iDreamPost
iDreamPost
పార్టీ మారేందుకు రెండేళ్ల క్రితం భారతీయ జనతాపార్టీ తనకు డబ్బులు ఆఫర్ చేసిందని.. నిన్న మొన్నటి వరకు యడ్యూరప్ప ప్రభుత్వంలో మంత్రిగా పనిచేసిన ఓ ఎమ్మెల్యే చేసిన వ్యాఖ్యలు కర్ణాటక రాజకీయాల్లో దుమారం రేపుతున్నాయి. 2019లో కర్ణాటకలో జరిగిన రాజకీయ పరిణామాలు, కుమారస్వామి ప్రభుత్వం పతనం, యడ్యూరప్ప నేతృత్వంలో బీజేపీ ప్రభుత్వం అధికారం చేజిక్కించుకోవడం వెనుక ప్రలోభాలు కీలక పాత్ర పోషించాయన్న నాటి ఆరోపణలకు సదరు ఎమ్మెల్యే శ్రీమంత్ బాలాసాహెబ్ పాటిల్ వ్యాఖ్యలు జీవం పోశాయి. వీటి ఆధారంగా కాంగ్రెస్, జేడీఎస్ లు బీజేపీపై విరుచుకు పడుతున్నాయి. రెండేళ్లనాటి ఎమ్మెల్యేల కొనుగోళ్లపై విచారణకు డిమాండ్ చేస్తున్నాయి. దాంతో కర్ణాటక రాజకీయాలు మరోమారు వేడెక్కాయి.
ఆనాడు ఏం జరిగింది
2018 మే నెలలో కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి. అప్పటివరకు అధికారంలో ఉన్న కాంగ్రెస్ మళ్లీ ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైనన్ని సీట్లు గెలుచుకోవడంలో విఫలమైంది. 224 మంది సభ్యులున్న అసెంబ్లీలో ప్రభుత్వం ఏర్పాటు 113 మంది ఎమ్మెల్యేలు బలం అవసరం. కానీ కాంగ్రెస్ 80 స్థానాల్లోనే గెలవగలిగింది. బీజేపీ 104 స్థానాలతో ఏకైక అతిపెద్ద పార్టీగా అవతరించినా.. మెజారిటీకి 9 సీట్ల దూరంలో ఉండిపోయింది. మరోవైపు జేడీఎస్ 37 సీట్లతో కింగ్ మేకర్ గా మారింది. ఏ పార్టీకి మెజారిటీ లేని పరిస్థితుల్లో కాంగ్రెస్, జేడీఎస్ చేతులు కలిపాయి.. రెండింటి ఉమ్మడి బలం 117 అయ్యింది. దాంతో కుమారస్వామి సీఎంగా సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటైంది.
Also Read:కాంగ్రెస్ లో చక్రం తిప్పిన మాజీ మంత్రి ఆస్కార్ ఫెర్నాండెజ్ కన్నుమూత
ఎక్కువ సీట్లు గెలుచుకున్నా అధికారం చేజిక్కించుకోలేక పోయిన బీజేపీ ప్రతిపక్షంలోనే ఉంటూ సంకీర్ణ ప్రభుత్వాన్ని కులదోసేందుకు కుట్రలు పన్నిందన్న ఆరోపణలు ఉన్నాయి. అందుకు తగినట్లే 2019 జూలైలో కాంగ్రెస్, జేడీఎస్ పార్టీలకు చెందిన 16 మంది ఎమ్మెల్యేలు మూకుమ్మడిగా బీజేపీలో చేరిపోయారు. దాంతో కుమారస్వామి ప్రభుత్వం మైనారిటీలో పడి చివరికి కూలిపోయింది. ఆ వెంటనే యడ్యూరప్ప నేతృత్వంలో బీజేపీ పాలన పగ్గాలు చేపట్టింది.
అప్పట్లోనే ఆరోపణల దుమారం
పదవులు, డబ్బు ఎరా వేసి బీజేపీ తమ ఎమ్మెల్యేలను ప్రలోభాలతో లోబరుచు కుందని కాంగ్రెస్, జేడీఎస్ తీవ్రంగా ఆరోపించాయి. విచారణకు డిమాండ్ చేశాయి. సీఎం యడ్యూరప్ప సైతం ఎమ్మెల్యేల కొనుగోళ్లను పరోక్షంగా ధృవీకరించారు. సీఎంగా ప్రమాణం చేసిన అనంతరం ఆయన మాట్లాడుతూ తమ పార్టీలో చేరిన కాంగ్రెస్, జేడీఎస్ ఎమ్మెల్యేలకు ఇచ్చిన హామీలను తప్పనిసరిగా నెరవేరుస్తామని చెప్పారు. ఆ మేరకు కాంగ్రెస్ నుంచి ఫిరాయించిన కగ్వాడ్ ఎమ్మెల్యే శ్రీమంత్ బాలసాహెబ్ పాటిల్ కు యడ్డీ కేబినెట్లో మంత్రిగా చేర్చుకున్నారు కూడా. అయితే మొన్న జూలైలో యడ్డీ రాజీనామా అనంతరం ఏర్పడిన బొమ్మై కేబినెట్లో పాటిల్ చోటు దక్కలేదు. దాంతో ఆయన ఇప్పుడు బయటపడ్డారు.
Also Read: నక్సలైట్లు మాజీ ఎమ్మెల్యే బుడ్డా వెంగళ రెడ్డిని ఎందుకు చంపారు?
తాజాగా బాలసాహెబ్ పాటిల్ విలేకరులతో మాట్లాడుతూ 2019లో పార్టీ మారేందుకు తమకు బీజేపీ డబ్బు ఆఫర్ చేసిందని బాంబు పేల్చారు. అయితే తాను డబ్బు తిరస్కరించానని, ప్రజాసేవ కోసం మంత్రి పదవి కోరానని చెప్పుకొచ్చారు. పాటిల్ వ్యాఖ్యలతో కాంగ్రెస్, జేడీఎస్ నేతలు బీజేపీపై నిప్పులు చెరుగుతున్నారు. ఆనాటి ఎమ్మెల్యేల పార్టీ ఫిరాయింపులు, ప్రలోభాలపై సీబీఐ దర్యాప్తు జరిపించాలని కర్ణాటక పీసీసీ అధ్యక్షుడు డి.కె.శివకుమార్, అధికార ప్రతినిధి బ్రిజేష్ కాలప్ప డిమాండ్ చేశారు. సోమవారం ప్రారంభమైన అసెంబ్లీ సమావేశాల్లో ఈ అంశం ప్రస్తావించేందుకు సిద్ధం అవుతున్నారు.