ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి 2019 ఎన్నికల్లో భారీ విజయం సాధించిన తర్వాత నుండి రాష్ట్రంలో రాజకీయాలు పూర్తిగా మారిపోయాయి. తనను ఇన్నేళ్ళుగా టార్గెట్ చేసి ఇబ్బందులకు గురిచేసిన ఏ ఒక్క నేతనూ జగన్ వదలడం లేదు. అంతే కాదు, ఈ పదేళ్ళలో తనను ఎక్కడో ఓ చోట అవమానించిన వారిని కూడా ఆయన వదలడం లేదు. అలాగే ఈ పదేళ్ళలో తనను నమ్మి, తనపట్ల విశ్వాసంతో, విధేయతగా ఉన్న ఎవరినీ వదులుకోవడం లేదు.
విశ్వాసపాత్రంగా ఉన్న పిల్లి సుభాష్ చంద్ర బోస్, మోపిదేవి వెంకటరమణ ఇద్దరూ 2019 ఎన్నికల్లో ఓటమిపాలయినా జగన్ వారిని వదిలేయలేదు. అప్పటికే శాసనమండలి సభ్యునిగా ఉన్న బోస్ ను మంత్రివర్గంలోకి తీసుకున్నారు. అలాగే శాసనమండలికి అవకాశం కల్పించే లక్ష్యంతో మోపిదేవిని కూడా మంత్రివర్గంలోకి తీసుకున్నారు. ఆ తర్వాత శాసనమండలి రద్దు అనుకున్నప్పుడు ఆ ఇద్దరినీ రాజ్యసభకు పంపించారు. ఇక ఈ స్థాయి నుండి కింది స్థాయివరకూ పార్టీలో కానీ, మరో రకంగా కానీ తనకు అండగా నిలిచిన ఏ ఒక్కరినీ జగన్మోహన్ రెడ్డి మర్చిపోలేదు.
Also Read:బీజేపీ-జనసేనను గెలిపిస్తానంటున్న చింతమనేని
తన అనుచరుల పట్ల ఎలా గుర్తుపెట్టుకుని మరీ సహాయం చేస్తున్నారో తన ప్రత్యర్థుల పట్ల కూడా జగన్ అంతే పట్టుదలతో పనిచేస్తున్నారు. తన ప్రత్యర్ధులు ఒక్కొక్కరినీ గుర్తు పెట్టుకుని మరీ రాజకీయంగా కొడుతున్నారు.
తనను శాసనసభలో అవమానించిన అచ్చెన్నాయుడు సొంత ఊరిలో తొలిసారి పంచాయితీ ఎన్నిక జరిగింది.ఎన్నిక అడ్డుకోవటానికి బెదిరింపులకు దిగిన అచ్చెన్నాయుడు జైలుకు వెళ్ళారు.ఈ అందరికీ నాయకుడిగా నిలిచి తనపై పెద్దఎత్తున దుష్ప్రచారం చేసిన, చేయిస్తున్న చంద్రబాబు నాయుడుని గురిచూసి కొట్టారు జగన్. ఇటీవల ముగిసిన పంచాయితీ ఎన్నికల్లో చంద్రబాబు ప్రాతినిధ్యం వహిస్తున్న కుప్పం నియోజకవర్గంలో టీడీపీకి అడ్రస్ లేకుండా చేశారు. అలాగే చంద్రబాబు వియ్యంకుడు హిందూపురం శాసనసభ్యుడు నందమూరి బాలకృష్ణపై కూడా గురిపెట్టి అక్కడ కూడా టీడీపీ చిరునామా చెరిపేసే ప్రయత్నం చేశారు.
Also Read:ఆంధ్రజ్యోతి రాస్తున్న బీజేపీ నేతల 30 కోట్ల డీల్ దేని గురించి?
పంచాయితీ ఎన్నికలు ముగిసిన తర్వాత తాజాగా మొదలయిన మున్సిపల్ ఎన్నికల్లో కూడా జగన్ వ్యూహం అలాగే కొనసాగుతోంది. టీడీపీ సీనియర్ నేత, శాసనమండలిలో ప్రతిపక్ష నేత యనమల రామకృష్ణుడు ప్రాతినిధ్యం వహిస్తున్న తుని మునిసిపాలిటీల్లో జగన్ గట్టిదెబ్బ కొట్టారు. మొత్తం 30 వార్డుల్లో 13 వార్డులు ఏకగ్రీవం అయి నేరుగా వైసీపీ ఖాతాలో పడ్డాయి. మిగిలిన వాటికీ ఎన్నికలు జరిగినా తుని మున్సిపాలిటీలో తెలుగుదేశం చిరునామా కనుమరుగయ్యే అవకాశాలే కనిపిస్తున్నాయి.
ఇప్పటికే టీడీపీకి చెందిన ప్రముఖ నేతలు దేవినేని ఉమా, ధూళిపాళ్ళ నరేంద్ర, తదితర నేతలు పంచాయితీ ఎన్నికల్లో ఘోరంగా ఓటమి చెందారు. ఇక మున్సిపల్ ఎన్నికల్లో, ఆ తర్వాత జరగనున్న మండల పరిషత్, జిల్లా పరిషత్ ఎన్నికల్లో ఇతర ప్రత్యర్థులను జగన్ ఘోరంగా ఓడించే అవకాశాలు లేకపోలేదు.
Also Read:ప్రశాంత్ కిషోర్ వ్యూహంతో అమరేందర్ సింగ్ మరోసారి అందలం ఎక్కుతాడా?
మొత్తంగా చూస్తే జగన్ తనకు విధేయులను ఎంతగా కాపాడుకుంటున్నారో, తన ప్రత్యర్థులను కూడా అంతకంటే ఎక్కువగా గురిపెట్టి మరీ దెబ్బ కొడుతున్నారు. ఇదే విధానం కొనసాగితే 2024 ఎన్నికల నాటికి తన అనుచరులు ఒక్కొక్కరుగా ఒక్కోమెట్టూ ఎక్కుతుంటే, ప్రత్యర్ధులు ఒక్కొక్కరుగా ఒక్కోమెట్టూ జారిపోతారనడంలో సందేహం లేదు.