iDreamPost
android-app
ios-app

కరెంట్‌కు కోవిడ్‌ చేసిన మేలు ఇదే..

కరెంట్‌కు కోవిడ్‌ చేసిన మేలు ఇదే..

‘ప్రపంచంలో ఎక్కడో జరిగే ఒక యాక్షన్‌.. మరెక్కడో రియాక్షన్‌కు కారణమవుతుంది’ ఇది ఓ సినిమాలో డైలాగ్‌. చైనాలో మొదలై ప్రపంచాన్ని వణికిస్తున్న కోవిడ్‌ విషయంలోనూ ఇదే జరుగుతోంది. కోవిడ్‌ ఎఫెక్ట్‌తో మన దేశంలో ఎన్నో రంగాలు నష్టాలు రుచిచూశాయి. మిర్చి, చేపలు, రొయ్యల ఎగుమతుపై కోవిడ్‌ ప్రభావం బలంగానే పడింది. ఔషధాల్లో ఉపయోగించే ముడి సరుకుల దిగుమతులు చైనా నుంచి ఆగిపోవడంతో ఔషధాల ధరలు పెంచేసుకొని వ్యాపారులు డబ్బులు దండుకుంటున్నారు. తాజాగా నిన్న సోమవారం కోవిడ్‌ ప్రభావంతో స్టాక్‌ మార్కెట్లు పతనమయ్యాయి. దీనికి మాంద్యం, ముడి చమురు ధరలు పడిపోవడంతో ఏకంగా సెన్సెక్స్‌ 1,941 పాయంట్లు పడిపోయింది. స్టాక్‌ మార్కెట్‌ చరిత్రలోనే అత్యంత భారీ నష్టమిది. దాదాపు 7 లక్షల కోట్లు సంపద ఆవిరి అయ్యింది. క్రీడా ప్రపంచాన్నీ కోవిడ్‌ కుదిపేస్తోంది.

కోవిడ్‌ వల్ల జరుతున్న ఇన్ని నష్టాల మాటున ఓ మంచి జరిగింది. అది కరెంటు విషయంలో. సాధారణంగా మార్చి నెలలో పవర్‌ ఎక్స్ఛేంజ్‌లో యూనిట్‌ విద్యుత్‌ ధర రూ. 4.17 ఉంటుందని అంచనా. అయితే కోవిడ్‌ ప్రభావంతో బహిరంగ మార్కెట్లో విద్యుత్‌ ధరలు భారీగా పడిపోయాయి. ప్రస్తుతం యూనిట్‌ ధర బహిరంగ మార్కెట్లో రూ. 2.51కు లభిస్తోంది. కోవిడ్‌ వల్ల విదేశాల్లో పారిశ్రామికోత్పత్తి గణనీయంగా తగ్గిపోవడంతో అక్కడ విద్యుత్‌ వాడకం కూడా పడిపోయింది. దీంతో బొగ్గు వినియోగం కూడా తగ్గింది. గ్యాస్‌ ఆధారిత విద్యుత్‌ ప్లాంట్లను విదేశాల్లో మూసేశారు. ఈ నేపథ్యంలో భారత్‌కు గ్యాస్, బొగ్గు దిగుమతి పెరుగుతోంది. అదీ తక్కువ ధరకే. దీంతో విద్యుత్‌ ఉత్పత్తి పెరిగింది. ఎండాకాలం మొదలవుతుండడంతో ఉత్తరాది రాష్ట్రాల్లో మంచు కరిగి ప్రవహిస్తోంది. ఈ క్రమంలో జల విద్యుత్‌ ఉత్పత్తి కూడా పెరిగింది. ఇలా పెరిగిన విద్యుత్‌ ఉత్పత్తితో బహిరంగ మార్కెట్లో ఆయా సంస్థల మధ్య పోటీ నెలకొంది. ధరలు భారీగా పడిపోయాయి. దీన్ని అనుకూలంగా మలుచుకోవడానికి ఆయా రాష్ట్రాలు ప్రయత్నాలు మొదలుపెట్టాయి.

ఆంధ్రప్రదేశ్‌లోనూ చౌక విద్యుత్‌ కొనుగోలుపై అధికారులు దృష్టి సారించారు. రోజుకు 12 మిలియన్‌ యూనిట్ల మేర విద్యుత్‌ కొనుగోలు చేస్తున్నారు. అధిక ధర ఉన్న ఆర్టీపీపీ ధర్మల్‌ విద్యుత్‌ను 1,400 మెగావాట్ల మేర ఆపేశారు. దీంతో వచ్చే ఎండాకాలంలో ఇబ్బందులు తలెత్తకుండా అక్కడ బొగ్గు నిల్వలు పెంచుతున్నారు. తద్వారా రెండు రకాలుగా ప్రయోజనం ఉంటుందని అధికారులు చెబుతున్నారు. రానున్న వారంలో బహిరంగ మార్కెట్‌ నుంచి మరింత చౌక విద్యుత్‌ను కొనుగోలు చేసేందుకు సిద్దమవుతున్నారు.