ఇంగ్లండ్ పర్యటన కోసం బయల్దేరెందుకు సిద్ధం అవుతున్న పాక్ క్రికెట్ జట్టుకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. మొత్తం పది మంది ఆటగాళ్లకు కరోనా సోకినట్లు నిర్దారణ కావడంతో సిరీస్ నిర్వహణ ప్రశ్నార్థకంగా మారింది.
సోమవారం ముగ్గురు పాక్ ఆటగాళ్ళు హైదర్ అలీతో పాటు షాదాబ్ ఖాన్, హారిస్ రవూఫ్‌లకు కరోనా నిర్దారణ అయిన సంగతి తెలిసిందే. తాజాగా మరో ఏడుగురికి కరోనా నిర్దారణ అయింది. కరోనా సోకిన వారిలో ఫఖర్ జమాన్, ఇమ్రాన్ ఖాన్, కాశీఫ్ భట్టి, మహ్మద్ హఫీజ్, మహ్మద్ హస్నైన్, మహ్మద్ రిజ్వాన్, వహాబ్ రియాజ్‌లు ఉన్నారు.వీరితో పాటు పాక్ సీనియర్ ఆటగాడు షోయబ్ మాలిక్‌తో పాటు పాక్ జట్టు ప్రధాన కోచ్ వకార్ యూనిస్, ఫిజియోథెరపిస్ట్ క్లిఫ్ డెకాన్ ఫలితాలు రావాల్సి ఉంది.
ఇంగ్లండ్ పర్యటన కోసం ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా నిర్వహించిన కరోనా టెస్టుల్లో 10 మంది ఆటగాళ్లు కరోనా బారిన పడునట్లు తేలడంతో పాక్ క్రికెట్ బోర్డ్ లో ఆందోళన నెలకొంది.మూడు టెస్టులు, మూడు టీ20ల సిరీస్ కోసం ఈ నెల 28న పాక్ జట్టు ఇంగ్లాండ్‌కు బయల్దేరాల్సి ఉంది.కాగా కరోనా సోకినట్లు నిర్దారణ కావడంతో క్రికెటర్లంతా స్వీయ నిర్బంధంలోకి వెళ్లారు. వీరిని పీసీబీ వైద్య బృందం పర్యవేక్షిస్తోంది. మూడు టెస్టులు,మూడు టీ20 లకు 29 మంది పాక్ ఆటగాళ్లను ఎంపిక చేయగా వారిలో 10 మంది కరోనా బారిన పడ్డారు.
కాగా సిరీస్ వచ్చే నెల చివర్లో ప్రారంభం కావాల్సి ఉండడంతో కరోనా సోకిన ఆటగాళ్లనే సిరీస్ కి పంపుతారా లేక మరో 10 మంది ప్రత్యామ్నాయ ఆటగాళ్లను ఎంపిక చేస్తార అన్న సందిగ్ధం నెలకొంది. ఇంగ్లాండ్ చేరిన తర్వాత పాక్ ఆటగాళ్లు 14 రోజుకు క్వారెంటయిన్ లో ఉంటారని తెలుస్తుంది. ఇప్పటికే కరోనా సోకిన ఆటగాళ్లు స్వీయ నిర్బంధంలోకి వెళ్లడంతో అప్పటికి కోలుకుంటారన్న ఊహాగానాలు వెలువడుతున్నాయి. అయితే పాక్ ఆటగాళ్లు ఎంత మందికి కరోనా సోకినా సరే ఈ సిరీస్ మాత్రం నిర్వహించాలనే పట్టుదలతో ఉన్నామని ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డు ఉన్నతాధికారి గైల్స్ క్లార్క్ పేర్కొనడం విశేషం.
9089