నక్సలైట్లు మాజీ ఎమ్మెల్యే బుడ్డా వెంగళ రెడ్డిని ఎందుకు చంపారు?

By Krishna G Sep. 12, 2021, 10:40 pm IST
నక్సలైట్లు మాజీ ఎమ్మెల్యే బుడ్డా వెంగళ రెడ్డిని ఎందుకు చంపారు?

బుడ్డా వెంగళరెడ్డి పేరు వింటేనే శిఖరాయ మానవధాన్యత రూపు కడుతుంది.రాయలసీమను ఆకలి చావుల ప్రాంతంగా చేసిన డొక్కల (దాత)కరువు .... పిడికెడు మెతుకులకోసం పరుగులు తీసే ఆరోజుల్లో ప్రతి రోజు 20 వేలమందికి అన్నదానం చేసిన బుడ్డా వెంగళ రెడ్డి వధాన్యతకు అచ్చెరువొందిన విక్టోరియా మహారాణి స్వర్ణకంకణం తో సత్కరించింది.

ఇదంతా 1890 నాటి ముచ్చట. అయితే 1983 లో టిడిపి ఎమ్మెల్యేగా గెలిచి రాయలసీమలో మరో బుడ్డా వెంగళ రెడ్డి మెరిశాడు.నాటి దాత బుడ్డాకు నేటి రాజకీయనేత బుడ్డాకు మద్య ఉన్న సంభంధం ఏమిటన్నది ఆసక్తి కలిగించే అంశమే....

దాత బుడ్డావెంగళరెడ్డికి నల్లారెడ్డి అనే తమ్ముడు మరో చెల్లెలు ఉండేది.ఆమెను వెలుగోడు మండలం రేగడగూడూరు గ్రామానికి చెందిన దుబ్బా వారి ఇంటి వ్యక్తితో వివాహం జరిపించారు.అయితే దుబ్బావారు ఆర్థికంగా అంతగా ఉన్నవారు కాకపోవడంతో తన చెల్లెలు కష్టాలు చూడలేని దాత వెంగళరెడ్డి తనబావను చెల్లెలును తన స్వగ్రామం అయిన ఉయ్యాలవాడకు పిలిపించుకుని తన ఆస్తిలో భాగం ఇవ్వాలనుకుంటాడు. అయితే తమ్ముడు నల్లారెడ్డి అభ్యంతర పెట్టడంతో బుడ్డా వంశీయుడైన మరో వ్యక్తి దాత బుడ్డా మాటకు వెలితి రాకూడదని తన ఆస్తి ఇస్తాడు. దీనితో దుబ్బా వారు కాస్త బుడ్డా వారయ్యారు. ఆ వంశంలోని వాడే మూడు సార్లు కర్నూలు జిల్లా ఆత్మకూరు ఎమ్మెల్యే గా ఒకసారి కరువు మంత్రిగా పని చేసిన బుడ్డా వెంగళ రెడ్డి.

కరిగి పోతున్న భూస్వామ్య వ్యవస్థకు ఆఖరి వరస లోని వాడే ఈ బుడ్డా వెంగళ రెడ్డి.ఎమ్మెల్యేగానే కాదు రాజకీయంతో కూడా ఈయన పేరు రాష్ట్ర వ్యాప్తంగా మారు మోగింది. ఉయ్యాలవాడకు చెందిన బుడ్డా వెంగళ రెడ్డి తండ్రి చిన్న సీతారామిరెడ్డికి వెలుగోడు మండలం వేల్పనూరుకు చెందిన కడియాల శేషిరెడ్డి చిన్న కుమార్తె శేషమ్మతో వివాహం జరగడంతో ఆయన ఇల్లరికం వెళ్ళాడు.ఆయనకు సత్యనారాయణ రెడ్డి,వెంగళ రెడ్డి రామ్మోహన్ రెడ్డితో పాటు మరో ముగ్గురుకుమార్తెలు కలిగారు.

వెంగళ రెడ్డి ఉయ్యాలవాడలోనే తన పెదనాన్న పెద్ద సీతారామిరెడ్డి ఇంటోనే ఉంటూ అక్కడే స్కూల్ ఫైనల్ వరకు చదువుకున్నారు. ఉయ్యాల వాడను ఆనుకుని ఉన్న రూపనగుడికి చెందిన ఓబులమ్మను ప్రేమించి పెద్దల ఆశీర్వాదంతో పెళ్లి చేసుకున్నారు.వీరి కుమారులైన సీతారామిరెడ్డి, రాజశేఖరరెడ్డి లు ఎమ్మెల్యేలుగా పని చేయగా మరో కుమారుడు శేషిరెడ్డి మండల అధ్యక్షులుగా పని చేశారు.ప్రజారాజ్యం టికెట్ పై ఎమ్మెల్యేగా పోటీ చేశారు.

నిరంతర పోరాటంతో అగ్రస్థాయికి .... చిన్న పొరపాటుకు అధ: పాతాళానికి :
గ్రామంలో చిన్నస్థాయి నాయకుడినుంచి ఎమ్మెల్యే స్థాయికి ఎదగడానికి బుడ్డా వెంగళ రెడ్డి ఎందరితోనో పోరాటాలు చేయాల్సి వచ్చింది.అవి వీధి పోరాటాలనుంచి రాజకీయ ఎత్తుగడల వరకు ఉన్నాయి.బైరెడ్డి శేషశయణారెడ్డికి అనుచరుడిగా ఉన్న బుడ్డా వెంగళరెడ్డి తన స్వగ్రామమైన వేల్పనూరులో కాతారఘుస్వామి రెడ్డి(కాతా కేదారనాథ్ రెడ్డి తండ్రి)తో తల పడి గ్రామాధిపత్యం సాధించారు.ఆ సమయంలో ఇరువర్గాల మధ్య బాంబు దాడులు ,హత్యలు జరిగాయి.ఇదే బుడ్డాకు ప్యాక్ష్యన్ రంగు అద్దింది.

తెలుగుదేశం ఆవిర్భావంలో ఎన్టీఆర్ ను కలసిన బుడ్డాకు తన కుటుంభం నేపథ్యమే ఆత్మకూరు సీటు కట్టబెట్టబడింది.1988 చివరిలో టీడీపీని వీడి జానా రెడ్డి,కేఈ,వసంత నాగేశ్వర రావ్ పెట్టిన తెలుగునాడు పార్టీతో కొన్ని నెలలు ఉన్నా మొత్తం మీద తెలుగు దేశం పార్టీలో రెండు సార్లు, కాంగ్రెస్ లో ఓ మారు ఎమ్మెల్యేగా గెలిచారు.

ప్రభుత్వ సారా వేలాల లో వెంగళ రెడ్డి అనుచరుల మధ్య వచ్చిన అభిప్రాయం భేదాలతో ఆత్మకూరు మేజర్ గ్రామ పంచాయతిని 30 ఏళ్లుగా ఏకఛత్రాధిపత్యంగా ఏలుతున్న హుస్సేన్ సాహెబ్ హత్య జరగడంతో బుడ్డా వెంగళ రెడ్డి రాజకీయ జీవితానికి పతనం మొదలైంది.నియోజకవర్గంలో ప్రధాన పట్టణాలైన ఆత్మకూరు, వెలుగోడు, సున్నిపెంటలు మెజారిటీ ముస్లిం జనాభా ఉండడంతో వారి వ్యతిరేకత కారణంగా టీడీపీ తరుపున పోటీచేసి కూడా 1994 ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి ఏరాసు ప్రతాపరెడ్డి చేతుల్లో ఓడిపోయారు.ఆ ఎన్నికల్లో కాంగ్రెస్ కు 26 సీట్లు మాత్రమే రావటం గమనార్హం.

పీపుల్స్ వార్ తో ఘర్షణలు - వేంపెంట మరణ హోమం

అప్పటికే నియోజకవర్గంలో పీపుల్స్ వార్ కార్యకలాపాలు విస్తృతమయ్యాయి.ఆ పార్టీ బుడ్డా ను ప్రజావ్యతిరేకిగా ప్రకటించింది.ఈ క్రమంలో ఆత్మకూరు నియోజకవర్గంలో వేంపెంట గ్రామంలో పీపుల్స్ వార్ రైతుకూలి సంఘానికి గ్రామ పెత్తందార్లకు నడుమ వర్గ పోరాటం తీవ్ర తరమైంది.ఈ తీవ్రతలో అక్కడ కాంగ్రెస్,టిడిపి రాజకీయ పార్టీలు కనుమరుగు అయ్యి వర్గాలు మాత్రమే మిగిలాయి. ఈ సంక్షోభాన్ని తన రాజకీయ ఉత్తానానికి వాడుకునేందుకు బుడ్డా వెంగళరెడ్డి ఆలోచన చేసుకున్నాడు.

పీపుల్స్ వార్ నక్సలైట్లకు వ్యతిరేకంగా వేంపెంట గ్రామంలో ఉన్న భూస్వామ్య వర్గాలకు బుడ్డా మద్దతు ఇచ్చాడు .ఈ దశలో ఓ సందర్భంలో విలేకరుల సమావేశంలో రాష్ట్రములో ఏ రాజకీయ నాయకుడు మాట్లాడని విధంగా తాను పట్టించుకోనందుకే పీపుల్స్ వార్ నక్సలైట్లు నల్లమలలో తిరగలుగుతున్నారని తాను తలుచుకుంటే ఒక్క అడుగు కూడా నడవలేరని భారీ ప్రకటన చేశాడు.

ఇది పీపుల్స్ వార్ నక్సలైట్లకు రెచ్చగొట్టినట్లయిందన్న భావన అప్పట్లో చాలామంది లో ఉంది.అదే సందర్భంలోనే వేంపెంట గ్రామ టిడిపి నాయకుడు బుడ్డా శిష్యుడు అయిన గాండ్ల శివయ్యను పీపుల్స్ వార్ నక్సలైట్లు గ్రామములోనే కాల్చి చంపారు.ఇందుకు ప్రతీకారంగా శివయ్య అనుచరులు 9 మందిని చంపి వేశారు.వీరిలో కొందరిని సజీవ దహనం చేశారు . చనిపోయిన వారిలో ముగ్గురు మహిళలు కూడా ఉన్నారు.ఇది అప్పట్లో రాష్ట్రవ్యాప్తంగా సంచలనమైంది.

ఈ మారణ హోమానికి బుడ్డా వెంగళరెడ్డి కారణమని భావించిన నక్సలైట్లు పోలీసు వేశాలల్లో వచ్చి ఆయనను ఆత్మకూరులో కాల్చి చంపారు.ఈ సంఘటనలు మరో ఇద్దరు ఆయన అనుచరులు కాల్పుల్లో మరణించారు.1999 ఎన్నికలకు సిద్ధమవుతూ బుడ్డా తన కార్యకర్తలతో మాట్లాడుతున్న సందర్భంలో ఈ సంఘటన జరిగింది.5 నిముషాల్లో జరిగిన ఈ మెరుపు దాడి కూడా రాష్ట్రవ్యాప్త సంచలనంగా మారింది.

వారసుల రంగ ప్రవేశం

ఈ ఘటన తరువాత నియోజక వర్గంలో ఏర్పడిన ప్రత్యేక పరిస్థితి బుడ్డా వెంగళ రెడ్డి పెద్ద కుమారుడు బుడ్డా సీతారామిరెడ్డిని ఎమ్మెల్యేగా గెలవడానికి కారణమయ్యింది.ఆతరువాత 2004 ఎన్నికల్లో బుడ్డా వెంగళ రెడ్డి రెండో కోడలు శైలజ ఏరాసు ప్రతాప్ రెడ్డి చేతిలో ఓటమి చెందగా 2009లో బుడ్డా రెండో కుమారుడు రాజశేఖరరెడ్డి ఏరాసు చేతిలో ఓడిపోయాడు.

2014 లో వైఎస్సార్ సిపిలో చేరిన బుడ్డారాజశేఖర రెడ్డి సుదీర్ఘ ఓటముల తరువాత టిడిపి అభ్యర్థి శిల్ప చక్రపాణిని ఓడించి గెలుపు కైవసం చేసుకున్నారు.గెలిచిన ఏడాదికే పార్టీ మారడం ద్వారా బుడ్డారాజ శేఖర్ రెడ్డి రాజకీయ ఆత్మహత్యకు పాల్పడ్డాడు.2019 ఎన్నికల్లో టిడిపి నుంచిపోటీ చేసి 40000 పైచిలుకు తేడాతో వైసిపి అభ్యర్థి శిల్పా చక్రపాణి చేతిలో ఓడిపోయాడు.ఇలా తిరుగులేని రాజకీయ ప్రాభవం స్థాపించిన బుడ్డా వెంగళ రెడ్డి ప్రాభవాన్ని కుమారులు నిలపలేకపోయారు.

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp