iDreamPost

వాళ్లే నా బలం అంటున్న జగన్

వాళ్లే నా బలం అంటున్న జగన్

ఏపీ ముఖ్యమంత్రిగా ఏడాది పదవీకాలం పూర్తి చేసుకుంటున్న సందర్భంలో జగన్ దూకుడు పెంచుతున్నట్టు కనిపిస్తోంది. ఇప్పటికే తన భవిష్యత్ ప్రణాళికకు సంబంధించి ఏడాది క్యాలెండర్ విడుదల చేశారు. అదే సమయంలో కరోనా మీద మరింత క్లారిటీకి ఇచ్చేశారు. ఇప్పటికే కరోనా వైరస్ ప్రభావం ప్రారంభమయిన నాటి నుంచి ఆయన ముందుచూపు ప్రదర్శిస్తున్నారు. జగన్ తొలుత చెప్పిన రీతిలోనే ఆ తర్వాత అందరూ అనుసరించడం అనేక విధాలుగా స్పష్టం అయ్యింది. వాస్తవంగా చెప్పాలంటే లాక్ డౌన్ సడలింపు విషయంలో జగన్ వ్యాఖ్యలను అందరూ వల్లించడం విశేషంగా చెప్పవచ్చు. కరోనాతో సహజీవనం తప్పదని తొలుత జగన్ చెప్పగానే చాలామంది ఆశ్చర్యపోయారు. కొందరు దాని మీద కూడా వక్రభాష్యాలతో విమర్శలకు దిగారు. కానీ తీరా చూస్తే కేసీఆర్ నుంచి మోడీ వరకూ, చివరకు డబ్ల్యూ హెచ్ ఓ కూడా అదే మాట చెప్పడంతో అంతా ఆశ్చర్యపోయారు. ఇక అదే పరంపరలో జగన్ మరో వ్యాఖ్య చేసి ఆసక్తి రేపారు. భవిష్యత్ లో ప్రతీ ఒక్కరూ కరోనా వైరస్ ప్రభావానికి గురికాక తప్పదన సంకేతాలను ఏపీ సీఎం ఇచ్చేశారు. అందుకు తగ్గట్టుగా అందరూ సన్నద్ధం కావాలని చెప్పేశారు. మానసికంగా సిద్ధమయితే మహహ్మారిని ఎదుర్కోవచ్చని సూచించారు. అదే క్రమంలో ప్రజలను సన్నద్ధం చేయాలని కలెక్టర్లు, ఎస్పీలను ఆదేశించారు.

సీఎం జగన్ నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ లో ఆయన చేసిన వ్యాఖ్యలు ఆసక్తి రేపుతున్నాయి. తనకు మంచి టీమ్ దొరికిందనే సంకేతాలు సీఎం ఇచ్చేశారు. కలెక్టర్లు, ఎస్పీలే తన బలం అని చెప్పేశారు. వారంతా సమర్థవంతంగా పనిచేస్తున్నారని కితాబునిచ్చారు. సీఎస్, డీజీపీ తో పాటుగా అందరూ సహకరించడంతోనే ప్రభుత్వం అనేక సమస్యలను అధిగమించిందనే అభిప్రాయం వ్యక్తం చేశారు. కలెక్టర్లకు అన్నిరకాలు తోడుగా ఉండడానికి ముగ్గురు జేసీల వ్యవస్థను తీసుకు వచ్చాం అంటూ చెప్పారు. మీరంతా యువ ఐఏఎస్‌ అధికారులు అంటూనే మీరు బాగా చేస్తే.. మీరు మంచి ఎలివేషన్‌ పొందుతారని వారినుద్దేశించి వ్యాఖ్యానించారు. లిక్కర్‌ అండ్‌ శాండ్‌ మీద కూడా కొందరు యువ ఐపీఎస్‌లను పెట్టామని, నిజాయితీ కూడిన వ్యవస్థగా పనిచేయాలని సూచించారు. ఎవరున్నా కూడా ఉపేక్షించాల్సిన పనిలేదని చప్పడం ద్వారా ఎస్పీలకు సీఎం స్పష్టత ఇచ్చేసినట్టు కనిపిస్తోంది.

లాక్ డౌన్ విషయంలో సడలింపులు వచ్చిన నేపథ్యంలో ఆర్థిక వ్యవస్థ పునరుత్తేజానికి ప్రయత్నం చేయాలని సీఎం ఆదేశాలు జారీ చేశారు. కోవిడ్‌ –19 నివారణపై దృష్టి కొనసాగిస్తూనే, మరోవైపు ఆర్థిక వ్యవస్థను ప్రారంభించాల్సిన అవసరం ఉందన్నారు. ఎకానమీ పూర్తిగా ఓపెన్‌ కావాలని, దీంట్లో కలెక్టర్లు, ఎస్పీలు భాగస్వామ్యం కావాలన్నారు. షాపింగ్‌ మాల్స్, సినిమా థియేటర్లు, మతపరమైన కార్యక్రమాలు, సదస్సులు ఇవి తప్ప మిగిలిన చోట్ల కలెక్టర్లు తగిన జాగ్రత్తలు తీసుకుని వాటిని ప్రారంభించాల్సి ఉందని తేల్చి చెప్పేశారు. ఆగష్ట్ 3 నుంచి స్కూళ్లు ప్రారంభిస్తామని చెప్పారు. ఆర్టీసీ బస్సులకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు వెల్లడించారు. మొత్తంగా సీఎం కలెక్టర్లనుద్దేశించి చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశం అవుతున్నాయి. గత సీఎంకి భిన్నంగా అధికారులకు సంపూర్ణ అధికారులు ఇచ్చి, వ్యవస్థను గాడిలో పెట్టేందుకు ప్రయత్నిస్తున్నట్టు అంతా భావిస్తున్నారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి