తూర్పు కనుమలలో గోదావరికి ఇరువైపులా ఛామనఛాయ రూపం కొంచెం పొడవు, కొనతేలిన ముక్కు, చిరు గడ్డం, ముడివేసిన పొడవైన జుట్టు, చిన్న గోచి #అడ్డ పంచె లతో కనిపించే పురుషులు, మెడకు రకరకాల పూసల పేర్లు, నాసికారంధ్రాల మధ్య నత్తులను ధరించిన మహిళలు, “కొండరెడ్డి” తెగకు చెందిన గిరిజనులు.
కొండరెడ్లు ఎక్కువగా ఖమ్మం , తూర్పుగోదావరి జిల్లాలోని అడవులపై కొండలపై నివాసం ఉంటారు. తూర్పు గోదావరి జిల్లాలోని(రాష్ట్ర విభజనకు ముందు ఖమ్మం జిల్లాలో) గబ్బిలాల గొంది, తోట మామిడి, వసుమామిడి, కింది పాకాల, వెలుగులగొంది తదితర గ్రామాల్లో కొండరెడ్లు అధికంగా నివసిస్తారు. ఈ గ్రామాలన్నీ ప్రధాన రహదారి నుండి ఐదు లేక ఆరు కిలోమీటర్లు అడవి లోపలికి ఉంటాయి.
కొండరెడ్ల జీవనాధారం పోడు వ్యవసాయం, అటవీ ఉత్పత్తుల సేకరణ, వెదురుతో చేసిన వస్తువుల అమ్మకం.. కొండరెడ్లలో చదువుకున్న వారి సంఖ్య తక్కువ. గబ్బిలాలగొంది నుంచి విద్యార్థులు రెండు వాగులు దాటి, మూడు కిలోమీటర్లు నడిచి భగవాన్ పురం గ్రామంలోని స్కూల్ కు వెళ్ళాలి. వర్షాకాలంలో వాగులు పొంగటం వలన విద్యార్థులకు అప్రకటిత సెలవులు ఎక్కువ.
మరోవైపు వైద్య సదుపాయాలు తక్కువే. కనీసం 10 నుండి 15 కిలోమీటర్లు కొండలు గుట్టలు దాటి చింతూరు, కూనవరం లాంటి ఊళ్లకు రావాల్సి ఉంది. కొండరెడ్ల గ్రామాలలో కరెంట్ సదుపాయం లేదు. సోలార్ మీదనే ఆధారపడి ఉంటారు.
క్లిష్టమైన భౌగోళిక పరిస్థితుల వల్ల ప్రభుత్వ పథకాలు వీరికి చేరేది తక్కువే. చింతూరు ITDA మరియు ఏటిపాక RDO అయిన రమణ ఆకుల కొండ బాట పేరుతొ ప్రతినెలా రెండుసార్లు ఈ కొండరెడ్డి గ్రామాలను సందర్శించి, ప్రత్యేక శ్రద్ధతో ప్రభుత్వ పథకాల అమలుతో పాటు కొన్ని అదనపు సదుపాయాలు కల్పిస్తున్నారు.. వీటిలో ముఖ్యమైనవి
1) పోడు భూముల పట్టాలకై సర్వే మొదలైంది
2) గుట్ట మీద వున్న PVTG(Particularly vulnerable tribal group) నివాసాలకు దగ్గరలోని వాగు నుండి సోలార్ మోటార్ ద్వారా నీరు ఇవ్వటం
3) ప్రతీ ఇంటికి ఒక సోలార్ లాంతర్ ఇవ్వటం జరిగింది
4) 10వ తరగతి చదువు ఆపేసిన వారిని గుర్తించి పరీక్ష సన్నద్ధత కై శిక్షణ
5) High risk pregnant women – ముందే గుర్తించి గుట్ట కింద గల వారి బంధువుల ఇళ్లు / ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ప్రత్యేక వార్డులో వుంచడం. కాన్పుకు ముందు,తర్వాత రెండు మూడు నెలల కాలానికి వారు కోల్పోయిన కూలికి ఆర్థిక సాయం చేయడం.
6) మేకలు పంపిణీ
7) గౌతమి నేత్రాలయం, రాజమండ్రి వారిచే ఉచిత నేత్ర శిబిరం నిర్వహించడం జరిగింది. దాదాపుగా 180 మందిని పరిక్షించగా 79 మందికి దృష్టి లోపం ఉన్నట్లు గుర్తించడం జరిగింది. వీరికి ఉచిత కళ్ళద్దాలు ఇవ్వడం జరుగును. మరో 10 మందికి కంటి ఆపరేషన్లు 4 వారాల్లో ఉచితంగా నిర్వహించబడును.
8) పునరావాసానికి సిద్ధంగా ఉన్న PVTG(Particularly vulnerable tribal group) కుటుంబాలకు ఉచిత ఇళ్ళు, భూమి ఇవ్వడం జరుగును.
9) ప్రతీ ఒక్కరికీ రేషన్ కార్డు, ఆధార్ కార్డు మరియు అర్హులందరికీ పెన్షన్
10) వయోజన విద్య మరియు వారం వారం జరిగే కుటూర్ సంతలో జరిగే ఆర్థిక లావాదేవీలపై లఘు శిక్షణ.
కొండరెడ్లు , ఇతర గిరిజన తెగల అభివృద్ధికి రమణ ఆకుల లాంటి ఉత్సాహవంతమైన అధికారులు చేపడుతున్న కార్యక్రమాలు వారికి ఎంతో చేయూతనిస్తాయి. ఈ తెగల నుంచి కూడా ఎక్కువ మంది చదువుకుని అభివృద్ధి చెందాలి.
4451