ఆంధ్రప్రదేశ్ లో రాజకీయం రోజు రోజుకు హీటెక్కుతుంది. ముఖ్యంగా చంద్రబాబు అరెస్ట్ అనంతరం ఏపీలో రాజకీయం మరింత వేడెక్కింది. గురువారం జనసేన అధినేత మీడియాతో మాట్లాడుతూ.. వచ్చే ఎన్నికల్లో టీడీపీతో పొత్తు ఉంటుందని స్పష్టం చేశారు. ఇక పవన్ చేసిన వ్యాఖ్యలపై వైసీపీ నేతలు తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పిస్తున్నారు. ఇప్పటి వరకు వేసుకున్న ముసుగును పవన్ కల్యాణ్ తొలిగించారంటూ వైసీపీ మంత్రులు కౌంటర్ ఇచ్చారు. తాజాగా రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి జోగి రమేష్ కూడా పవన్ పై ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు అవినీతి కేసులో అరెస్టై జైలులో ఉంటే.. పవన్ కల్యాణ్ పరామర్శకు వెళ్లి పొత్తులు మాట్లాడుకున్నారని మంత్రి మండిపడ్డారు.
శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ.. టీడీపీ, జనసేన పొత్తుపై కీలక వ్యాఖ్యలు చేశారు. పవన్ కల్యాణ్ బీజేపీతో సంసారం చేస్తూనే టీడీపీతో కలిశారని జోగి రమేశ్ విమర్శించారు. స్కిల్ స్కాంలో పవన్ పాత్ర కూడా ఉందని.. చంద్రబాబు తన అవినీతిలో పవన్‌కు ఎంత వాటా ఇచ్చారని ఆయన ప్రశ్నించారు. చంద్రబాబు చేసిన అవినీతి, అక్రమాల్లో పవన్ కల్యాణ్ భాగస్వామి కాదా? అని నిలదీశారు. పవన్, చంద్రబాబులు ఎప్పటి నుంచే కలిసే ఉన్నారని.. ఇప్పుడు కొత్తగా కలవడం ఏంటని ఆయన ఎద్దేవా చేశారు. చంద్రబాబు చేసిన అవినీతి రాష్ట్ర ప్రజలందరికీ తెలుసని.. చంద్రబాబు చేసిన పాపాలు పండి.. జైలుపాలయ్యారని మంత్రి దుయ్యబట్టారు.
సీఎం జగన్‌తో యుద్ధమంటే 5 కోట్ల మంది ప్రజలతో యుద్ధం చేయడమేనని ఆయన కౌంటర్ ఇచ్చారు. సీఎం జగన్ పాలనలో అన్ని వర్గాలకు సంక్షేమం, అభివృద్ధి జరుగుతోందని తెలిపారు. ఇద్దరు మెంటల్ వ్యక్తుల మధ్యలో ఒక పీకే కనిపించాడని, పవన్ సినిమా తీయాలనుకుంటే ఇదే పేరు పెట్టుకోవచ్చని మంత్రి సెటైర్ వేశారు. ట్యాగ్ లైన్ కింద బొక్కలో బాబు, 7691 అని పెట్టుకోవచ్చని సెటైర్ వేశారు. జైలులోకి పవన్ వెళ్లేటప్పుడు బీజేపీతో ఉండి.. అక్కడ చంద్రబాబుతో తాళి కట్టించుకుని టీడీపీతో పొత్తు పెట్టుకున్నారు. బయటకు వచ్చాక పొత్తు ప్రకటన చేశారని మంత్రి జోగి రమేశ్ దుయ్యబట్టారు. మరీ..మంత్రి జోగి రమేశ్ వ్యాఖ్యలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.