వచ్చారు. కార్యాలయంలోని ఫర్నీచర్‌ను బయటపడేసి, తాళం వేశారు. ఈ ఘటనపై మండిపడ్డ జనసేన నేతలు వైసీపీని లక్ష్యంగా చేసుకుని విమర్శలు చేశారు. అధికార పార్టీ నేతలు కావాలనే తమ పార్టీని ఖాళీ చేయించారని ఆరోపణలు చేశారు. ఐదేళ్లపాటు అగ్రిమెంట్ ఉన్నా.. బలవంతంగా ఖాళీ చేయించారని, దీనిపై తాము కోర్టుకు వెళతామని పేర్కొన్నారు.
జనసేన నేతల ఆరోపణలపై వైసీపీ స్థానిక నేతలు స్పందించారు. జనసేన పార్టీ కార్యాలయాన్ని ఖాళీ చేయించాల్సిన అవసరం తమకు ఏముందని ప్రశ్నించారు. రాయలసీమలో జనసేన పార్టీకి ఉనికేలేదని, అలాంటి పార్టీ గురించి తాము ఎందుకు ఆలోచిస్తామని వైసీపీ నేతలు ప్రశ్నిస్తున్నారు. మొత్తంమీద జనసేన పార్టీ కార్యాలయాన్ని యజమానులు ఖాళీ చేయించిన ఘటన.. జనసేన, వైసీపీ మధ్య మాటల తూటాలు పేలేలా చేసింది.
69796