కరోనా వైరస్ పూర్తిగా తగ్గే వరకూ బయటకు రానని ప్రకటించిన ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నేత నారా చంద్రబాబు నాయుడు ప్రజలు తనను. తన పార్టీని మరచిపోకుండా ఉండేందుకు ఉనికిపాట్లు పడుతున్నారు. క్షేత్రస్థాయిలోని కార్యకర్తలు, ద్వితియ శ్రేణి నేతలు పార్టీకి దూరం కావడమో లేదా స్తబ్ధుగా ఉండడమో చేస్తుండడంతో చంద్రబాబుకు ఏమి చేయాలో పాలుపోవడం లేదు. కరోనా వైరస్ ఎప్పుడు తగ్గుతుంది..? బాబు బయటకు ఎప్పుడు వస్తారనేది మిలియన్ డాలర్ల ప్రశ్నగా మారింది.
ఈ నేపథ్యంలో తెలుగుదేశం పార్టీని ప్రజల్లో ఉంచేందుకు చంద్రబాబు తంటాలు పడుతున్నారు. ఈ క్రమంలోనే తాజాగా ‘ఏపీ ఫైట్స్ కరోనా’ అనే పేరుతో వెబ్‌సైట్‌ను ప్రారంభించారు. ఏపీ ప్రజలు తమ సమస్యలను ఈ వెబ్‌సైట్‌లో నమోదు చేసుకుంటే.. తమ పార్టీ తరఫున అధికారులకు పంపించి సమస్యలు పరిష్కారించే ప్రయత్నం చేస్తామని చంద్రబాబు పేర్కొన్నారు. కరోనాకు సంబంధించి ఏ కష్టమైన తెలపవచ్చంటున్నారు. ప్రజలతోపాటు స్వచ్ఛంద కార్యకర్తలైనా ప్రజల తరఫున సమస్యలను తమ వెబ్‌సైట్ లో నమోదు చేయాలని కోరుతున్నారు. ఉపాధి కోల్పోవడం, మందులు దొరక్కపోవడం, సకాలంలో అంబులెన్స్‌లు రాకపోవడం, నిత్యవసరాల కొరత, పంట నష్టం, ప్రభుత్వం నుంచి పరిహారం రాకపోవడం.. ఇలా ఏదైనా సమస్యను వెబ్‌సైట్‌లో నమోదు చేయాలని చంద్రబాబు సూచిస్తున్నారు. వచ్చే సమస్యలను నియోజకవర్గాలు, జిల్లాల వారీగా క్రోడీకరించి సంబంధిత అధికారులకు పంపిస్తామని చెబుతున్నారు.
అధికార పార్టీ అయినా, ప్రతిపక్ష పార్టీలైనా నిత్యం ప్రజల్లో ఉంటూ, వారి సమస్యలను తెలుసుకుని పరిష్కరిస్తేనే ఆదరణ ఉంటుందని దేశంలోనే సీనియర్ రాజకీయ నాయకుడైన చంద్రబాబుకు తెలియంది కాదనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. అయినా ఇలాంటి ప్రయత్నం చేయడం తప్పా తాను గానీ, తన కుమారుడు గానీ, పార్టీ శ్రేణులు గానీ ప్రజల్లోకి వెళ్లే అవకాశం లేదు. గ్రామాల్లోగానీ, పట్టణాలల్లోగానీ సమస్యలు ఎదుర్కొనే ప్రజలు తమ సమస్యలను సమీపంలో ఉన్న ప్రజా ప్రతినిధికి లేదా అధికారి దృష్టికి వెళతారు. అంతేగానీ పెద్దగా అవగాహణ లేని వెబ్‌సైట్‌కు వెళ్లి సమస్యలు చెప్పే అవకాశాలు చాలా తక్కువ.
అయినా చంద్రబాబు తాపత్రయం తప్పా ఈ వెబ్‌సైట్ వల్ల ఉపయోగం ఉండదంటున్నారు. ఎందుకంటే కరోనా వైరస్‌పై దేశంలోనే ఆంధ్రప్రదేశ్ పోరాటం గొప్పగా ఉందనే ప్రశంసలు దక్కుతున్నాయి. గ్రామ, వార్డు సచివాలయాల ద్వారా వాలంటీర్లు, ప్రభుత్వ సిబ్బంది, ఆశా కార్యకర్త, ఏఎన్‌ఎం, హెల్త్ అసిస్టెంట్ అందుబాటులో ఉంటున్నారు. వీరితోపాటు టెలి మెడిసిన్‌ను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. కరోనా సహా ఏ అనారోగ్య సమస్య అయినా ప్రజలు 14410 టోల్ ఫ్రి నంబర్‌కు ఫోన్ చేస్తే చాలు.. డాక్టర్లు వారి సమస్యలను తెలుసుకుని 24 గంటల్లో సచివాలయ హెల్త్ అసిస్టెంట్, వాలంటీర్ ద్వారా మందులు పంపిస్తున్నారు.
ఇక కరోనా వైరస్ వల్ల దేశంలోని ఇతర రాష్ట్రాలలోని పేద, మధ్య తరగతి ప్రజలు ఇబ్బందులు పడినా.. ఏపీలో మాత్రం ఆర్థికపరమైన సమస్యలు ఎదుర్కొలేదు. వరుసగా వివిధ సంక్షేమ పథకాల ద్వారా జగన్ సర్కార్ నేరుగా లబ్ధిదారుల ఖాతాలోనే నగదును జమ చేస్తోంది. అంతేకాకుండా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నెలకు రెండు సార్లు రేషన్‌కార్డుదారులకు ఉచితంగా సరుకులు పంపిణీ చేస్తున్నాయి. రెండు ప్రభుత్వాల ద్వారా రేషన్‌కార్డుదారులకు నెలకు కేజీ కందిపప్పు, అరకేజీ చక్కెర, కేజీ శెనగలు, సభ్యుడుకి పది కేజీల చొప్పన బియ్యం ఉచితంగా అందుతున్నాయి. ఈ పథకం నవంబర్ వరకూ కొనసాగనుంది. ఆ తర్వాత పరిస్థితులను బట్టి కొనసాగించే అవకాశాలు ఉన్నాయి.
తమ ఇంటికి వస్తున్న వాలంటీర్‌కి చెబితే పరిష్కారమయ్యే సమస్యలను ప్రజలు.. టీడీపీ ప్రారంభించిన వెబ్‌సైట్‌లోకి వెళ్లి పరిష్కారం కోసం ఎదురుచూస్తారా..? అనే ప్రశ్నకు ఎవరికైనా సులువుగా జవాబు దొరుకుతుంది.
Read Also; సొంత ఇళ్లా..? అద్దె ఇళ్లా..?
12094