అనుకున్నదే తడవుగా సంక్షేమ పథకాలు, అభివృద్ధి పనుల వైపునకు అడుగులు వేస్తున్న ఆంధ్రప్రదేశ్‌లోని వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి ప్రభుత్వం.. అంతే స్పీడుగా వాటిని ఆచరణలో పెడుతోంది. అభివృద్ధి పనులకు అవసరమైన నిధులు వివిధ రూపాల్లో సమకూర్చుకుంటోంది. విధాన పరమైన నిర్ణయాలు, పరిపాలన సంస్కరణలతో దేశం దృష్టిని ఆకర్షించిన వైఎస్ జగన్ ప్రభుత్వంపై బ్యాంకులు కూడా సంపూర్ణ విశ్వాసంతో ఉన్నట్లు ఐదు మెడికల్ కాలేజీలకు నిధులు కావాలని అడిగిన మరుసటి రోజే ఇచ్చేందుకు సిద్ధమని బ్యాంకు సమ్మతి తెలియజేయడం ఇందుకు ప్రత్యక్ష ఉదహరణగా నిలుస్తోంది.
ప్రతి పార్లమెంట్ నియోజకవర్గంలో ప్రభుత్వ మెడికల్ కాలేజీ ఉండాలనే లక్ష్యంతో రాష్ట్రంలో నూతనంగా 16 మెడికల్ కాలేజీలు ఏర్పాటు చేయాలని వైఎస్ జగన్ ప్రభుత్వం సంకల్పించింది. ఇందులో భాగంగా రాజమహేంద్రవరం, అనకాపల్లి, మదనపల్లి, అమలాపురం, ఏలూరు, నరసాపురంలలో ఐదు మెడికల్ కాలేజీలను నిర్మించాలని ఈ ఏడాది సెప్టెంబర్ 12వ తేదీన జీవోలు జారీ చేసింది. ఐదు మెడికల్ కాలేజీలకు వేర్వేరుగా అంచనాలు రూపాందించింది.
రాజమహేంద్రవరంలో నిర్మించే మెడికల్ కాలేజీకి 500 కోట్ల రూపాయలు, అనకాపల్లి 525. మదనపల్లి 525, అమలాపురం, ఏలూరు, నరసాపురంలలో 550 కోట్ల రూపాయల చొప్పున వ్యయం అవుతుందని అధికారులు అంచనాలు రూపొందించారు. ఈ ఐడు మెడికల్ కాలేజీలకు 3200 కోట్ల రూపాయలు వ్యయం అవుతుందని, ఈ నిధులు సమకూర్చాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కెనరా బ్యాంకుకు ఈ నెల 18వ తేదీన లేఖ రాసింది. వెంటనే స్పందించిన కెనరా బ్యాంకు ఉన్నతాధికారులు భేషరుతుగా నిధులు మంజూరు చేసేందుకు సమ్మతి తెలియజేస్తూ మరుసటి రోజే.. అంటే ఈ నెల 19వ తేదీన ఆర్థిక శాఖ కార్యదర్శికి లేఖ రాశారు. నిధులు మంజూరు చేసేందుకు సంబంధిత ప్రాజెక్టుల డిటైల్ ప్రాజెక్టు రిపోర్ట్(డీపీఆర్)లు పంపాలని కోరారు.
మరికొద్ది రోజుల్లో కెనరా బ్యాంకు నుంచి నిధులు మంజూరవడం ఖాయం కావడంతో.. రాజమహేంద్రవరం, అనకాపల్లి, మదనపల్లి, అమలాపురం, నరసాపురం, ఏలూరుల్లో ప్రభుత్వ మెడికల్ కాలేజీల నిర్మాణాలు ప్రారంభం కానున్నాయి. వీటితోపాటు గురజాల, మార్కాపురం తదితర ప్రాంతాలలోనూ మెడికల్ కాలేజీల నిర్మాణాలకు మంత్రివర్గం ఇప్పటికే ఆమోదం తెలిపింది.
13499