iDreamPost
android-app
ios-app

అనుభవం అంటే ఎగ్గొట్టేయడమా.. !

  • Published Jun 07, 2020 | 9:13 AM Updated Updated Jun 07, 2020 | 9:13 AM
అనుభవం అంటే ఎగ్గొట్టేయడమా.. !

సమర్ధవంతమైన నిర్వాహకుడు ఉంటే ప్రభుత్వమైనా మరే ఇతర సంస్థ అయినా అంతే సమర్ధవంతంగా పనిచేస్తుంది. ఇక్కడ నిధులు, విధుల సమస్య కాదు. నిర్వాహకుడి సమర్ధతే ముఖ్యం. ఈ విషయం యువ సీయం వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డిని చూస్తే అర్ధమవుతుంది. నేను విన్నాను.. నేను ఉన్నాను అనే నినాదంతో ప్రజల మెప్పు పొంది పీఠమెక్కిన మొదటి రోజు నుంచే ప్రజలకు చేయాల్సిన పనులపై దృష్టి పెట్టా పాలనలో తనదైన శైలిని సృష్టించుకున్నారు. దీంతో దేశ వ్యాప్తంగా అత్యుత్తమ సీయంలు నలుగురిలో ఒకరిగా నిలబడగలిగారు. తాను చెప్పింది, చెప్పనదీ కూడా చేస్తూ ప్రజలిచ్చిన బాధ్యతకు జవాబుదారీగా నిలుస్తున్నారు.

అయితే ప్రతిపక్షానికి చేరుకున్నాయన, నాకున్న అనుభవం ముందు మీరెంత అంటూ లేనిమీసాలు మెలితిప్పుతుంటే.. కాస్తంత అవగాహన ఉన్నవాళ్ళు ముక్కున వేలేసుకుంటున్నారు. చంద్రబాబు నాయుడు సీయంగా ఉన్నప్పుడు ఇస్తానని సొమ్ములు ఎగ్గొట్టడాన్ని ఇక్కడ ప్రస్తావిస్తున్నారు. రాష్ట్రంలో వివిధ రకాల అభివృద్ధి పనుల్లో భాగస్వాములైన కాంట్రాక్టర్లుకు దాదాపు 45వేల కోట్లకుపైగానే గత ప్రభుత్వం చెల్లించాల్సి ఉంది. అలాగే డిస్కమ్‌లకు 30వేల కోట్లతో ప్రారంభిస్తే ఒకటి కాదు రెండు కాగా దాదాపు ప్రతి ప్రభుత్వ శాఖలోనూ పెండింగ్‌ బిల్లులు కోట్లలోనే ఉండిపోయినట్లుగా తెలుస్తోంది.

ప్రభుత్వాలు మారుతుంటాయి.. కొత్తగా వచ్చిన ప్రభుత్వాలు బాధ్యత వహించాలి అని అనుకోవడానికి కూడా ఇక్కడ అవకాశం లేదు. ఎందుకంటే ఐదేళ్ళ పదవీ కాలం పూర్తయిన తరువాత ప్రజలు ఎవరికి అవకాశం ఇస్తారో తెలియనప్పుడు ఇన్నేసి కోట్లు బకాయిల రూపంలో ఎలా వదిలేస్తారు? అన్నదానికి ఇప్పుడు 42 ఇయర్స్‌ అండ్‌ కో సమాధానం చెప్పుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

ఒక వేళ ఇదంతా మామూలే అనుకోమంటారా? అయితే పదేపదే చెప్పుకునే అనుభవం ఇదేనా? అంటూ ప్రశ్నించే వారికైనా సూటిగా సమాధానం చెప్పాల్సిందే.

ఒకవైపు సంక్షేమ పథకాలను అమలు చేస్తూనే జగన్‌ ప్రభుత్వం చెల్లించిన బకాయిలను చూస్తే చంద్రబాబు ప్రభుత్వం చేసిన అప్పులకు వడ్డ 20వేల కోట్లు, డిస్కమ్‌లకు సుమారు 7వేల కోట్లు, ఫీజు రీ ఎంబార్స్‌మెంట్‌ బకాయిలు 1800 కోట్లు, కాంట్రాక్టర్లకు 25వేల కోట్లు ఇప్పటికే చెల్లించడం జరిగింది. త్వరలోనే గత ప్రభుత్వం వదిలేసిన గృహ నిర్మాణ లబ్దిదారులకు 1300 కోట్లు చెల్లించేందుకు ఏర్పాట్లు చేయాల్సిందిగా జగన్‌ ఇప్పటికే ఆదేశాలు జారీ చేసారు. ఇక్కడ సూటిగా అడిగే ప్రశ్న ఒక్కటే అనుభవం అంటే ఎగ్గొట్టేయడమా?