iDreamPost
android-app
ios-app

కరోనాతో మృతుల అంత్యక్రియల కష్టాలు

కరోనాతో మృతుల అంత్యక్రియల కష్టాలు

కరోనా వైరస్ ఎక్కడనుండి వచ్చిందో తెలియదు కానీ మనుషులను పూర్తిగా అంటరానివారిగా మార్చేసింది. భౌతిక దూరం పాటించాలంటూ ప్రభుత్వాలు లాక్ డౌన్ విధించేలా చేసింది కరోనా వైరస్.. ఇప్పుడు కరోనా కారణంగా మనుషుల్లో మానవత్వం కూడా అంతరించి పోయే దశకు చేరుకుంది. కరోనా వైరస్ మహమ్మారి వల్ల అంతిమ సంస్కారాలు కూడా జరిపించలేని విధంగా పరిస్థితులు దిగజారాయి.

వివరాల్లోకి వెళితే గుంటూరులో కరోనా వైరస్ కారణంగా చనిపోయిన వ్యక్తికి అంతిమ సంస్కారాలు జరగనీయకుండా స్థానికులు అడ్డుకున్నారు. తుఫాన్‌నగర్‌, మారుతీనగర్‌, రైలుకట్ట, భాగ్యనగర్‌ తదితర సమీప కాలనీలకు చెందినవారు పెద్ద సంఖ్యలో స్తంభాలగరువు మహాప్రస్థానంవద్దకు చేరుకుని ఆటోలు, బండ్లు అడ్డంపెట్టి నిరసనకు దిగారు.

అక్కడ దహన సంస్కారాలు నిర్వహించడానికి వీల్లేదని ఆందోళన వ్యక్తం చేశారు స్థానికులు.. గతంలో గ్యాస్ హీటర్ పై దహనం చేస్తామని కట్టెలపైనే కరోనా పాజిటివ్ మృతదేహాలను దహనం చేసారని కాబట్టి ఈసారి ఇక్కడ కరోనా పాజిటివ్ మృతదేహాన్ని దహనం చేయడానికి వీల్లేదంటూ అంబులెన్స్ పై దాడికి దిగడంతో పోలీసులు లాఠీ ఛార్జ్ చేసారు.మహాప్రస్థానం ప్రతినిధి లక్ష్మణరావు వచ్చి మృతదేహాన్ని గ్యాస్‌పై దహనం చేస్తున్నామని వారికి సూచించారు. 800డిగ్రీల సెల్సియస్‌పైగా ఉష్ణోగ్రతతో మృతదేహాన్ని దహనం చేస్తామని బాయిలర్‌ను వారికి చూపారు. పొగ గొట్టం 100 మీటర్ల ఎత్తులో ఉంటుందని వివరించారు. దీంతో స్థానికులు శాంతించారు. తర్వాత మృతదేహానికి అంత్యక్రియలు పూర్తిచేశారు. తిరిగి అంబులెన్స్ వెళ్లే సమయంలో కూడా స్థానికులు మరోసారి రాళ్ళదాడికి దిగారు..

కరోనా వల్ల పరిస్థితి మారిపోయిందని భౌతిక దూరం పాటించాలని అధికారులు, నిపుణులు హెచ్చరిస్తున్నారు. కాగా ఆంధ్రప్రదేశ్ లో 1016 మందికి కరోనా పాజిటివ్ గా నిర్దారణ కాగా 31 మంది మృతిచెందారు.