కరోనా మహమ్మారి అన్ని రంగాలనూ వణికిస్తోంది. అన్ని రాష్ట్రాలనూ గడగడ లాడిస్తోంది. రాజకీయ రంగంలోనూ ప్రకంపాలు సృష్టిస్తోంది. కరోనా వారియర్స్ గా పిలవబడుతున్న పోలీసులను, డాక్టర్లను, జర్నలిస్టులను, పారిశుధ్య సిబ్బందిని, అధికారులను ఎవ్వరినీ వదలడం లేదు. అందరూ ఈ మహమ్మారి బారిన పడ్డారు. ఈ నేపథ్యంలో అందరిలాగానే ప్రజాప్రతిధులు కూడా టెన్షన్ పడుతూనే ఉన్నారు. ముఖ్యంగా తెలంగాణలోని అధికార పార్టీ నేతలను వైరస్ పట్టి పీడిస్తోంది.
ఇప్పటికే ఇద్దరు ఎమ్మెల్యేలు మహమ్మారి బారిన పడగా తాజాగా.. నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే బిగాల గణేశ్ గుప్తాకు పాజిటివ్ గా నిర్ధారణ అయింది. తెలంగాణకు చెందిన బీజేపీ మాజీ ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి వైరస్ బారిన పడగా.. ఎమ్మెల్యే లలో వైరస్ బారిన పడిన ముగ్గురూ అధికార పార్టీకి చెందిన వారే కావడం.. దీంతో రాజకీయ వర్గాల్లో దీనిపై జోరుగా చర్చ సాగుతోంది. జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి వైరస్ బారిన పడ్డ మొట్ట మొదటి శాసనసభ్యుడు కాగా.. ఆ తర్వాత.. నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్దన్ కు వైరస్ సోకింది. ఈ ముగ్గురిలో ఇద్దరు ఒకే జిల్లాకు చెందిన వారు కావడంతో నిజామాబాద్ లో ఇది తీవ్ర కలకలం రేపుతోంది. ఆ జిల్లాకు చెందిన అధికార పార్టీ నేతలు, ప్రజలు భయాందోళనలో ఉన్నారు.
బిగాల గణేష్ గుప్తా కొంత కాలంగా హైదరాబాద్ లోనే ఉంటున్నారు. శనివారం ఆయన నిజామాబాద్ వెళ్లి అక్కడ క్యాంపు కార్యాలయంలో అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. అయితే.. గతంలో ఆయన ఇప్పటికే పాజిటివ్ వచ్చిన ముత్తిరెడ్డిని, బాజిరెడ్డిని కలిశారు. దీంతో అనుమానం వచ్చి ఎందుకైనా మంచిదని పరీక్షలు చేయించుకున్నారు. పరీక్షల్లో బిగాలకు పాజిటివ్ గా తేలింది. ఆయనకు ఎటువంటి లక్షణాలూ లేకపోవడంతో ఇంట్లోనే చికిత్స పొందుతున్నారు. అయితే.. బాజిరెడ్డికి, గణేశ్ గుప్తాకు ముత్తిరెడ్డి ద్వారా వైరస్ సోకి ఉంటుందని అధికారులు, వైద్యులు అంచనాకు వచ్చినప్పటికీ.. మరి ముత్తిరెడ్డికి వైరస్ ఎలా సోకిందనేది అంతు చిక్కడం లేదు.
సమీక్షలకు దూరం…
కరోనా రాజకీయ నేతలను కూడా చుట్టుముడుతుండడంతో వారు క్షేత్రస్థాయిలోకి రావాలంటేనే భయపడుతున్నారు. సమీక్ష సమావేశాలకు, కార్యక్రమాలకు చాలా మంది దూరంగా ఉంటున్నారు. వీడియో కాన్ఫరెన్స్ లు, ఫోన్లలోనే పనులు కానిచ్చేస్తున్నారు. తెలంగాణలో 119 మంది ఎమ్మెల్యేలు ఉండగా.. వారిలో సుమారు 30 మంది వరకూ 60 ఏళ్లు పైబడిన వారు ఉన్నారు. వాళ్లు ఇంకొంచెం ఆచుతూచి అడుగులు వేయాలని ప్రభుత్వం కూడా సూచించింది.
ఏపీలో ముందస్తు పరీక్షలు
తెలంగాణలోని ముగ్గురు ఎమ్మెల్యేలు వైరస్ బారిన పడడం, నేటి నుంచి అసెంబ్లీ సమావేశాలు ఉండడం వంటి కారణాలతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అప్రమత్తమైంది. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు ముందస్తుగా కరోనా పరీక్షలు నిర్వహించింది. వాటి ఫలితాలు నేడు తెలుస్తాయి. ఒకవేళ ఎవరికైనా పాజిటివ్ వస్తే వారు క్వారంటైన్ లో ఉండాలని ప్రభుత్వం సూచించింది.
8838