iDreamPost
android-app
ios-app

జగన్ సక్సెస్ సీక్రేట్ అదే, చంద్రబాబుకి సాధ్యం కానిది కూడా

  • Published Feb 23, 2021 | 1:45 PM Updated Updated Feb 23, 2021 | 1:45 PM
జగన్ సక్సెస్ సీక్రేట్ అదే, చంద్రబాబుకి సాధ్యం కానిది కూడా

ఏ కార్యక్రమం అయినా అనుచరులను ఆకట్టుకుంటే అదేమీ పెద్ద విశేషం కాదు. అందులో పెద్ద గొప్పతనం కూడా ఉండదు. రాజకీయ ప్రత్యర్థులు కూడా ఏ నాయకుడి పనితీరు పట్ల ప్రశంసలు కురిపిస్తారో అప్పుడే ఆయన లక్ష్యాలు నూరు శాతం నెరవేరుతున్నట్టు. విమర్శలకులను సైతం మెప్పించడమే నాయకుడి గొప్పతనానికి నిదర్శనం అన్నట్టు. సరిగ్గా ఇప్పుడు జగన్ విషయంలో అదే జరుగుతోంది. తాజాగా పంచాయితీ ఎన్నికల ఫలితాల తర్వాత దేశమంతా జగన్ చర్చనీయాంశమయ్యారు. ఫుల్ స్వింగ్ లో ఉన్న సమయంలో ఇందిరాగాంధీ వంటి వారి వల్ల కూడా సాధ్యం కాని ఫలితాలు తాజా పంచాయితీ ఎన్నికల్లో జగన్ పార్టీ గెలుచుకుంది. ఏకంగతా 80 శాతం పంచాయితీలను మోడీ కూడా ఎన్నడూ దక్కించుకున్న దాఖలాలు లేవు. అందుకే జగన్ సక్సెస్ మంత్రం మీద పలు రకాల చర్చ మొదలయ్యింది.

జగన్ విషయంలో బీజేపీ నేతలు బహిరంగంగానూ, టీడీపీ నేతలు పరోక్షంగానూ ప్రశంసలు కురిపిస్తున్నారు. ప్రజలు ఆ స్థాయిలో మెచ్చుకున్న తర్వాత నాయకుల తీరు కూడా మారక తప్పదని తాజా పరిణామాలు చాటుతున్నాయి. ఎన్టీఆర్ హయంలో పరిపాలన మండల కేంద్రాలకు చేరితే, జగన్ విప్లవాత్మక నిర్ణయాల మూలంగా పల్లెలకు చేరిందనే అభిప్రాయం వినిపిస్తోంది. సామాన్యులకు సచివాలయాల ద్వారా చేరువ కాగలగిన పాలన మూలంగా ప్రజలంతా జగన్ కి జైజైలు కొడుతున్నారనే విశ్లేషణ వినిపిస్తోంది. తాను ఒక్కడే కష్టపడుతున్నట్టు కనిపించేందుకు చంద్రబాబు శ్రమిస్తే, తన పని మాత్రమే తాను చేస్తూ ఎవరి పని వారు చేసేందుకు అనుగుణమైన వాతావరణం ఏర్పాటు చేయడం ద్వారా జగన్ విజయవంతమయినట్టు కనిపిస్తోంది. రోజూ గంటల కొద్దీ సమీక్షలతో చంద్రబాబు క్షేత్రస్థాయి సిబ్బందిని సైతం సతమతం చేసేవారు. ఏదయినా ప్రకృతి విపత్తు వచ్చిందని తెలియగానే ప్రచార యావతో అక్కడ వాలిపోయారు. ప్రోటోకాల్ అనవసర హంగామాకి ఆస్కారమిచ్చేవారు. ఫలితాలు ఎలా ఉన్నా చంద్రబాబు చాలా కష్టపడుతున్నారనే ఇమేజ్ కోసం విపరీతంగా శ్రమించారు.

జగన్ మాత్రం దానికి భిన్నంగా తన స్థాయిలో సమీక్షలు చేస్తూ అధికారులు, క్షేత్రస్థాయి సిబ్బందికి స్వేచ్ఛనిచ్చారు. తానేమి చేయాలో అదే చేస్తూ పాలనను పట్టాలెక్కించారు. కింది స్థాయిలో సాధారణ ప్రజల వద్దకు చేర్చారు. ఫలితంగా ఏం కావాల్సి వచ్చినా జనం అధికారుల చుట్టూ తిరిగే వాతావరణం పోయింది. వాలంటీర్ల రూపంలో ప్రభుత్వ ప్రతినిధులే జనం వద్దకు రావడం మొదలయ్యింది. ఇది పాలనా విధానంలో పెనుమార్పులకు మూలం అయ్యింది .తద్వారా జనాలకు ప్రభుత్వం చేరవయ్యింది. జనం మనసులు గెలుచుకోవడానికి దోహదపడింది. జగన్ తన పాలనా విధానం ద్వారా ప్రజల్లో మరింత బలపడేందుకు మూలం అయ్యింది. ఇప్పటికే వైఎస్సార్సీపీని ఢీకొట్టడం ఏపీలోని విపక్షాల వల్ల సాధ్యం కాదనే వాదనకు ఆస్కారమిస్తోంది.

ప్రచారార్భాటాలకు దూరంగా ప్రజా సమస్యల పరిష్కారమే ధ్యేయంగా జగన్ తీసుకొచ్చిన మార్పులే ఇప్పుడు ఈ విజయాలకు ప్రధాన కారణం. అదే సమయంలో చంద్రబాబు మాత్రం తన పద్ధతి మార్చుకోలేని పరిస్థితికి వచ్చేశారు. చివరకు విపక్షంలో కూడా గంటల కొద్దీ మీడియా సమావేశాలతో జనాలను మభ్యపెట్టవచ్చనే దురాభిప్రాయంతో సాగుతున్నారు. ఇది పాలకపక్షాన్ని ప్రజలకు మరింత దగ్గర చేరుస్తుండగా, చంద్రబాబు ఉన్న ఇమేజ్ ని కూడా దెబ్బతీసేందుకు దోహదపడుతోంది. ఏమయినా జగన్ ని ప్రస్తుతం విపక్ష నేతలు, విమర్శకులు సైతం అభినందిస్తుండడం రాజకీయంగా కీలక పరిణామం.