iDreamPost

కాపులుప్పాడ కొండపై ప్రభుత్వం చూపు

కాపులుప్పాడ కొండపై ప్రభుత్వం చూపు

మూడు రాజధానుల ఏర్పాటుపై ఏపీ ప్రభుత్వం తన పని తాను చేసుకుపోతోంది. కర్నూలును న్యాయ రాజధానిగా ప్రకటించిన ప్రభుత్వం హైకోర్టును అక్కడకు తరలించేందుకు చర్యలు తీసుకోవాలని ఇప్పటికే కేంద్రానికి విన్నవించింది. ఇక విశాఖను కార్యనిర్వాహఖ రాజధానిగా ప్రకటించిన తర్వాత అక్కడ సచివాలయం, విభాగాధిపతుల కార్యాలయాలు ఏర్పాటుకు అనువైన భవనాలు, నిర్మాణానికి భూముల అన్వేషణ కొనసాగిస్తోంది.

సచివాలయాన్ని మధురవాడలోని మిలీనియం టవర్స్‌లో ఏర్పాటు చేయాలని తొలుత భావించినా.. అక్కడ ఐటీ కంపెనీలు ఉండడంతో ఆ ప్రతిపాదనను తాత్కాలికంగా పక్కనపెట్టినట్లు సమాచారం. ఈ నేపథ్యంలోనే మిలీనియం టవర్స్‌కు పక్కనే ఉన్న కాపులుప్పాడ కొండపై సచివాలయం ఏర్పాటుకు ఉన్న అవకాశాలను పరిశీలిస్తున్నారు. గతంలో కాపులుప్పాడ కొండపై ఐటీ సంస్థల కోసం ప్రభుత్వం ఐటీ లే అవుట్స్‌ను ఏర్పాటు చేసింది. ఆ కొండపై అధాని సంస్థ డేటా పార్క్‌ను ఏర్పాటు చేస్తామని ప్రకటించడంతో ఆ కొండ మొత్తాన్ని సదరు సంస్థకే కేటాయించింది. అయితే 70 వేల కోట్ల పెట్టుబడులు పెడతామన్న అధాని సంస్థ ఆ తర్వాత మూడు వేల కోట్ల పెట్టుబడులకు ప్రణాళిక ఇవ్వడంతో… ఆ పెట్టుబడులకు తగిన భూమిని మరో చోట ఇచ్చేందుకు ప్రభుత్వం ఆలోచన చేస్తున్నట్లు తెలుస్తోంది.

కాపులుప్పాడ కొండపై మొత్తం 1350 ఎకరాల స్థలం అందుబాటులో ఉంది. ఇప్పటికే 250 ఎకరాల స్థలం లే అవుట్‌ వేయగా రహదారులు, ఇతర అవసరాలకు పోను175 ఎకరాల స్థలం అందుబాటులోకి వచ్చింది. కాపులుప్పాడ కొండను ఆనుకుని ఉన్న మరో కొండపై 600 ఎకరాల భూమి ఉంది. ఈ రెండింటిని కలపడం వల్ల దాదాపు రెండు వేల ఎకరాల భూమి అందుబాటులోకి వస్తుంది. ఇక్కడ సచివాలయం, విభాగాధిపతుల భవనాలను యుద్ధ ప్రాతిపదికను నిర్మిస్తే ఎలా ఉంటుందన్న అంశంపై ప్రభుత్వం ఆలోచన చేస్తోంది. ఉగాది నాటికి విశాఖలో సచివాలయం ఏర్పాటు అంశం కొలిక్కి రానుంది.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి