మాజీ మంత్రి ఆస్కార్ ఫెర్నాండెజ్ కన్నుమూత

By Raju VS Sep. 13, 2021, 04:05 pm IST
మాజీ మంత్రి ఆస్కార్ ఫెర్నాండెజ్ కన్నుమూత

సుదీర్ఘకాలం పాటు పార్లమెంట్ సభ్యుడిగా ఉన్న సీనియర్ కాంగ్రెస్ నేత ఆస్కార్ ఫెర్నాండెజ్ కన్నుమూశారు. మంగుళూరులోని ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆయన సోమవారం మధ్యాహ్నం మరణించారు. 80 ఏళ్ల ఆస్కార్ ఫెర్నాండెజ్ ఇందిరాగాంధీ కుటుంబానికి అత్యంత సన్నిహితుడు, రాజీవ్ గాంధీ నుంచి రాహుల్ గాంధీ వరకూ కాంగ్రెస్ లో ఆ కుటుంబానికి అత్యంత చేరువగా మెలిగేవారు. సోనియా కి సలహాలిచ్చే బృందంలో ఒకరిగా ఆస్కార్ ఫెర్నాండెజ్ ఉండేవారు.

ఆయన 1980 లో తొలిసారిగా పార్లమెంట్ కి ఎన్నికయ్యారు. ఆ తర్వాత రాజీవ్ గాంధీకి పార్లమెంటరీ కార్యదర్శిగా ఉన్నారు. 1998 ఎన్నికల్లో ఉడిపి పార్లమెంట్ స్థానం నుంచి ఓటమి తర్వాత రాజ్యసభ సభ్యుడిగా అవకాశం దక్కించుకున్నారు. ఆనాటి నుంచి మరణించే వరకూ ఆయన రాజ్యసభలో సభ్యుడిగా కొనసాగారు. రెండు నెలలుగా తీవ్ర అనారోగ్య సమస్యలతో ఆస్పత్రి పాలయ్యారు. కర్ణాటకకి చెందిన ఆయన మంగళూరులో ఉన్న ఎనెపోయా ఆస్పత్రిలో చికిత్స పొందారు. డయాలసిస్ చేస్తుండగా ఆయన మరణించినట్టు ఆస్పత్రి వర్గాలు వెల్లడించాయి.

Also Read: ప్రియాంక గాంధీ 12 వేల కిలోమీటర్ల పాదయాత్ర

ఆస్కార్ ఫెర్నాండెజ్ 1941 మార్చి 27న జన్మించారు. కర్ణాటకలోని ఉడుపిలో ఉన్న బోర్డ్ హైస్కూల్లో ఆయన తండ్రి రోక్ ఫెర్నాండెజ్ ప్రధానోపాధ్యాయులుగా పనిచేశారు. ఆయన తల్లి లియోనిసా ఫెర్నాండెజ్ మేజిస్ట్రేట్ గా విధులు నిర్వహించారు. తొలుత కొంతకాలం పాటు ఎల్ఐసీలో పనిచేసిన అస్కార్ ఆ తర్వాత మణిపాల్‌లో వ్యాపారం చేశారు. కొంతకాలం వ్యవసాయం కూడా చేశారు. ఉత్తమ వరి ఉత్పత్తిదారుడి అవార్డు కూడా అందుకున్నారు. సామాజిక సేవా కార్యక్రమాల్లో పాల్గొన్న ఆస్కార్ ఆ తర్వాత రాజకీయాల వైపు మళ్లారు.

కాంగ్రెస్ లో ఆయన అంచలెంచలుగా ఎదిగారు. అనేక కీలక సందర్భాల్లో గాంధీ కుటుంబం తీసుకున్న నిర్ణయాల్లో ముఖ్యభూమిక పోషించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజన విషయంలోనూ ఆయన అప్పట్లో సోనియా సలహాదారుడిగా కీలకంగా వ్యవహరించారు. ఆయనకు శరీరం సహకరించినంత వరకూ ఆ కుటుంబ విధేయుడిగా రాజకీయాల్లో వివిధ హోదాలు దక్కించుకున్నారు. సుమారు 40 ఏళ్లు ఎంపీగా ఉండడం విశేషమే. అదే సమయంలో యూపీఏ హయంలో కీలక మంత్రిత్వ శాఖలు నిర్వహించారు. ఆస్కార్ ఫెర్నాండెజ్ మరణం పట్ల సీనియర్ కాంగ్రెస్ నేతలు సంతాపం వ్యక్తం చేశారు.

Also Read: తెనాలిని ఆంధ్రా ప్యారిస్ అని ఎందుకు అంటారు..?

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp