ప్రశాంత్ కిషోర్ వ్యూహంతో అమరేందర్ సింగ్ మరోసారి అందలం ఎక్కుతాడా?

By Suresh Mar. 03, 2021, 11:14 am IST
ప్రశాంత్ కిషోర్ వ్యూహంతో అమరేందర్ సింగ్ మరోసారి అందలం ఎక్కుతాడా?

పంజాబ్‌ ముఖ్యమంత్రి అమరేంద్రసింగ్‌ తాజా నిర్ణయంతో ఏడాది ముందుగానే అక్కడి రాజకీయాలు వేడేక్కాయి. 2022లో పంజాబ్‌లో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో మళ్లీ అధికారంలోకి రావడం కోసం పంజాబ్‌ ముఖ్యమంత్రి అమరేంద్ర సింగ్‌ ఇప్పటి నుంచే కసరత్తులు ప్రారంభించారు. అందులో భాగంగానే ప్రముఖ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్‌ కిషోర్‌కు కీలక బాధ్యతలు అప్పగించనున్నారు. ఇందులో భాగంగానే ప్రశాంత్‌ కిషోర్‌ను సీఎం కెప్టెన్‌ అమరేంద్ర సింగ్‌కు ప్రధాన సలహాదారుగా నియమితులయ్యారు. ఈ విషయాన్ని సీఎం కెప్టెన్‌ అమరేందర్‌ సింగ్‌ ట్విట్టర్‌లో పేర్కొన్నారు.

కేబినేట్‌ హోదా.. జీతం రూపాయి మాత్రమే
ప్రశాంత్‌ కిషోర్‌ను ప్రధాన కార్యదర్శిగా నియమిస్తున్నట్లు పంజాబ్‌ మంత్రి మండలి ఓ ప్రకటన విడుదల చేసింది. ఈ పదవి కేబినెట్‌ ర్యాంక్‌తో సమానం. మంత్రి మండలి విడుదల చేసిన నియామక నోటిఫికేషన్‌లో ఆయన ఈ పదవిలో జీతంగా రూ.1 మాత్రమే తీసుకోనున్నట్లు పేర్కొంది. ప్రభుత్వం అందించే అన్ని సౌర్యాలను ఆయన పొందుతారు. ఇక 2017లో జరిగిన పంజాబ్‌ అసెంబ్లీ ఎన్నికల్లో ప్రశాంత్‌ కిషోర్‌ కాంగ్రెస్‌ పార్టీకీ ఎన్నికల వ్యూహకర్తగా పనిచేసిన విషయం తెలిసిందే. ఆ ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ ఘన విజయం సాధించింది. రాష్ట్రంలోని మొత్తం 117 సీట్లకు గాను కాంగ్రెస్‌ 77 సీట్లను కైవసం చేసుకుంది. ప్రస్తుతం ప్రశాంత్‌ కిషోర్‌ పశ్చిమ బెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీకి కూడా ప్రధాన సలహాదారుగా పని చేస్తున్నారు.

వేడెక్కిన పంజాబ్‌ రాజకీయం
ప్రశాంత్‌ కిశోర్‌ ఏ రకంగా తన వ్యూహాలతో 2022లో పంజాబ్‌ ముఖ్యమంత్రి అమరిందర్‌ సింగ్‌ను తిరిగి అధికార పీఠంపై కూర్చోబెడతారా? అనేదానిపై ఇప్పుడు సర్వత్రా ఆసక్తికరంగా మారింది. ఆంధ్రప్రదేశ్‌లో ఇతర అంశాలతో పాటు సోషల్‌ మీడియాను కూడా విస్తతంగా వినియోగించుకుని వైసీపీని అధికారంలోకి తీసుకురావడంలో ప్రశాంత్‌ కిశోర్‌ కీలక పాత్ర పోషించారు. ఈ క్రమంలోనే బెంగాల్‌లోనూ అదే వ్యూహాన్ని అమలు చేస్తున్నారు. 2022 ఎన్నికల్లోనూ అమరిందర్‌ సింగ్‌ ప్రభుత్వం తిరిగి గద్దెనెక్కేందుకు సాధనంగా ఉపయోగపడనుంది. ఇప్పటికే ఇందుకు సంబంధించిన కార్యక్రమాలు మొదలపెట్టినట్లు తెలుస్తోంది. 117 నియోజకవర్గాల్లోనూ కార్యకర్తలకు ఇప్పటి నుంచే శిక్షణా కార్యక్రమాలను నిర్వహించనున్నారు.

సోషల్‌ మీడియాపైనే దృష్టి
ఎన్నికల్లో విజయం కోసం కోసం ప్రశాంత్‌ కిషోర్‌ ఎక్కువగా సోషల్‌ మీడియాను వినియోగించుకుంటారు. రానున్న పంజాబ్‌ ఎన్నికల్లోనూ ఇదే పంథాను అనుసరించనున్నారని రాజకీయ విశ్లేషకుల మాట. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ప్రాజెక్టుల గురించి ఎప్పటికప్పుడు మీడియా సెల్‌ హైలెట్‌ చేయడంతో పాటుగా ఎమ్మెల్యేలు ఎప్పటికప్పుడు సోషల్‌ మీడియా ద్వారా ప్రజలకు సమాచారం అందించేలా కసరత్తులు చేస్తున్నారు. ఫేస్‌బుక్‌లో 117 నియోజకవర్గాలకు సంబంధించి ప్రత్యేక ఫేజీలను ఏర్పాటు చేసి వాటిద్వారా ప్రభుత్వం చేపట్టే అభివృద్ధి సమాచారాన్ని అందుబాటులో ఉంచనున్నారు. అమరిందర్‌ సింగ్‌ నిర్ణయంతో పంజాబ్‌ రాజకీయాలు ఒక్కసారిగా వేడేక్కాయి.

2017 ఫలితాలు పునరావృతమా
మొత్తం 117 అసెంబ్లీ స్థానాలు ఉన్న పంజాబ్ రాష్ట్రంలో 2017 లో జరిగిన ఎన్నికల్లో శిరోమని అకాళీధల్ పార్టీపై కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించింది. ఎన్నికల్లో 117 స్థానాలు గాను 77 స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ విజయకేతనం ఎగురవేసింది. కెప్టెన్ అమరేంద్ర సింగ్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. ఈ ఎన్నికల్లో కూడా ప్రశాంత్ కిషోర్ కాంగ్రెస్ పార్టీ సలహాదారునిగా పనిచేయడం విశేషం. 2022 లో జరిగే ఎన్నికల్లో వంద స్థానాలు సాధించాలని కాంగ్రెస్ పార్టీ లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలుస్తోంది. అందుకనే ఏడాది ముందుగానే ఎన్నికల వ్యూహ కర్త ప్రశాంత్ కిషోర్ రంగంలోకి దింపినట్లు రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. మరోపక్క శిరోమని అకాలీదళ్ పార్టీ ఈ ఎన్నికల్లో విజయం సాధించాలని చూస్తుంది.

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp