iDreamPost

పిఎం కేర్స్ పై కేంద్రానికి ముంబాయి హైకోర్టు నోటీసులు: రెండు వారాల్లోగా స్పందించాలని ఆదేశం

పిఎం కేర్స్ పై కేంద్రానికి ముంబాయి హైకోర్టు నోటీసులు: రెండు వారాల్లోగా స్పందించాలని ఆదేశం

కరోనా వైరస్ నియంత్రణకు నిధులు సేకరించేందుకు ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ప్రవేశపెట్టిన పిఎం కేర్స్ నిధిపై వివాదం రేగుతుంది. తొలి నుంచి దానిపై ప్రతిపక్షాలు విమర్శలు చేస్తున్నాయి. దానికి ఆడిట్ లేదని, ప్రజలిచ్చిన కోట్లు ఎక్కడికి పోతున్నాయని కేంద్రాన్ని నిలదీస్తున్నాయి. మరోవైపు సమాచార హక్కు కార్యకర్తలు, సామాజిక కార్యకర్తలు పిఎం కేర్స్ పై ఆర్టీఐ దరఖాస్తులు దాఖలు చేసి…దాని సమాచారం అడుగుతున్నారు. అయితే పిఎం కేర్స్ ప్రభుత్వ సంస్థ కాదని, ప్రైవేట్ సంస్థ అని కేంద్రం ఇటీవలి ఆర్టీఐకి సమాధానం ఇవ్వడంతో ప్రతిపక్షాల విమర్శలు మరింత పెరిగాయి. అయితే తాజాగా ఇదే అంశంపై ముంబాయి హైకోర్టు విచారణ జరిపింది. రెండు వారాల్లోగా స్పందించాలని కేంద్ర ప్రభుత్వానికి నోటీసులు కూడా ఇచ్చింది.

పిఎం కేర్‌ ఫండ్‌పై కేంద్ర ప్రభుత్వానికి ముంబయి హైకోర్టులోని నాగపూర్‌ బెంచ్‌ నోటీసులు జారీ చేసింది. ఫండ్‌ పేరుతో వసూలు చేసిన నగదు మొత్తం, వాటి వినియోగానికి సంబంధించిన వివరాలను రెండు వారాల్లోగా సమర్పించాలని, అలాగే కేంద్ర ప్రభుత్వ వైఖరికి సంబంధించిన అఫిడవిట్‌ను దాఖలు చేయాలని జస్టిస్‌ ఎస్‌బి. శుక్రే, జస్టిస్‌ ఎఎస్‌.కిలోర్‌లతో కూడిన డివిజన్‌ బెంచ్‌ ఆదేశించింది.

నాగపూర్‌కు చెందిన న్యాయవాది అరవింద్‌ వాఘ్మారే దాఖలు చేసిన పిటిషన్‌ను ధర్మాసనం విచారించింది. పిఎం కేర్స్‌ ఫండ్‌ కింద సేకరించిన నగదు మొత్తాన్ని సాధారణ ప్రజల కోసం ప్రభుత్వ వెబ్‌సైట్‌లో ఎప్పటికప్పుడు ప్రచురించాలని పిటిషన్‌లో కోరారు. బోర్డ్‌ ఆఫ్‌ ట్రస్టీలచే నామినేట్‌ చేసిన ఆడిటర్‌కు బదులుగా కంప్ట్రోలర్‌ అండ్‌ ఆడిటర్‌ జనరల్‌ (కాగ్‌) ద్వారా ఫండ్‌ను ఆడిట్‌ చేయాలని ఆయన కోరారు.

పిఎంకేర్స్‌ ఫండ్‌ ట్రస్టీలో ఇప్పుడున్న సభ్యులతో పాటు ప్రతిపక్షాలకు చెందిన మరో ఇద్దరు సభ్యులను నామినేట్‌ చేయాలని పిటిషనర్‌ తెలిపారు. కేంద్ర ప్రభుత్వం తరపున హాజరైన అదనపు సొలిసిటర్‌ జనరల్‌ అనిల్‌ సింగ్‌ ఈ పిటిషన్‌ను కొట్టేయాలని కోరారు.

పిఎం కేర్స్‌ ఫండ్‌కు వ్యతిరేకంగా ఏప్రిల్‌లో దాఖలైన పిటిషన్‌ను సుప్రీం కోర్టు తిరస్కరించిందని ఆయన డివిజన్‌ బెంచ్‌కు తెలిపారు. కరోనా మహమ్మారి వంటి జాతీయ విపత్తులు సంభవించినపుడు, లేదా జాతీయ అత్యవసర పరిస్థితిని ఎదుర్కొనేందుకు జాతీయ నిధి ఉండాలనే ప్రాథమిక లక్ష్యంతో ‘ప్రైమ్‌ మినిస్టర్‌ సిటిజన్‌ అసిస్టెన్స్‌ అండ్‌ రిలీఫ్‌ ఇన్‌ ఎమర్జెన్సీ సిట్యువేషన్స్‌ ఫండ్‌ (పిఎం- కేర్స్‌ ఫండ్‌) ను ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి