iDreamPost
android-app
ios-app

DRDO ప‌రిశోధ‌న‌ కేంద్రం

DRDO ప‌రిశోధ‌న‌ కేంద్రం

చిత్తూరు జిల్లా శ్రీ‌కాళ‌హ‌స్తిలో ప్ర‌భుత్వం వంద ఎక‌రాలు కేటాయిస్తే భార‌త ర‌క్ష‌ణ ప‌రిశోధ‌న‌, అభివృద్ధి సంస్థ (డీఆర్‌డీఓ)కు అనుబంధంగా ప‌రిశోధ‌న కేంద్రం ఏర్పాటు చేస్తామ‌ని ఆ సంస్థ చైర్మ‌న్ జి.స‌తీష్‌రెడ్డి తెలిపారు. చిత్తూరు జిల్లా ప‌ర్య‌ట‌న‌లో ఉన్న ఆయ‌న ఆదివారం శ్రీ‌కాళ‌హ‌స్తికి వెళ్లారు.ముక్కంటీశుడి ద‌ర్శ‌నానికి వెళ్లిన స‌తీష్‌రెడ్డిని స్థానిక ఎమ్మెల్యే బియ్య‌పు మ‌ధుసూద‌న్‌రెడ్డి మ‌ర్యాద‌పూర్వ‌కంగా క‌లిశారు. త‌న నియోజ‌క‌వ‌ర్గంలో ప‌రిశ్ర‌మ‌ల ఏర్పాటుకు ప‌రిశీలించాల‌ని స‌తీష్‌రెడ్డికి ఎమ్మెల్యే విన‌తిప‌త్రం అంద‌జేశారు. ఎమ్మెల్యే విన‌తిపై ఆయ‌న సానుకూలంగా స్పందించారు.

ప్ర‌భుత్వం వంద ఎక‌రాల‌న భూమిని స‌మ‌కూర్చితే డీఆర్‌డీఓకు అనుబంధంగా ప‌రిశోధ‌న కేంద్రం ఏర్పాటుకు కృషి చేస్తామ‌ని హామీ ఇచ్చారు. భూకేటాయింపు విష‌య‌మై సీఎం వైఎస్ జ‌గ‌న్ దృష్టికి తీసుకెళుతాన‌ని ఎమ్మెల్యే చెప్పారు. అలాగే త‌న నియోజ‌క‌వ‌ర్గంలో ప‌రిశ్ర‌మ‌ల అభివృద్ధికి అన్ని ర‌కాలుగా అవ‌కాశాలున్నాయ‌ని స‌తీష్‌రెడ్డి దృష్టికి తీసుకెళ్లారు. తిరుప‌తి విమానాశ్ర‌యం త‌న నియోజ‌క‌వ‌ర్గ ప‌రిధిలోనే ఉంద‌న్న విష‌యాన్ని గుర్తు చేశారు. ఇప్ప‌టికే తిరుప‌తి విమానాశ్ర‌యం చుట్టూ అనేక ప‌రిశ్ర‌మ‌లు వ‌చ్చాయ‌న్నారు.

తెలుగువాడిగా, పొరుగు జిల్లాకే చెందిన వ్య‌క్తిగా త‌న నియోజ‌క‌వ‌ర్గం అభివృద్ధికి స‌హాయ‌స‌హ‌కారాలు అందించాల‌ని స‌తీష్‌రెడ్డిని ఎమ్మెల్యే కోరారు. చిత్తూరు జిల్లా అభివృద్ధికి సీఎం జ‌గ‌న్ క‌ట్టుబ‌డి ఉన్నార‌ని, ఒక ప్ర‌ణాళిక‌తో తాను వెళ్లాల‌నుకుంటున్న‌ట్టు ఆయ‌న తెలిపారు. నియోజ‌క‌వ‌ర్గ అభివృద్ధికి కేంద్ర సాయాన్ని అందించేలా  చొర‌వ చూపాల‌ని స‌తీష్‌రెడ్డి వెంట ఉన్న బీజేపీ నేత భానుప్ర‌కాష్‌రెడ్డిని కూడా ఎమ్మెల్యే కోరారు. ఇందుకు ఆయ‌న సానుకూలంగా స్పందించారు.  కాగా స‌తీష్‌రెడ్డి నెల్లూరు జిల్లా నివాసి. దేశ అత్యున్న‌త ప‌ద‌విలో ఆయ‌న కొన‌సాగుతున్నారు.